భూంకాల్‌ పోరాటం | Bastar tribals are in trouble with the Reserve Forest Act | Sakshi
Sakshi News home page

భూంకాల్‌ పోరాటం

Published Fri, Aug 23 2024 4:38 AM | Last Updated on Fri, Aug 23 2024 4:38 AM

Bastar tribals are in trouble with the Reserve Forest Act

రిజర్వ్‌ ఫారెస్ట్‌చట్టంతో బస్తర్‌ ఆదివాసీలకు ఇక్కట్లు

పాలన వ్యవహారాల్లో బ్రిటీష్‌ జోక్యం

అందుకు వ్యతిరేకంగా ఆదివాసీల పోరాటం

బ్రిటీష్‌ అధికారులను గడగడలాడించిన గుండాధూర్‌

మూడు రోజుల్లో సగం బస్తర్‌ రాజ్యం హస్తగతం

కుట్రతో పోరాటాన్ని అణచివేసిన ఆంగ్లేయులు 

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రాజ్యసంక్ర మణ సిద్ధాంతం, సైన్యసహకార పద్ధతి వంటి కుట్రపూరిత విధానాలతో బస్తర్‌ రాజ్యాన్ని కూడా ప్రిన్సిలీ స్టేట్‌గా బ్రిటీషర్లు మార్చారు. రాజును నామమాత్రం చేస్తూ పరోక్షంగా పాలన సాగించా రు. ఈ క్రమంలో 1878లో బ్రిటీష్‌ ప్రభుత్వం రిజ ర్వ్‌ ఫారెస్ట్‌ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో బస్తర్‌ అడవుల్లో 66 శాతం భూభాగంపై ఆదివాసీ లు హక్కులు కోల్పోయారు. 

రిజర్వ్‌ ఫారెస్ట్‌గా ప్రకటించిన ప్రదేశాల్లో కర్ర పుల్ల తీసుకెళ్లాలన్నా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. మరోవైపు బ్రిటీ షర్ల కాలంలో బస్తర్‌ పాలకుడిగా ఉన్న భైరామ్‌ దేవ్‌ కుష్ఠువ్యాధి బారిన పడ్డారు. దీంతో ఆయన్ను పదవి నుంచి దూరంగా ఉంచి అతని కొడుకైన రుద్ర ప్రతాప్‌దేవ్‌ని 1891లో రాజుగా బ్రిటీష్‌ సర్కార్‌ గుర్తించింది. 

అయితే మేజర్‌ అయ్యేంత వరకు ఆయనకు పట్టాభిషేకం చేసే అవకాశం లేదు. అలా రాజుతోపాటు రాజకుటుంబంలో ప్రధాన పదవుల్లో ఉన్నవారు తమ అ«ధికారాలు కోల్పోయారు. ఇలా బ్రిటీషర్ల ఆధిపత్య ధోరణి కారణంగా ఇటు రాజవంశానికే కాక అటు ఆదివాసీలకు ఇక్కట్లు మొదలయ్యాయి. 

తిరుగుబాటుకు పిలుపు
1909 అక్టోబర్‌లో జరిగిన దసరా వేడుకల్లో రిజర్వ్‌ ఫారెస్ట్‌ చట్టం, దాన్ని అమలు చేస్తున్న బ్రిటీష్‌ ప్రభుత్వంపై పోరాటం చేయాలంటూ బస్తర్‌ రాజ్య మాజీ దివాన్‌ లాల్‌ కాళీంద్రసింగ్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానికంగా పేరున్న ఆదివాసీ నేత గుండాధుర్‌ నాయకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ఫారెస్ట్‌ చట్టం కారణంగా తాము పడుతున్న బాధలను ఊరూరా ప్రచారం చేస్తూ తిరుగుబాటుకు ప్రజలను సిద్ధం చేశారు. 

