మర్రిపాకల రేంజ్‌లో వెదురు పొదలు
అటవీయేతర ప్రాంతాల్లో గిరిజనులు వెదురును అమ్ముకునేందుకు వీలుగా పార్లమెంట్ 1926 నాటి అటవీ చట్టాన్ని సవరిస్తూ బిల్లును ఆమోదించింది. రిజర్వ్ ఫారెస్టు మినహా మిగిలిన చోట్ల వెదురును చెట్టుగా పిలవరాదని పేర్కొంది. దానిని గడ్డిగానే పరిగణించాలి. రిజర్వ్ ఫారెస్టులో చెట్టుగా వెదురును పిలవాలని దానిలో తెలిపింది. తాజా సవరణ ప్రకారం గిరిజనులు లేదా మైదాన ప్రాంతంలో వెదురును పెంచుకుని విక్రయించుకోవచ్చు. లాభాలను ఆర్జించవచ్చు.
కొయ్యూరు (పాడేరు) : మహారాష్ట్రలో మాదిరిగా రాష్ట్రంలో కూడా వెదురును నేరుగా గిరిజనులు అమ్ముకునేందుకు వీలుగా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం 2011లో అనుమతి ఇచ్చింది. అప్పట్లో ఆయన నాతవరం మండలంలో దానిని ప్రారంభించారు. తరువాత అది అలానే ఉండిపోయింది తప్ప గిరిజనులకు వెదురుపై అధికారం రాలేదు. గిరిజనుల నుంచి మావోయిస్టులను వేరు చేయాలన్న లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు. అయితే తరువాత గిరిజనులకు ఎలాంటి హక్కులు ఇవ్వలేదు. తాజాగా కేంద్రం వెదురును అటవీయేతర ప్రాంతాల్లో కూడా అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చింది. దీని మూలంగా కొన్నిచోట్ల గిరిజనులు నేరుగా వెదురును అమ్ముకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. జిల్లాకు సంబంధించి నర్సీపట్నం అటవీ డివిజన్‌లోనే ఎక్కువగా వెదురు కూపీలున్నాయి. వాటి నుంచి యేడాదికి 40–50 లక్షల వెదుర్లను తీస్తారు.
మన్యం వెదురుపై హక్కుకు నోచని గిరిజనం
ప్రభుత్వం 2011లో ఇచ్చిన సడలింపు ప్రకారం గిరిజన మహిళలు గ్రూపులుగా ఏర్పడి వెదురును నరికి వ్యాపారులకు విక్రయించవచ్చు. అలా విక్రయించగా వచ్చిన ఆదాయాన్ని పంచుకోవాలి. దీని మూలంగా గిరిజనుల ఆదాయం పెరిగి మావోయిస్టులకు దూరంగా ఉంటారని నాడు భావించారు. కానీ అది నేటికీ కార్యరూపం దాల్చలేదు. నర్సీపట్నం అటవీ డివిజన్‌లో వెదురు ద్వారా అటవీ శాఖ యేడాదికి రూ.రెండు నుంచి రెండున్నర కోట్ల ఆదాయాన్ని అర్జిస్తుంది. మొత్తం వెదురు ఉత్పత్తిలో అటవీ శాఖ తీస్తున్నది 40 శాతం మాత్రమే. మిగిలినదంతా తీసేందుకు వీలు లేక వదిలిపెడుతున్నారు. అదంతా వృథా అవుతుంది. కొండలపై నుంచి వెదురును తీసుకురావడం కూడా కష్టంగా మారింది. వెదురు సైజ్‌ను అనుసరించి అటవీ శాఖ గిరిజనులకు కూలి చెల్లిస్తుంది. తరువాత దానిని రవాణా చేసి నిల్వ కేంద్రాల వద్ద ఉంచుతుంది. నెలకు ఒకసారి వ్యాపారులకు వేలం నిర్వహిస్తుంది. ప్రస్తుతానికి వెదురును ఎక్కడ నుంచి తీసుకువచ్చినా దానిని అటవీ శాఖ పట్టుకుంటుంది. తాజాగా పార్లమెంట్ సవరించిన 1926 నాటి చట్టం çప్రకారం గిరిజనులు లేదా మైదాన ప్రాంతంలో వెదురును పెంచుకుని విక్రయించుకోవచ్చు. లాభాలను ఆర్జించవచ్చు.
రూ.60–75 మధ్యలో వెదురు
ఒకప్పుడు రాజమండ్రి పేపర్‌మిల్లుకు మన్యంలో వెదురును సరఫరా చేసేవారు. అయితే మైదాన ప్రాంతంలో సుబాబుల్ పెంపకంతో పేపర్‌మిల్లు వెదురును వదిలిపెట్టింది. నాటి నుంచి అటవీ శాఖ వ్యాపారులకు వేలంలో విక్రయిస్తుంది. ప్రస్తుతం ఒక్కో వెదురు ధర రూ.60–75 మధ్య పలుకుతుంది. ఎక్కువగా హైదరాబాద్‌కు చెందిన వ్యాపారులు వేలంలో పాల్గొని వీటిని కొనుగోలు చేస్తున్నారు. వెదురుతో అందమైన వస్తువులను తయారు చేసి విక్రయిస్తున్నారు. మర్రిపాకల రేంజ్‌కు సంబంధించి వై రామవరం మండలం వెదురునగరం వద్ద, గొలుగొండ, నర్సీపట్నం, చింతపల్లి, సీలేరులో డిపోలను ఏర్పాటు చేసింది. నెలకోసారి అక్కడ వేలం నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment