రెవెన్యూ లీలలు
తిమ్మిని బమ్మిని చేయడం రెవెన్యూ అధికారులకు వెన్నతో పెట్టిన విద్య. ఉన్న భూమిని లేనట్లు, లేని భూమిని ఉన్నట్లు, అసలు భూమే లేకుండా ఆధారాలు సృష్టించడం..ఒకరి పేరుతో ఉన్న భూమిని మరొకరి పేరుతో మార్చేయడం ఇవన్నీ వారి చేతుల్లో పనులే.. భూముల ఆన్‌లైన్ విధానంతో నకిలీ పాస్‌పుస్తకాలు, రికార్డుల తారుమారు వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కందుకూరు రెవెన్యూ డివిజన్‌లో ఈ తరహా అక్రమాలు కోకొల్లలుగా వెలుగుచూస్తున్నాయి.
- ఒక్కొక్కటిగా బయట పడుతున్న నకిలీ పాసుపుస్తకాలు, రికార్డుల తారుమారు వ్యవహారం
- మీ-భూమి, ఆన్‌లైన్ విధానంతో వెలుగులోకి వస్తున్న సమస్యలు
- డివిజన్‌లో 4,172 భూ సంబంధిత సమస్యలు పెండింగ్
కందుకూరు : రెవెన్యూశాఖలో పారదర్శకత కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన మీ-భూమి, ఆన్‌లైన్ విధానంతో రెవెన్యూ అధికారుల ఘనకార్యాలు బయటపడుతున్నాయి. సర్వేనంబర్ ఒకటే, భూమి ఒకటే కానీ ఇద్దరికి పాస్‌పుస్తకాలు ఇవ్వడం, రికార్డులో ఒకరు పేరు, పాస్ పుస్తకాలు మరొకరి పేరుపై ఉండడం ఇలా కోకొల్లలుగా ఉన్నతాధికారుల దృష్టికి సమస్యలు వస్తుండడంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రస్తుతం రెవెన్యూ డివిజన్‌లో 4 వేలకుపైగా సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో రెవెన్యూ అధికారులు చేసిన కొన్ని లీలలు ఇలా ఉన్నాయి...
- కందుకూరు పట్టణానికి సమీపంలో చుట్టుగుంటకు పోయే రోడ్డులో పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి 3 ఎకరాలకు పైగా పొలం ఉంది. ఈ పొలం వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని రెండేళ్ల నుంచి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. అయినా స్పందించకపోవడంతో చివరికి గట్టిగా నిలదీశాడు. దీంతో అసలు విషయం బయటపడింది. మీ భూమి ఎప్పుడో అమ్మేశారు కదా ఇంకా ఆన్‌లైన్ ఎలా అవుతాయంటూ సమాధానం చెప్పారు. ఈసీ, ఇతర ఒరిజినల్ డ్యాక్యుమెంట్ల ఆధారంగా నిలదీయడంతో ఈ పొలానికి నకిలీ పాసు పుస్తకాలు, డాక్యుమెంట్లు తయారు చేసి పట్టణంలోని ఓ బ్యాంక్‌లో రూ.3 లక్షలకుపైగా రుణం తీసుకున్నారు. ఈ కుట్రకు పాల్పడింది ప్రస్తుతం తహ శీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ వీఆర్వో కావడం గమనార్హం. చివరికి అక్రమం బయపడడంతో సదరు వీఆర్వో కాళ్లావేళ్లా పడి ఎవరికీ చెప్పవద్దు, నేను రికార్డులు మార్చి ఇస్తానని చెప్పి నాలుగు రోజుల్లో రికార్డులు మార్చి పొలానికి చెందిన యజమానులకు అప్పగించారు. ఇటీవల కందుకూరు తహ శీల్దార్ కార్యాలయంలో ఓ వీఆర్వో చేసిన ఘనకార్యం ఇది.
- ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో సర్వే నంబర్ 1230/ఎలో వెంకటకృష్ణారెడ్డి అనే వ్యక్తి పేరుపై 3.10 ఎకరాల భూమి ఉంది. తహశీల్దార్ ఆర్‌సి 165/2009 ఉత్తర్వుల ప్రకారం సదరు భూమి 15 సెంట్లు తగ్గించి దేవరపల్లి మల్లికార్జునరెడ్డి పేరుపై 7.5 సెంట్లు, మాలకొండారెడ్డి పేరుపై 7.5 సెంట్లు ఉన్నట్లు పాస్‌పుస్తకాలు ఇచ్చారు. కానీ ఆర్‌సి 165/2009 తహ శీల్దార్ ఉత్తర్వుల ప్రకారం సర్వేనంబర్ 582లో కుమ్మరిభారతి అనే మహిళపై 80సెంట్లు భూమి ఉన్నట్లు పాస్‌పుస్తకాలు జారీ చేశారు. ఇదీ కరేడు గ్రామంలో 2009లో జరిగిన సంఘటన ప్రస్తుతం ఆర్డీఓ దృష్టికి సమస్య వచ్చింది.
