‘ఉగ్ర’ పదాలను పట్టేస్తారు!
- సైబర్ టైర్రరిజంపై ఎన్‌ఐఏ ప్రత్యేక దృష్టి
- స్పెషల్ సెల్ ఏర్పాటు
- అమెరికా సంస్థ నుంచి సాఫ్ట్‌వేర్ కొనుగోలు
సాక్షి, సిటీబ్యూరో: ఉగ్రవాదుల సమాచార మార్పిడికి అడ్డాగా మారిన ఆన్‌లైన్ వ్యవస్థపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇంటర్‌నెట్ కేంద్రంగా సాగే కార్యకలాపాలకు చెక్ చెప్పేందుకు స్పెషల్ సెల్‌ను ఏర్పాటు చేసింది. దీనికి అవసరమైన సాఫ్ట్‌వేర్ సహా ఇతర టూల్స్‌ను అమెరికాకు చెందిన ఓ సంస్థ నుంచి ఖరీదు చేసింది. ఉగ్రవాదానికి సంబంధించిన కొన్ని పదాలు, కోడ్ వర్డ్స్‌ను గుర్తించేందుకు ఇవి ఉపకరిస్తాయి. ఇప్పటి వరకు కేవలం కేంద్ర నిఘా సంస్థలకే పరిమితమైన ఆన్‌లైన్ నిఘాను తొలిసారిగా ఓ దర్యాప్తు సంస్థ సైతం చేపట్టనుంది. ఉగ్రవాదులు సెల్‌ఫోన్లను వినియోగించడం చాలాకాలం క్రితమే మానేశారు. సానుభూతిపరుల ఆకర్షణ, రిక్రూట్‌మెంట్, సమాచార మార్పిడి తదితరాలన్నింటికీ ప్రస్తుతం ఇంటర్‌నెట్టే ప్రధాన ఆధారమైంది. నగరంలోని దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ళ సహా దేశ వ్యాప్తంగా పేలుళ్ళకు పాల్పడిన ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులు తమ కుట్రలను అమలు చేయడానికి ఆన్‌లైన్ ద్వారా కోడ్ వర్డ్స్‌ను వినియోగించి సంభాషించుకున్నారు.
ఈ రకంగా విస్తరిస్తున్న సైబర్ టైజానికి అడ్డుకట్ట వేయడానికి ఆన్‌లైన్ నిఘా వ్యవస్థ అవసరమని ఎన్‌ఐఏ సుదీర్ఘ కాలంగా ప్రతిపాదిస్తోంది. ప్రస్తుతం కేంద్ర ఆధీనంలో ఉన్న ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్‌లకు (రా), నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్టీఆర్వో)లకు మాత్రమే ఇలాంటి ఉపకరణాలు అందుబాటులో ఉన్నాయి. అనేక ప్రయత్నాలు చేసిన తరవాత ఈ పరిజ్ఞానం సమకూర్చుకోవడానికి కేంద్రం ఎన్‌ఐఏకు అనుమతిచ్చింది. దీంతో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసిన ఎన్‌ఐఏ నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్‌ఐసీ), డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్డ్స్ కంప్యూటింగ్ (సీ-డాక్) నుంచి అనుమతి పొందిన జాతీయ దర్యాప్తు సంస్థ అమెరికాకు చెందిన ఓ ప్రముఖ సంస్థ నుంచి ఆన్‌లైన్ నిఘాకు అవసరమైన ఆధునిక సాఫ్ట్‌వేర్‌తో పాటు కొన్ని టూల్స్‌ను సమకూర్చుకుంది.
ఈ సాఫ్ట్‌వేర్‌లో ఉగ్రవాదానికి సంబంధించిన సంస్థలు, వారు పదేపదే పదాలతో పాటు కొన్ని కోడ్ వర్డ్స్‌ను సైతం నిక్షిప్తం చేస్తారు. ఈ రకంగా రూపొందించిన సైబర్ హబ్‌ను అందుబాటులో ఉన్న సోషల్‌మీడియా సైట్లు, ఇంటర్‌నెట్‌లోకి సమాచార మార్పిడి వెబ్‌సైట్లకు అనుసంధానిస్తారు. ఫలితంగా ఆయా పదాలను వినియోగించి ఎవరైనా చాటింగ్ చేసినా, ఈ-మెయిల్స్ పంపినా తక్షణం ఆ విషయాన్ని ఎన్‌ఐఏకు చెందిన స్పెషల్ సెల్ ఆధీనంలోని సాఫ్ట్‌వేర్ సంగ్రహిస్తుంది. ఆ సందేశాన్ని పంపుతున్న, రిసీవ్ చేసుకుంటున్న వారి ఇంటర్‌నెట్ ప్రొటోకాల్ (ఐపీ) అడ్రస్‌లతో పాటు వారు వినియోగిస్తున్న కంప్యూటర్ ఉన్న ప్రాంతాలను గుర్తించి పాప్‌అప్‌ల రూపంలో అప్రమత్తం చేస్తుంది. చాటింగ్‌లో ఉగ్రవాదులు వినియోగిస్తున్న పదాలు మారినప్పుడల్లా ఈ సిస్టం దానంతట అదే అప్‌డేట్ అవుతూ ఆన్‌లైన్ నిఘాను కొనసాగిస్తుంది. ప్రాథమికంగా ఢిల్లీలోని ఎన్‌ఐఏ యూనిట్‌కు చెందిన ముగ్గురు అధికారులు ఈ సాఫ్ట్‌వేర్, టూల్స్ వినియోగంలో అమెరికాలో ఆధునిక శిక్షణ పొందుతున్నారు. త్వరలోనే మరికొందరికీ శిక్షణ ఇప్పించడం ద్వారా హైదరాబాద్ సహా దేశంలోని అన్ని యూనిట్లలోనూ ఈ స్పెషల్ సెల్స్ ఏర్పాటుకు ఎన్‌ఐఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.