ప్రతీ ఇంటి నుంచి ఒకరు పోరాటానికి రావాలని, ఆయుధాలు పట్టలేనివారు రాళ్లు, కర్రలు, కారం పొడి అయినా అందించాలని స్ఫూర్తి నింపారు. 1909 అక్టోబర్‌ నుంచి 1910 ఫిబ్రవరి మొదటివారం నాటికి బస్తర్‌లో అటవీ గ్రామాలన్నీ పోరాటానికి సంసిద్ధమయ్యాయి. ముఖ్యంగా బస్తర్‌లో ఉత్తర ప్రాంతమైన కాంకేర్‌ నిప్పు కణికలా మారింది.

మూడు రోజుల్లోనే....
1910 ఫిబ్రవరి 4న కుకనార్‌లో గుండాధూర్‌ నాయకత్వంలో ఆదివాసీలు బ్రిటీష్‌ అధికార కార్యాలయాలు, గోదాములు, మార్కెట్, ప్రభుత్వ అధికారుల ఇళ్లపై మెరుపుదాడులు జరిపారు. కేవలం మూడురోజుల్లోనే బస్తర్‌లోని 84 పరగణాల్లో 46 పరగణాలు తిరుగుబాటుదారుల అధీనంలోకి వచ్చాయి. 

కాంకేర్‌ ప్రాంతంలో బ్రిటీష్‌ అధికారులు, వ్యాపారులు ఇళ్లు వదిలి పారిపోయారు. దండకారణ్యంలో భూకంపం లాంటి తిరుగుబాటు వచ్చిందని తక్షణ సాయం అవసరమంటూ బ్రిటీష్‌ ప్రభుత్వానికి అప్పటి మహారాజు రుద్ర ప్రతాప్‌దేవ్‌ టెలిగ్రామ్‌ పంపారు. దీంతో ఈ పోరాటానికి భూంకాల్‌ పోరాటమని పేరు వచ్చింది. 

గుండాధూర్‌ చిక్కలేదు
భూంకాల్‌ విప్లవాన్ని అణచివేసే పనిని కెప్టెన్‌ గేర్‌కు బ్రిటీష్‌ సర్కార్‌ అప్పగించింది. పదిరోజులు బ్రిటీష్, బస్తర్‌ స్టేట్‌ సైన్యాలు అడవుల్లో గాలించినా విప్లవకారుల్లో కేవలం 15 మందినే పట్టుకోగలిగారు. మరోవైపు తనను పట్టుకునేందుకు వచ్చిన కెప్టెన్‌ గేర్‌పైనే నేరుగా దాడి చేసి బ్రిటీషర్ల వెన్నులో గుండాధూర్‌ వణుకు పుట్టించాడు. 

తృటిలో కెప్టెన్‌ గేర్‌ ఆ దాడి నుంచి తప్పించుకొని ప్రాణాలు కాపాడు కున్నాడు. దీంతో బెంగాల్, జైపూర్‌ రాజ్యాల నుంచి అదనపు బలగాలను బస్తర్‌కు రప్పించారు. ఆ తర్వాత గుంఢాదూర్‌కు నమ్మకస్తుడైన సోనుమాంఝీ ద్వారా కోవర్టు ఆపరేషన్‌ జరిపి 1910 మార్చి 25 రాత్రి గుంఢాధూర్‌ ఆయన సహచరులు బస చేసిన అటవీ ప్రాంతంపై బ్రిటీష్‌ సైన్యం దాడి జరిపింది. ఇందులో 21 మంది చనిపోగా మరో ఏడుగురు పట్టుబడ్డారు. 

కెప్టెన్‌ గేర్‌ ఎంతగా ప్రయత్నించినా ఆదివాసీ పోరాట యోధుడు గుండాధూర్‌ మాత్రం చిక్కలేదు. మెరుపు తిరుగుబాటుతో బ్రిటీషర్లకు చుక్కలు చూపించిన బస్తర్‌ ఆదివాసీలు ఆ తర్వాత తమ హక్కుల కోసం స్వతంత్ర భారత దేశంలో ఏర్పడిన ప్రభుత్వంతోనూ ఘర్షణ పడ్డారు. ఈ పోరులో తాము దైవంగా భావించే మహారాజునే కోల్పోయారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement