disable people
-
దివ్యాంగులకు మరింత ధీమా
లక్ష్మణచాంద: రాష్ట్రంలోని అన్నివర్గాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. ఆసరా పథకం కింద వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, నేత, గీత, బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్నారు. గతంలో వందల్లో ఉన్న పింఛన్‌ను కేసీఆర్ వేలకు పెంచారు. గతంలో అరకొర.... గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకు నెల కు కేవలం రూ.70 పింఛన్ మాత్రమే ఇచ్చేది. ఇది దివ్యాంగులకు ఏ మాత్రం సరిపోయేది కాదు. దీంతో దివ్యాంగులు తమ కుటుంబ సభ్యులపైనే అ న్నింటికి ఆధారపడేవారు. వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ పింఛన్‌ను రూ.200 పెంచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకూ ఇదే పింఛన్ అందించారు. స్వరాష్ట్రంలో భారీగా పెంపు.. స్వరాష్ట్రం సిద్ధించిన తరువాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీఎం కేసీఆర్ నేటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని వృద్ధులు, వితంతువులు, ఒంట రి మహిళలు, వివిధ కుల వృత్తుల వారికి ఇచ్చే పింఛన్లను రూ.1,016కు పెంచారు. ఇక దివ్యాంగుల పింఛన్‌ను రూ.2016కు పెంచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ను గెలిపిస్తే ఆసరా పింఛన్‌ను రూ.1000 పెంచుతామని హామీ ఇచ్చారు. ఈమేరకు బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడంతో ఇచ్చిన హామీ ప్రకారం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కుల వృత్తుల వారికి ఇచ్చే పింఛన్‌ను రూ.1,016 నుంచి రూ.2016కు పెంచా రు. దివ్యాంగుల పింఛన్‌ను రూ.2016 నుంచి రూ.3,016కు పెంచారు. దీంతో దివ్యాంగులు ఇతరులపై ఆధారపడకుండా వారి అవసరాలను వారే తీర్చుకుంటున్నారు. మరో రూ.1000 పెంపు.. ఇటీవల మంచిర్యాల జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నూతన సమీకృత భవనం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ ది వ్యాంగుల పింఛన్‌ను మరో రూ.1000 పెంచుతున్న ట్లు ప్రకటించారు. జూలై నుంచి పెంచిన పింఛన్ ఇస్తామని కూడా ప్రకటించారు. దీంతో దివ్యాంగులకు జూలై నుంచి పింఛన్ రూ.4,016 అందనుంది. సీఎం ప్రకటినతో దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 10,740 మందికి లబ్ధి.. నిర్మల్ జిల్లాలోని 10,740 మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరనుంది. దివ్యాంగులకు ఇస్తున్న పింఛన్‌ను రూ.3,016 నుంచి రూ.4,016 పెంచుతున్నట్లు ప్రకటించడంతో జిల్లాలోని దివ్యాంగులు ఇటీవల సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. దివ్యాంగులకు మంచి రోజులు.. ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో దివ్యాంగులకు సరి గా పింఛన్ ఇవ్వలేదు. ఇచ్చిన పింఛన్ కూడా రూ.200 మించలేదు. తెలంగాణ సాధించుకున్న తర్వాత దివ్యాంగులకు మంచిరోజులు వచ్చాయి. సీఎం కేసీఆర్ మొదట రూ.2,016, తర్వాత రూ.3,016 చేశారు. తాజాగా మరో వెయ్యి కలిపి ఇస్తామని ప్రకటించారు. దీంతో పింఛన్ రూ.4,016 అయింది. – క్రాంతికుమార్, దివ్యాంగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
దటీజ్ సీఎం జగన్.. సాయం కోరితే సత్వరమే అందుతుంది
