ప్రకృతి అందాల సమాహారం విశాఖ మన్యం. ఎన్నో వింతలు, విశేషాలతో పాటు గిరిజన సంప్రదాయం అందరికీ కట్టిపడేస్తుంది. అడవిలో లభించే ఆకుకూరలు, కాయలతో చేసే వంటకాలు నోరూరిస్తాయి. ఇదే కోవకు చెందుతుంది వెదురు కంజి. వెదురు నుంచి తీసిన చిగుళ్లను కూర వండుకొని తింటారు. ఈ కూర టేస్టే వేరు. - సాక్షి,పాడేరు/ముంచంగిపుట్టు
వెదురు కొమ్ముల సీజన్ ఇది
గిరిజన ప్రాంతాల్లో వెదురు కొమ్ముల సీజన్ ప్రారంభమైంది. వెదురు చెట్లకు మొదల్లో చిగుళ్లను గిరిజనులంతా వెదురు కొమ్ములుగా పిలుస్తుంటారు. ఈ చిగుళ్లను సేకరించి వాటిని మంచి శాఖాహార వంటగా గిరిజనులతో పాటు మైదాన ప్రాంత ప్రజలు కూడా అధికంగా తింటారు. వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో వెదురు చెట్ల మొదళ్లకు చిగుళ్లు వచ్చాయి. అడవులతో పాటు గిరిజనులు సొంతంగా వేసుకున్న వెదురు చెట్ల వద్ద ఈ చిగుళ్లను సేకరించి ఇళ్లకు తీసుకువస్తున్నారు.
వేపుడు, ఇగురు కూరలుగా
ఈ సీజన్‌లో దొరికే వెదురు కొమ్ముల్లో పోషక విలువలు అధికంగా ఉంటాయని, అవి తినడం ద్వారా ఆరోగ్యానికి దోహదం చేస్తుందని గిరిజనుల నమ్మకం. ఈ వెదురు కొమ్ములను వేపుడు, ఇగురు కూరలుగా వండుకుని తింటారు. కొంత మంది ఈ చిగుళ్లను పొడవుగా కోసి ఉడకబెట్టిన తర్వాత బాగా ఆరబెట్టి వరుగులుగా తయారు చేసుకుంటారు.
ఆ వరుగులను సుమారు ఆరు నెలల వరకు ఇళ్లల్లో దాచుకుని ఎప్పుడు తినాలనుకున్న వాటిని నానబెట్టి కూరలుగా వండుకుంటారు. వారపు సంతలు, మండల కేంద్రాల్లో ప్రస్తుతం వెదురు కొమ్ములను గిరిజనులు విక్రయిస్తున్నారు. రూ.20 నుంచి రూ.80 ధరతో వాటా అమ్ముడవుతోంది. పాడేరు డివిజన్‌తో పాటు రంపచోడవరం డివిజన్‌లోని మారెడుమిల్లి, చింతూరు, అడ్డతీగల, రాజవొమ్మంగి, వై.రామవరం ప్రాంతాల్లో ఈ సీజన్‌లో వెదురు కొమ్ములకు మంచి డిమాండ్ ఉంటుంది.
అనంతగిరి, లంబసింగి, పాడేరు, సీలేరు, మారెడుమిల్లి, మోతుగూడెం ఘాట్ రోడ్ల వెంబడి కూడా వెదురు వనాలు అధికంగా ఉన్నాయి. పర్యాటకులు, పలు వర్గాల ప్రజలు కూడా వెదురు కొమ్ముల వంటకాలకు అలవాటుపడ్డారు. ఈ సీజన్‌లో కొనుగోలు చేస్తుంటారు.
వెదురు కంజి- ఉపయోగాలు ఇవీ
►వెదురు కంజి కూర తయారు చేసే ముందు రెండు మూడు సార్లు బాగా కడగాలి. అప్పుడే వెదురు కంజిలో ఉండే చేదు పోతుంది. వెదురు కంజిని బాగా ఉడకబెట్టి దాని కషాయాన్ని తాగితే శరీరానికి తక్షణమే వేడి చేస్తుంది.
►సుగర్, కపం, మూల వ్యాధి నివారణకు ఆయుర్వేద పరంగా దీనిని వాడతారు.
►రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
►జీర్ణశక్తి పెంచుతుంది.
►కడుపులో నులి పురుగును తొలగిస్తుంది.
►గాయాలైనప్పుడు వెదురు కంజిని పేస్ట్‌గా చేసి గాయంపై రాస్తారు.
►మారుమూల గిరిజనులు పాము, తేలు కాటుకు ఔషధంగా సైతం వినియోగిస్తున్నారు.
తక్షణమే వేడి చేస్తుంది
వెదురు కొమ్ములను గర్భిణులకు ఎక్కువగా వండి పెడతాం. ఇందులో ఉన్న గుణాలు గర్భిణులకు ఎంతో మేలు చేస్తాయి. గిరిజన ప్రాంతంలో వాతావరణం చల్లగా ఉండడం వల్ల శరీరానికి వెంటనే వేడి చేసే గుణం ఇందులో ఉంది. వెదురు కొమ్ముల కూర కూడా ఎంతో రుచికరంగా ఉంటుంది. ఈ నాలుగు నెలలు మాత్రమే వెదురు కొమ్ములు లభ్యమవుతాయి. – ఎస్.భాగ్యవతి, గృహిణి, నర్సిపుట్టు
అమ్మకాలు బాగున్నాయి
వారపు సంతల్లో వెదురు కొమ్ముల అమ్మకాలు బాగున్నాయి. కొమ్ముల వాటా రూ.50 చొప్పున విక్రయిస్తున్నాం. గతంలో గిరిజన ప్రాంతానికి చెందిన వారే కొనుగోలు చేసేవారు. ఇప్పుడు మైదాన ప్రాంతం నుంచి వచ్చి కూడా వెదురు కొమ్ములను కొనుగోలు చేస్తున్నారు.
కొమ్ములను పచ్చిగా, ఉడక బెట్టి అమ్ముతున్నాం. శనివారం ముంచంగిపుట్టు వారపు సంతలో కొమ్ములు తెచ్చిన గంటల వ్యవధిలోనే అమ్ముడైపోయాయి. – కె.సుబ్బరావు, కూరగాయల వ్యాపారి, తల్లాబుతోట.
చదవండి: Health Tips: ఖాళీ కడుపుతో ఇవి తింటే చాలా డేంజర్..! అవి కూడా అతిగా వద్దు!
Comments
Please login to add a commentAdd a comment