పరుగులో తగ్గుతున్నారు..!
* జిల్లాకేంద్రంలో రెండోరోజు దేహదారుఢ్య పరీక్షలు
* పరిశీలించిన డీఐజీ అకున్ సబర్వాల్
* 100మీటర్ల పరుగుపోటీలో అభ్యర్థికి విరిగిన కాలు
మహబూబ్‌నగర్ క్రైం : ఎస్‌ఐ దేహదారుఢ్య పరీక్షల్లో పురుష అభ్యర్థులు పరుగు పందెంలో వెనుకంజ వేస్తున్నారు. ముఖ్యంగా 800మీటర్ల పరుగుపోటీలో మైదానం చుట్టూ 2.50నిమిషాలలో రెండురౌండ్లు పరుగెత్తాల్సి ఉంది. ఈ క్రమంలో మొదటి రౌండ్‌బాగానే వెళ్తున్నా.. రెండోరౌండ్‌లో పూర్తిగా వెనుకబడుతున్నారు. దీంతో చాలామంది అభ్యర్థులు పోటీ నుంచి వెనుదిరుగుతున్నారు.
దేహదారుఢ్య పరీక్షలను రెండోరోజు మంగళవారం జిల్లాకేంద్రంలోని క్రీడా మైదానంలో నిర్వహించారు. 922మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. ఆ తర్వాత 110బ్యాచ్‌లలో 804మంది అభ్యర్థులు ఐదురకాల దేహదారుఢ్య పరీక్షల్లో పాల్గొన్నారు. దీంట్లో 340మంది అర్హత సాధించారు. అందులో 322పురుషులు, 58మంది అమ్మాయిలు ఉన్నారు.
ఈవెంట్స్‌ను పరిశీలించిన డీఐజీ
జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న ఎస్‌ఐ దేహదారుఢ్య పరీక్షలను మంగళవారం హైదరాబాద్ రేంజ్ డీఐసీ అకున్ సబర్వాల్ పరిశీలించారు. ఎస్పీతో మాట్లాడి పలువిషయాలు తెలుసుకున్నారు.
ప్రోత్సహించిన ఎస్పీ
జిల్లా మైదానంలో కొనసాగుతున్న ఎస్‌ఐ దేహదారుఢ్య పరీక్షలకు వచ్చిన అభ్యర్థులను ఎస్పీ రెమా రాజేశ్వరి ప్రోత్సహించారు. 100మీటర్లు, 800మీటర్లు పరుగు పోటీలో పాల్గొన్న అభ్యర్థులు ఆత్మస్థైర్యంతో ఉండి అన్నింటిలో విజయం సాధించాలని సూచించారు.
వర్షం రాకతో నిలిచిన పరీక్షలు
రెండు రోజుల నుంచి జిల్లాలో జల్లులతో కురుస్తున్న వర్షం ఎస్‌ఐ దేహదారుఢ్య పరీక్షలకు ఇబ్బందిగా మారింది. మంగళవారం కూడా వాన కురువడంతో సాయంత్ర 5గంటలలోపే ఈవెంట్స్‌ను ముగించారు. బుధవారం వర్షం వస్తే మైదానం మరింత కఠినంగా మారే అవకాశం ఉంది.
ఈవెంట్స్‌లో అపశ్రుతి
మంగళవారం మధ్యాహ్నం నిర్వహించిన 100మీటర్ల పరుగుపందెంలో అపశ్రుతి చోటుచేసుకుంది. జడ్చర్ల మండలం కిష్టంపల్లికి చెందిన పి.మల్లయ్య దాదాపు 12.40ప్రాంతంలో 100మీటర్ల పరుగులో పాల్గొన్నాడు. గమ్యం చేరడానికి రెండు సెకెండ్ల సమయం ఉండగా కిందపడ్డాడు. దీంతో కుడికాలు పిక్కకింది భాగం విరిగింది. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే అతన్ని అంబులెన్స్ ద్వారా జిల్లా ఆస్పత్రికి తరలించారు.
అయితే మల్లయ్యకు 20రోజులుగా మోకాలి కింది భాగంలో నొప్పి వస్తుందని తెలిసింది. ఎస్‌ఐ పరీక్షలో విజయం సాధించాలనే తపనతో ఈవెంట్‌లో పాల్గొన్నట్లు చెప్పాడు. కాలు విరిగే పరిస్థితి వస్తుందని ఊహించలేదని తెలిపాడు. మల్లయ్యను పరిశీలించిన డాక్టర్లు కాలు పూర్తిగా విరిగిందని చెప్పారు. వెంటనే ఆపరేషన్ చేయాలని అన్నారు.