సాక్షి, బాపట్ల: అన్నా.. కష్టంలో ఉన్నాం. సాయం అందించన్నా.. అనే మాట వింటే చాలూ ఆయన చలించి పోతారు. సమస్యల్లో ఎవరైనా ఉన్నారని తెలిస్తే చాలూ.. సత్వర సాయంతో అక్కడికక్కడే ఆ సమస్యను పరిష్కరించి మనసున్న మారాజుగా పేరు దక్కించుకున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఎన్నో కుటుంబాలు అలా నేరుగా ఆయన ద్వారా సాయం అందుకున్న ఉదంతాలు చూశాం. అలాంటి జననేత మరోసారి బాపట్ల పర్యటనలో మానవత్వం చాటుకున్నారు. బుధవారం చుండూరు మండలం యడ్లపల్లిలో ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం అనంతరం తిరుగు ప్రయాణంలో సీఎంని కలిసి తమ ఇబ్బందులు వివరించిన మోదుకూరు గ్రామానికి చెందిన గుండ్రెడ్డి వెంకటరెడ్డి, వలివేరు గ్రామానికి చెందిన కూచిపూడి విద్యాసాగర్‌లు. స్పందించిన సీఎం వైఎస్ జగన్.. ప్రభుత్వం తరపున సహాయం చేస్తానని హామీ, అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఆ వెంటనే.. ముఖ్యమంత్రి ఆదేశాలతో వెంటనే ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున.. దివ్యాంగులకు చెక్కులు అందజేశారు బాపట్ల జిల్లా కలెక్టర్ కే. విజయకృష్ణన్. మోదుకూరు గ్రామానికి చెందిన గుండ్రెడ్డి వెంకటరెడ్డి కుమారుడు, కుమార్తె పుట్టుకతోనే మానసిక వైకల్యంతో బాధపడుతున్నారు. అయితే నిబంధనల కారణంగా వాళ్లకు ఫించన్ రావడం లేదు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు గండ్రెడ్డి సీఎం జగన్ వద్ద మొరపెట్టుకున్నారు. అలాగే.. వలివేరు గ్రామానికి చెందిన కూచిపూడి విద్యాసాగర్ భవనం నిర్మిస్తూ ప్రమాదవశాత్తూ మూడంతస్తుల నుండి కిందపడ్డారు. అప్పటి నుంచి కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నట్లు సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. వాళ్ల కష్టం చూసి సీఎం జగన్ చలించి పోయారు. వెంటనే స్పందించి గండ్రెడ్డి, కూచిపూడి కుటుంబాలకు తక్షణమే అవసరమైన ఆర్ధిక సాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. సీఎం స్పందనతో బాధిత కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి. తమ సమస్యపై ఇంత త్వరగా సీఎం జగన్ స్పందించడం, వెంటనే తమకు సాయం చేయడం ఎన్నడూ మరువలేమని వారు తమ ఆనందాన్ని జిల్లా కలెక్టర్‌తో పంచుకున్నారు -
‘టీఆర్ఎస్కు ఓటేయకుంటే పింఛన్లు కట్ చేస్తామంటున్నారు’
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్కు ఓట్లేయకపోతే వికలాంగుల పింఛన్లు తొలగిస్తామని ఆ పార్టీ నేతలు బెదిరిస్తున్నారని టీపీసీసీ వికలాంగుల విభాగం చైర్మన్ ముత్తినేని వీరయ్యవర్మ తెలిపారు. ఇల్లందకుంట మండలం వంతడుపుల గ్రామంలో జరిగిన వికలాంగుల సమావేశంలో టీఆర్ఎస్కు ఓట్లేయకుంటే పింఛన్లు కట్ చేస్తామని వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి చెప్పారన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టడంతో పాటు వికలాంగులను భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ), డీజీపీలకు ఆన్లైన్లో ఫిర్యాదు చేసినట్లు సోమవారం ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. వెంటనే ఆయనపై తగిన చర్యలు తీసుకుని వికలాంగ ఓటర్లకు మనోధైర్యం కల్పించాలని ముత్తినేని కోరారు. చదవండి: హుజురాబాద్ ఉప పోరు: పెరిగిన పోలింగ్ సమయం.. ఎప్పటివరకంటే! ‘వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్‌ను వెంటనే తొలగించాలి’ సాక్షి, హైదరాబాద్: ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకుంటే పింఛన్లు కట్ చేస్తామన్న వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డిని వెంటనే పదవి నుంచి తొలగించాలని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఇల్లందకుంట మండలం వంతడుపుల గ్రామంలో వికలాంగులతో సమావేశమై టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని హెచ్చరిస్తూ.. ఓటు వేయని వారిని బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని బెదిరించడం గర్హనీయమన్నారు. వాసుదేవరెడ్డి తక్షణమే వికలాంగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వికలాంగులపై బెదిరింపులకు పాల్పడిన వాసుదేవరెడ్డిపై వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. చదవండి: Huzurabad Bypoll: 100 కోట్లు దాటిన బెట్టింగ్..? -
