సదరం..ఇక సత్వరం | Telangana Government Starts Disable Confirmation Online System | Sakshi
Sakshi News home page

సదరం..ఇక సత్వరం

Published Tue, Dec 24 2019 2:56 AM | Last Updated on Tue, Dec 24 2019 3:00 AM

Telangana Government Starts Disable Confirmation Online System - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దివ్యాంగుల కష్టాలు తీరనున్నాయి. ఇక నుంచి సదరం సర్టిఫికెట్లను వారు ఈజీగా పొందవచ్చు. వైకల్య నిర్ధారణ పరీక్షల కోసం దివ్యాంగులు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. కొత్తగా ‘సదరం’ఆన్‌లైన్‌ స్లాట్‌ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సెర్ప్‌ సహకారంతో మహిళా రైతు ఉత్పత్తిదారులు (ఎఫ్‌పీవో) నిర్వహించే బేనిషాన్‌ కంపెనీని ప్రారంభించిన పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. సదరం ఆన్‌లైన్‌ స్లాట్‌ బుకింగ్‌ విధానానికి కూడా శ్రీకారం చుట్టారు. సాంకేతిక, ఇతర కారణాలతోగానీ పెన్షన్ల చెల్లింపులో ఆసరా లబ్ధిదారులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఆన్‌లైన్‌లో వినతుల స్వీకరణ, పరిష్కారం చేస్తున్నామని, తాజాగా ఆన్‌లైన్‌ స్లాట్‌ బుకింగ్‌ సిస్టంను అందుబాటులోకి తెస్తున్నామని ఆయన తెలిపారు.  

త్వరగా ధ్రువీకరణ పత్రం.. 
కొత్త విధానంతో అర్హులైన దివ్యాం గుల(వికలాంగుల)కు త్వరగా దివ్యాంగుల ధ్రువీకరణ పత్రం జారీ చేయవచ్చు.  
దివ్యాంగులు వారికి సమీపంలోని మీసేవ కేంద్రానికి వెళ్లి వైకల్యం అంచనా, ధ్రువీకరణ పత్రం కోసం స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు.  
దీనికోసం సదరు వ్యక్తి ఆధార్‌ కార్డును మీసేవ కేంద్రానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. 
మీసేవ కేంద్రం నమోదు ప్రక్రియ దరఖాస్తుదారుల వేలిముద్ర/ఐరిస్‌ ప్రామాణీకరణతో మొదలవుతుంది. అలాగే మొదటిసారి స్లాట్‌ బుకింగ్‌ కోసం పేరు, చిరునామా వివరాలను నమోదు చేస్తారు. 
అనంతరం ఆయా జిల్లాల్లో ఏ రోజున, ఏ మెడికల్‌ క్యాంపునకు హాజరుకావాలో స్లాట్‌ బుకింగ్‌ చేసి వివరాలతో కూడిన రసీదును దరఖాస్తుదారుకు ఇస్తారు. 
ఒకవేళ దివ్యాంగులు అంతకుముందే ‘సదరం ధ్రువీకరణపత్రం’కలిగి ఉన్నా... వైకల్య శాతం గతంలోనే అంచనా వేసి, అర్హత కంటే తక్కువ శాతం ఉంటే స్లాట్‌ బుకింగ్‌ను తిరస్కరిస్తారు. 
స్లాట్‌ ప్రకారం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి మీసేవ రసీదుతో మెడికల్‌ క్యాంపునకు హాజరవుతారు. మెడికల్‌ క్యాంపులోని నిర్వాహకులు దరఖాస్తుదారుడికి సదరం గుర్తింపు సంఖ్యను కేటాయిస్తారు. 
సదరం క్యాంపులో వైద్యులు దరఖాస్తుదారుడి వైకల్యం శాతాన్ని అంచనా వేస్తారు. సదరు దరఖాస్తుదారుకు అదేరోజున సదరం సర్టిఫికెట్‌ ఇవ్వబడుతుంది. 

మహిళా రైతుల జీవన ప్రమాణాలు పెంపు.. 
మహిళా రైతుల జీవన ప్రమాణాలను పెంచేందుకు గ్రామీణ పేద నిర్మూలన సంస్థ (సెర్ప్‌) కృషి చేస్తుందని మంత్రి ఎర్రబెల్లి అభిప్రాయపడ్డారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్‌పీజీ) ను ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, మార్కెటింగ్‌ సదుపాయం కల్పించేందుకు తోడ్పాటును అందిస్తోందన్నారు. వ్యవసాయ విలువ అభివృద్ధిలో భాగంగా 1,928 గ్రామాల్లో పంటల విశ్లేషణ చేశామని, 4,139 రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేసి 66,116 మంది రైతుల బేస్‌లైన్‌ సర్వే పూర్తి చేశామని, ఆయా గ్రామాల్లో రైతు సంఘాలను సంఘటితం చేసి... రైతు ఉత్పత్తిదారుల కంపెనీలుగా ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి, ముఖ్యకార్యదర్శులు వికాస్‌ రాజ్, పార్థసారథి, సెర్ప్‌ సీఈవో పౌసుమిబసు తదితరులు పాల్గొన్నారు.  

ఇబ్బందులకు చెక్‌.. 
సదరం శిబిరాలకు ఇప్పుడు ఒకే సారి వేల మంది వస్తున్నారు. దీని వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆన్‌లైన్‌ స్లాట్‌బుకింగ్‌ విధానం అమల్లోకి రావడం వల్ల.. రద్దీకి సంబంధించిన ఇబ్బందులుండవు. 
దివ్యాంగులు వారికి అనుకూలంగా ఉన్న సమయంలో ఏదైనా మీసేవ కేంద్రానికి వెళ్లి స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చు. 
సదరం శిబిరాల్లో ప్రస్తుతం కంప్యూ టర్‌ ఆపరేటర్‌ అందరి వివరాలను అదేరోజు నమోదు చేయడం వల్ల టైం ఎక్కువ పడుతోంది. దీనివల్ల దివ్యాంగులు, నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఆపరేటర్ల తొందరపాటుతో కొన్నిసార్లు టైపింగ్‌ తప్పులు దొర్లుతున్నాయి. ఆన్‌లైన్‌ విధానంతో ఈ సమస్యలుండవు. ఆన్‌లైన్‌లో వివరాలన్నీ ముందుగానే నమోదై ఉంటాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement