
రామాయపట్నం లైట్ హౌస్
ఒంగోలు: రాజకీయ కారణాల నేపథ్యంలో ప్రకాశం జిల్లా నుంచి చేజారిపోయిందనుకున్న రామాయపట్నం పోర్టు తాజాగా తెరమీదికొచ్చింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పులికాట్ సరస్సు గుర్తింపు రద్దుకు వన్యప్రాణి, పర్యావరణ శాఖలు అభ్యంతరం పెట్టడం దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణానికి ప్రతికూలతగా మారింది. ఈ నేపథ్యంలో రామాయపట్నం పోర్టుకు సంబంధించి వనరులు, అనుకూలతలపై కేంద్రం సమాలోచనలు చేస్తోందనే సమాచారం జిల్లా ప్రజల్లో ఆశల్ని చిగురింపజేస్తోంది.
గతంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి భారీ ఓడరేవును మంజూరు చేసింది. పోర్టు నిర్మాణానికి అవసరమైన ప్రదేశం కోసం సుదీర్ఘ పరిశీలన చేసింది. వాటిల్లో ప్రధానంగా ప్రకాశం జిల్లాలోని ఉలవపాడు మండలంలో రామాయపట్నం, నెల్లూరు జిల్లాలోని దుగ్గరాజపట్నం ప్రాంతాల మధ్య తీవ్ర పోటీ తలెత్తింది. రెండు ప్రాంతాల్లో భూముల లభ్యత, అనుకూలతలు, ప్రతికూలాంశాలను పరిశీలించిన అప్పటి అధికారులు రామాయపట్నంలోనే పోర్టు నిర్మాణానికి అవసరమైన అన్ని వసతులున్నట్టు తేల్చారు. దీనికి అనుగుణంగా నివేదికను తయారు చేసి కేంద్రానికి సమర్పించారు.
రామాయపట్నంలో పోర్టు నిర్మాణం దాదాపు ఖాయమైనట్లేనని అంతా భావించారు. కేంద్ర మంత్రివర్గం సైతం ఇక్కడ పోర్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, అప్పట్లో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా నెల్లూరు జిల్లా నేతలు కేంద్రం వద్ద చేసిన లాబీయింగ్‌తో పోర్టు దుగ్గరాజపట్నానికి తరలిపోయింది. అక్కడ పోర్టు నిర్మాణానికి సంబంధించి రూ.8 వేల కోట్లు నిధులు కేటాయిస్తున్నట్లు కేంద్రంప్రకటించింది. కానీ పులికాట్ సరస్సు ఏరియాలో ఉండడం, ‘షార్’ నుంచి వ్యతిరేకత వ్యక్తమవడం తదితర అంశాలతో అక్కడ పోర్టు నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. పులికాట్ సరస్సుకు పక్షుల రక్షితకేంద్రంగా ఉన్న గుర్తింపును రద్దుచేయడానికి వణ్యప్రాణి సంరక్షణ శాఖ ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించే దాఖలాలు కనిపించడం లేదు.
వనరులు అపారం
జిల్లాకు వరంగా మారనున్న పోర్టు నిర్మాణానికి అవసరమైన అన్ని వనరులు రామాయపట్నంలో కేంద్రీకృతమై ఉన్నాయి. భారీ అసైన్డ్ భూములు ఈ ప్రాంతంలో ఉండటంతో పాటు, సమీప గ్రామాల మత్య్సకార ప్రజలు తమ భూములు ఇచ్చేందుకు అనుకూలంగా ఉన్నారు. రామాయపట్నానికి దగ్గరలోనే నేషనల్ హైవే ఉంది. గతంలో ఇక్కడ పర్యటించిన నిపుణుల బృందం పోర్టు నిర్మాణానికి రామాయపట్నాన్నే ఎంపిక చేసింది. దీంతో పోర్టు తిరిగి వస్తుందనే ఆశలు వ్యక్తం అవుతున్నాయి.
జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం లోపించడం, కేంద్రంతో పోరాడి పోర్టును సాధించగలిగే బలమైన నాయకుడు ఇక్కడ లేకపోవడమే పోర్టు తరలిపోవడానికి కారణమైందనే వాదన ఉంది. ప్రస్తుతం కేంద్రంలో ప్రభుత్వం మారడం, దుగ్గరాజపట్నంలో పోర్టు నిర్మాణానికి ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో ఈసారైనా ప్రకాశం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేసి పోర్టును సాధిస్తారా లేదా అనేది వేచిచూడాలి.