సదరం..ఇక సత్వరం
సాక్షి, హైదరాబాద్: దివ్యాంగుల కష్టాలు తీరనున్నాయి. ఇక నుంచి సదరం సర్టిఫికెట్లను వారు ఈజీగా పొందవచ్చు. వైకల్య నిర్ధారణ పరీక్షల కోసం దివ్యాంగులు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. కొత్తగా ‘సదరం’ఆన్లైన్ స్లాట్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సెర్ప్ సహకారంతో మహిళా రైతు ఉత్పత్తిదారులు (ఎఫ్‌పీవో) నిర్వహించే బేనిషాన్ కంపెనీని ప్రారంభించిన పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. సదరం ఆన్లైన్ స్లాట్ బుకింగ్ విధానానికి కూడా శ్రీకారం చుట్టారు. సాంకేతిక, ఇతర కారణాలతోగానీ పెన్షన్ల చెల్లింపులో ఆసరా లబ్ధిదారులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఆన్లైన్లో వినతుల స్వీకరణ, పరిష్కారం చేస్తున్నామని, తాజాగా ఆన్లైన్ స్లాట్ బుకింగ్ సిస్టంను అందుబాటులోకి తెస్తున్నామని ఆయన తెలిపారు. త్వరగా ధ్రువీకరణ పత్రం.. ► కొత్త విధానంతో అర్హులైన దివ్యాం గుల(వికలాంగుల)కు త్వరగా దివ్యాంగుల ధ్రువీకరణ పత్రం జారీ చేయవచ్చు. ► దివ్యాంగులు వారికి సమీపంలోని మీసేవ కేంద్రానికి వెళ్లి వైకల్యం అంచనా, ధ్రువీకరణ పత్రం కోసం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ► దీనికోసం సదరు వ్యక్తి ఆధార్ కార్డును మీసేవ కేంద్రానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ► మీసేవ కేంద్రం నమోదు ప్రక్రియ దరఖాస్తుదారుల వేలిముద్ర/ఐరిస్ ప్రామాణీకరణతో మొదలవుతుంది. అలాగే మొదటిసారి స్లాట్ బుకింగ్ కోసం పేరు, చిరునామా వివరాలను నమోదు చేస్తారు. ► అనంతరం ఆయా జిల్లాల్లో ఏ రోజున, ఏ మెడికల్ క్యాంపునకు హాజరుకావాలో స్లాట్ బుకింగ్ చేసి వివరాలతో కూడిన రసీదును దరఖాస్తుదారుకు ఇస్తారు. ► ఒకవేళ దివ్యాంగులు అంతకుముందే ‘సదరం ధ్రువీకరణపత్రం’కలిగి ఉన్నా... వైకల్య శాతం గతంలోనే అంచనా వేసి, అర్హత కంటే తక్కువ శాతం ఉంటే స్లాట్ బుకింగ్‌ను తిరస్కరిస్తారు. ► స్లాట్ ప్రకారం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి మీసేవ రసీదుతో మెడికల్ క్యాంపునకు హాజరవుతారు. మెడికల్ క్యాంపులోని నిర్వాహకులు దరఖాస్తుదారుడికి సదరం గుర్తింపు సంఖ్యను కేటాయిస్తారు. ► సదరం క్యాంపులో వైద్యులు దరఖాస్తుదారుడి వైకల్యం శాతాన్ని అంచనా వేస్తారు. సదరు దరఖాస్తుదారుకు అదేరోజున సదరం సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది. మహిళా రైతుల జీవన ప్రమాణాలు పెంపు.. మహిళా రైతుల జీవన ప్రమాణాలను పెంచేందుకు గ్రామీణ పేద నిర్మూలన సంస్థ (సెర్ప్) కృషి చేస్తుందని మంత్రి ఎర్రబెల్లి అభిప్రాయపడ్డారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్‌పీజీ) ను ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు తోడ్పాటును అందిస్తోందన్నారు. వ్యవసాయ విలువ అభివృద్ధిలో భాగంగా 1,928 గ్రామాల్లో పంటల విశ్లేషణ చేశామని, 4,139 రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేసి 66,116 మంది రైతుల బేస్‌లైన్ సర్వే పూర్తి చేశామని, ఆయా గ్రామాల్లో రైతు సంఘాలను సంఘటితం చేసి... రైతు ఉత్పత్తిదారుల కంపెనీలుగా ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ముఖ్యకార్యదర్శులు వికాస్ రాజ్, పార్థసారథి, సెర్ప్ సీఈవో పౌసుమిబసు తదితరులు పాల్గొన్నారు. ఇబ్బందులకు చెక్.. ⇒ సదరం శిబిరాలకు ఇప్పుడు ఒకే సారి వేల మంది వస్తున్నారు. దీని వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆన్లైన్ స్లాట్‌బుకింగ్ విధానం అమల్లోకి రావడం వల్ల.. రద్దీకి సంబంధించిన ఇబ్బందులుండవు. ⇒ దివ్యాంగులు వారికి అనుకూలంగా ఉన్న సమయంలో ఏదైనా మీసేవ కేంద్రానికి వెళ్లి స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. ⇒ సదరం శిబిరాల్లో ప్రస్తుతం కంప్యూ టర్ ఆపరేటర్ అందరి వివరాలను అదేరోజు నమోదు చేయడం వల్ల టైం ఎక్కువ పడుతోంది. దీనివల్ల దివ్యాంగులు, నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఆపరేటర్ల తొందరపాటుతో కొన్నిసార్లు టైపింగ్ తప్పులు దొర్లుతున్నాయి. ఆన్లైన్ విధానంతో ఈ సమస్యలుండవు. ఆన్లైన్లో వివరాలన్నీ ముందుగానే నమోదై ఉంటాయి. -
‘దివ్యం’గా ఓటేయొచ్చు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: వంద శాతం పోలింగ్‌పై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఇందులో భాగంగా దివ్యాంగులందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పలు చర్యలు చేపట్టింది. పోలింగ్ స్టేషన్లను దివ్యాంగుల ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతోంది. వికలాంగులు, వృద్ధులు, గర్భిణులు, ఎన్నికల సంఘం గుర్తించిన వ్యాధిగ్రస్తులు సులభతరంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. వారు పోలింగ్ కేంద్రానికి చేరుకుని.. ఓటు వేసి తిరిగి ఇంటికి వెళ్లే వరకు అధికారులు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 44,386 మంది దివ్యాంగులు ఓటర్లుగా నమోదయ్యారు. వీరంతా ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఓటేసేలా ఎన్నికల అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. మెరుగుపడుతున్న ఓటింగ్ శాతం.. గతంలో వికలాంగులు చాలా మంది పోలింగ్‌కు దూరంగా ఉండేవారు. శరీరం సహకరించక, రవాణా సౌకర్యంలేక తదితర కారణాల వల్ల ఓటు హక్కును వినియోగించుకునేవారు కాదు. ఇలా కనీసం 50 శాతం దివ్యాంగులు కూడా పోలింగ్ స్టేషన్‌కు వచ్చే పరిస్థితులు లేకపోయేవి. దీన్ని గుర్తించిన ఎన్నికల సంఘం.. వారు ఓటు వేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల నుంచి దీనికి శ్రీకారం చుట్టగా.. మెరుగైన ఫలితాలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. దాదాపు 76 శాతం మంది దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకున్నారని అధికార వర్గాల అంచనా. అంతేగాక గతంలో ఏడు రకాల వికలాంగులు, వ్యక్తుల కోసమే పోలింగ్ స్టేషన్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు, మినహాయింపులు చేశారు. ప్రస్తుతం ఈ సంఖ్యను 21కి పెంచారు. ఈ జాబితాలోని వారు ప్రత్యేక సౌకర్యాలు పొందవచ్చు అంధత్వం, తక్కువ దృష్టి, వినికిడి లోపం, చలన/శారీకర వైకల్యం, మానసిక వైకల్యం/బుద్ధిమాంధ్యం మానసిక రుగ్మత, యాసిడ్ దాడి బాధితులు, తలసేమియా, హెమోఫిల్ల (రక్తం గడ్డకట్టని స్థితి). మెదడు పక్షవాతం, ఆటిజం, బహుళ వైకల్యం, కుష్టువ్యాధి నయమైనవారు, మరుగుజ్జు, దీర్ఘకాలిక నరాల సమస్య, నరాల బలహీనత, కండరాల క్షీణత, నాడీ వ్యవస్థలో సమస్యలున్నవారు. ప్రత్యేక సదుపాయాలు ఇలా.. పోలింగ్‌బూత్‌ల వరకు దివ్యాంగులను తీసుకొచ్చి.. వారు ఓటు వేసిన తర్వాత తిరిగి వాహనంలో ఇంటికి చేర్చుతారు. ఈ రవాణా సదుపాయం ఉచితమే. ప్రతి పోలింగ్ కేంద్ర వద్ద ట్రైసైకిల్ అందుబాటులో ఉంటుంది. మూగ, చెవిటి ఓటర్లకు సైన్ లాంగ్వేజీ ద్వారా ఓటు వేసే సదుపాయం కల్పిస్తారు. పోలింగ్ కేంద్రాల్లోకి సులువుగా రాకపోకలు జరిపేందుకు ర్యాంప్‌లు నిర్మిస్తారు. అంధులకు సహాయంగా పోలింగ్ కేంద్రంలోకి ఒకరిని అనుమతిస్తారు. వికలాంగులు, వృద్ధులు, గర్భిణులు, కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక క్యూ ఏర్పాటు చేస్తారు. పోలింగ్ కేంద్రాలకు అతి సమీపంలో వాహనాల పార్కింగ్ , గ్రౌండ్ ఫ్లోర్‌లోనే పోలింగ్ కేంద్రం ఏర్పాటు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఒకరు చొప్పున వలంటీర్‌ను అందుబాటులో ఉంచుతారు. -
‘వికలాంగులకు మోదీ క్షమాపణ చెప్పాలి’
నాగర్‌కర్నూల్ క్రైం: రూర్కి ఐఐటీలో నిర్వహించిన స్మార్ట్ ఇండియా హకధన్‌లో కార్యక్రమంలో విద్యార్థులతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వికలాంగులను కించపరిచే విధంగా డైస్లెక్సియా పదాన్ని ఉపయోగించారని, వికలాంగులను అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక డిమాండ్ చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం జిల్లా ఎస్పీ సాయిశేఖర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎన్పీఆర్డీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలీశ్వర్ మాట్లాడుతూ రాజకీయ నాయకులు ఉద్దేశపూర్వకంగానే వికలాంగులను అవమానపరుస్తున్నారని, 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో మూగ, చెవిటి, గుడ్డి లాంటి పదాలను ఉపన్యాసాల్లో ఉపయోగించి వికలాంగులను కించపరిచారన్నారు. వికలాంగుల మనోభావాలను దెబ్బతినకుండా రాజకీయ నాయకులు ఉపన్యాసాలు చేసుకోవాలని కోరారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన వారిలో జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాసులు, కొములయ్య, శశిధర్, పరమేశ్వర్, రామస్వామి, నిర్మల తదితరులు పాల్గొన్నారు. అవమానపర్చడం తగదు నాగర్‌కర్నూల్ రూరల్: వికలాంగులను అవమానపర్చేవిధంగా దేశ ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడటం సరికాదని, వారికి క్షమాపణ చెప్పాలని ఎంపీఆర్డీ తెలంగాణ రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బహిరంగ సమావేశాల్లో ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అవమానించినా.. బెదిరించినా శిక్షార్హులు అవుతారని, జరిమానా కూడా విధించవచ్చని, రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తి ఇలా మాట్లాడటం దారుణమన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి పదాలు వాడుకోవడం తప్ప మరొకటి కాదని, తక్షణం వికలాంగులకు క్షమాపణ చెప్పాలని కుర్మయ్య, శశిధర్, పరమేశ్వర్, రామస్వామి, స్వామి, నిర్మల, రాములు, శివ తదితరులు పేర్కొన్నారు. -
తండ్రి బర్త్‌డేకి వంద బైకులు దానం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వందమంది వికలాంగులకు ప్రత్యేకంగా రూపొందించిన ద్విచక్ర వాహనాలను శనివారం పంచి పెట్టారు. ఆయన తండ్రి, దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 71వ పుట్టిన రోజు సందర్భంగా రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వికలాంగుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన బైక్‌లను వారికి అందజేశారు. శారీరక వైకల్యాన్ని పక్కనపెట్టి, మనోధైర్యంతో ముందడుగు వేసిన వందమంది వికలాంగ యువకులను దీనికి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా అద్భుత విజయాలు సాధించిన వారిని రాహుల్ ప్రత్యేకంగా అభినందించారు. వారి భవిష్యత్తు ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు. కాగా రాహుల్ గాంధీ ట్రస్టీ గా ఉన్న రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి యేటీ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఆనవాయితీ.