సాక్షి, అమరావతి: పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహదం చేసే వెదురు నిలువెల్లా పోషకాలతో మానవాళికి ఆరోగ్య సిరులనూ అందిస్తోందని పరిశోధనల్లో తేలింది. ఇతర వృక్ష జాతుల కంటే 35 శాతం అధికంగా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే ఈ పచ్చ బంగారం దీర్ఘకాలిక రోగుల పాలిట ఆరోగ్య ప్రదాయినిగా మారుతోందని వెల్లడైంది. అరుదుగా దొరికే వెదురు బియ్యంతో పాటు టీ పౌడర్ వంటి ఉత్పత్తులు ఆన్‌లైన్ మార్కెట్‌లో అందుబాటులో ఉండగా.. ఇతర ఉత్పత్తులు అటవీ ప్రాంతాల్లో విరివిగా లభిస్తున్నాయి.
50 ఏళ్లకు వెదురు బియ్యం
వెదురు మొక్కకు 50 ఏళ్లు నిండాక కంకులు వేసి (పుష్పించి).. వాటిలోంచి ధాన్యం మాదిరిగా వెదురు వడ్లు కాస్తాయి. వాటి నుంచి వెదురు బియ్యాన్ని సేకరిస్తారు. అంటే.. ఒక్కో వెదురు చెట్టు 50 ఏళ్ల వయసులో ఒకసారి మాత్రమే 1–2 కిలోల బియ్యం వరకు ఇస్తుంది. ఈ బియ్యంతో అన్నం, పాయసం, పొంగలి వంటి వంటకాలు చేసుకోవచ్చు. వీటిని వినియోగించడం వల్ల వెన్నునొప్పి, కీళ్ల నొప్పులతో పాటు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుందని అధ్యయనాల్లో వెల్లడైంది.
వీటిలో తక్కువగా ఉండే గ్‌లెసైమిక్ ఇండెక్స్ మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. అధికంగా ఉండే ఐరన్, ఫాస్ఫరస్ వంటి మూలకాలు గుండెకు మేలు చేస్తాయి. రక్తపోటును నియంత్రిస్తాయి. ఈ బియ్యంలో కాల్షియం, భాస్వరం, ఇనుము, వీటిలో మాంసకృత్తులు, విటమిన్ బీ–6, పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి ఎముకల్ని దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి. మన రాష్ట్రంలో బుట్టాయగూడెం, పోలవరం, అరకు, పాడేరు, సీలేరు, నల్లమల అటవీ ప్రాంతాల్లో వెదురు బియ్యం దొరుకుతుంటాయి. ఆదివాసీల నుంచి సేకరించే వెదురు బియ్యాన్ని ఆన్‌లైన్ ద్వారా ఈ–కామర్స్ సంస్థలు వినియోగదారులకు విక్రయిస్తున్నాయి.
రెమ్మ రెమ్మకో రోగం దూరం
వెదురు రెమ్మలు ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందాయి. వెదురు మొలకలు (వెదురు దుంప నుంచి మొలకెత్తేవి), రెమ్మలు, చిటారు కొమ్మన కనిపించే చిగుళ్లతో వివిధ వంటకాలను తయారు చేసుకోవచ్చు. వీటిని నేరుగానూ తినేయొచ్చు. ఇటీవల కాలంలో సూప్‌లలో వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. తాజా పిలకలు, చిగుళ్లతో ఊరగాయలు తయారు చేస్తున్నారు.
వెదురు రెమ్మల్ని తింటే గుండె జబ్బులకు దూరంగా ఉండొచ్చని కార్డియాలజిస్టులు సైతం సిఫార్సు చేస్తున్నారు. వీటిలో క్యాన్సర్ నిరోధక, యాంటీ బయాటిక్, యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ధమనులను శుభ్రం చేయడం, చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో సహాయపడతాయి.
వీటి పిలకలతో ఊబకాయం దూరం
వెదురు పిలకలు, చిగుళ్లతో చేసిన వంటకాలను తినడం ద్వారా ఊబకాయానికి దూరంగా ఉండొచ్చని చెబుతున్నారు. వర్షకాలంలో ప్రతి మొక్కకు 4 నుంచి 10 పిలకల వరకు వస్తాయి. వెదురు పిలకలను ఉడికించి వంటల్లో ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో 2–3 రోజుల పాటు నానబెట్టి పచ్చడి చేస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో ఊరగాయగా వాడుతుంటారు. పిలకల్లో పిండి పదార్థాలు, ప్రోటీన్లతో పాటు కాపర్, ఐరన్, పాస్ఫరస్, పొటాషియం వంటి మూలకాలు, రిబోప్లేవిన్, విటిమిన్ ఏ, కే, ఈ, బీ–6 పుష్కలంగా ఉంటాయి. వీటిలో లభించే పైటోప్టెరాల్స్, పైటో న్యూట్రియంట్స్ కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెకు ఆరోగ్యాన్నిస్తాయి.
వెదురు బియ్యం చాలా రుచి
వెదురు బియ్యం చాలా అరుదుగా లభిస్తాయి. మా ఇంట్లో అప్పుడప్పుడూ ఈ బియ్యం వాడుతుంటాం. ఆన్‌లైన్ మార్కెట్‌లో లభిస్తున్నాయి. రుచికరంగా ఉంటాయి. మధుమేహ రోగులకు ఎంతో మేలు చేస్తాయి. మైదాన ప్రాంతాల్లో వెదురు విస్తరణను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నందున భవిష్యత్‌లో వెదురు ఉత్పత్తులు విరివిగా దొరికే అవకాశం ఉంది.
– తమ్మినేని రాఘవేంద్ర, డైరెక్టర్, ఏపీ మేదరి కార్పొరేషన్
20 హెక్టార్లలో వెదురు సాగు చేస్తున్నా
నేను ఏజెన్సీ ప్రాంతంలో 20 హెక్టార్లలో వెదురు సాగు చేస్తున్నా. ఏజెన్సీ సంతల్లో వెదురు బియ్యం దొరుకు తాయి. వెదురు పిలకలు, చిగుళ్లు, రెమ్మలతో చేసే వంటకాలు చాలా రుచికరంగా ఉంటాయి.
– నారాయణ, రైతు, పాడేరు
వెదురు ఉప్పు.. బహుప్రియం సుమీ!
వెదురు ఉప్పు కొరియాలో ఎక్కువగా వాడతారు. అందుకే దీన్ని కొరియన్ సాల్ట్ అని పిలుస్తారు. మూడేళ్ల వయసున్న వెదురును సేకరించి.. వాటిని సమానంగా కత్తిరించి.. అందులో సముద్రపు ఉప్పు నింపి బాగా కాలుస్తారు. ఈ క్రమంలో వెదురు నుంచి వెలువడిన ద్రవాలు ఉప్పుతో కలుస్తాయి. ఇలా తొమ్మిదిసార్లు చేస్తే ఉప్పు ఊదా రంగులోకి మారుతుంది. అందుకే దీన్ని ‘పర్పుల్ సాల్ట్’ అని కూడా పిలుస్తుంటారు.
ప్రపంచంలో అత్యంత ఖరీదైన లవణాలలో ఇదొకటి. దీని ధర పావు కిలో రూ.8 వేలపై మాటే. వంటంతా అయ్యాక.. చివరగా ఫినిషింగ్ సాల్ట్‌గా వాడే వెదురు ఉప్పులో క్యాన్సర్‌ను నిరోధించే గుణాలూ ఉన్నాయంటారు. చర్మ, దంత సౌందర్యానికి ఉపకరిస్తుంది. వెదురు(లేత) కొమ్ములను పౌడర్ రూపంలో మార్చి వంటకాల్లో వాడుతుంటారు.
Comments
Please login to add a commentAdd a comment