- వెలిగండ్ల మండలం కొత్త కండ్రిక గ్రామానికి చెందిన ముక్కు తిరుపతయ్య తనకు సర్వేనంబర్ 282/2, 284/1 సర్వేనంబర్ 5 ఎకరాల పొలం ఉంది. కానీ తనతో పాటు మరొకరి పేరు ఈ ఐదు ఎకరాలకు అధికారులు పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీ చేశారు. దీనిపై గతంలో గ్రామసభలో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ముక్కు తిరుపతయ్య ఆర్డీవో దృష్టికి తెచ్చారు.
- ఇలా ఒకటి కాదు, రెండు కాదు వేల సంఖ్యలో వెలుగులోకి వస్తున్న భూ సంబంధిత సమస్యలు ఆశాఖ ఉన్నతాధికారులను కలవరపెడుతున్నాయి. ఆర్డీఓ కార్యాలయంలో జరిగే ప్రజావాణి కార్యక్రమానికి 90శ ాతం భూసంబంధిత సమస్యలే వస్తున్నాయి. అదే సందర్భంలో ఇటీవల కనిగిరిలో రెండు నకిలీ పాస్‌పుస్తకాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పట్టుబడిన నకిలీ పాస్‌పుస్తకాల వివరాలు రికార్డుల్లో లేవు. నకిలీ స్టాంప్‌లు తయారు చేసి పాస్‌పుస్తకాలు సృష్టించినట్లు అధికారుల విచారణలో తేలింది. ఆర్డీఓ దగ్గర ఉన్న మరికొన్ని నకిలీ పాస్‌పుస్తకాలపై విచారణ సాగుతోంది. ఇలా ఒక పక్క నకిలీ పాస్‌పుస్తకాల వెలుగు చూస్తుండడంతో మరోపక్క ఒకే సర్వేనంబర్ లోని భూమికి ఇద్దరు, ముగ్గురు పాస్‌పుస్తకాలు, డ్యాక్యుమెంట్‌లు తీసుకుని ఆ భూమి నాదేనని వస్తున్నారు. తీరా వారి వద్ద ఉన్న ఆధారాలు పరిశీలిస్తే అందరి పాస్‌పుస్తకాలపై తహశీల్దార్ల సంతకాలు ఉంటున్నాయి. దీంతో అసలు ఒరిజనల్ పాస్‌పుస్తకాలు ఎవరివో తేల్చడం అధికారులకు తలకు మించిన భారంగా మారింది. ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సులో కేవలం భూసంబంధిత సమస్యలపై 4172 ఫిర్యాదులు వచ్చాయి. ఇవి కాక సర్వే కోసం 46, ప్రభుత్వ భూములకు సంబంధించి 9, ఇతర సమస్యలు 453 దరఖాస్తులు వచ్చాయి.
ఆన్‌లైన్ విధానంలో వెలుగులోకి అక్రమాలు:
ప్రభుత్వం భూముల వివరాల కోసం మీ-భూమి వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఈ వెబ్‌సైట్‌లో ప్రతి గ్రామానికి సంబంధించిన సర్వేనంబర్‌ల వారీగా భూముల వివరాలు నమోదు చేయాలి. వాటితో పాటు, ప్రైవేట్ భూములకు సంబంధించి యజమానుల పేర్లు ఆన్‌లైన్‌లో ఉంచాలి. ఇదే ప్రస్తుతం అధికారులకు తలనొప్పిగా మారింది. ఆర్‌ఎస్‌ఆర్ రికార్డులో ఉన్న భూముల వివరాలకి, అధికారులు జారీ చేసిన పాస్‌పుస్తకాల వివరాల్లో ఉన్న భూములు సరిపోలకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
ఉదాహరణకు ఓ గ్రామంలో ఆర్‌ఎస్‌ఆర్ రికార్డు ప్రకారం సర్వేనంబర్ 100లో రామయ్య అనే వ్యక్తి పేరుపై 3 ఎకరాల భూమి ఉంటే, లంచాలకు కక్కుర్తి పడ్డ అధికారులు రికార్డులు తారుమారు చేసి 3.50 ఎకరాలకు పాస్‌పుస్తకాలు ఇచ్చారు. ఇప్పుడు ఈ భూమిని ఆర్‌ఎస్‌ఆర్ రికార్డు ప్రకారం ఆన్‌లైన్ చేయాలంటే వీలు కాని పరిస్థితి. ఇలా మండలాల వారీగా వందల ఎకరాల భూములు వివరాలు సరిపోలక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో కొందరు తహశీల్దార్లు పూర్తిస్థాయి భూముల వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచలేకపోతున్నారు. రైతులు మాత్రం తమ భూములు ఆన్‌లైన్ చేయడం లేదంటూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
సమస్యలు ఉన్నమాట వాస్తవమే -ఆర్డీవో మల్లికార్జున
ఈ డివిజన్‌లో భూములకు సంబంధించిన సమస్యలు ఉన్న మాట వాస్తవమే. అన్‌రిజిస్టర్డ్ డ్యాక్యుమెంట్‌లతో సెటిల్‌మెంట్ చేసుకున్న సమస్యలు అధికంగా ఉన్నాయి. ఆర్‌ఎస్‌ఆర్ రికార్డు వివరాలకి, భూముల వివరాలకు సరిపోలడం లేదు. వీటిని ఇప్పటికప్పుడు పరిష్కరించడం సాధ్యం కాాదు. విచారణ జరిగి వాస్తవ లబ్ధిదారులు గుర్తించిన తరువాతే పరిష్కారమవుతాయి.