‘డబుల్’ ఎంపిక ట్రబుల్ | 'Double' Choice Trouble | Sakshi
Sakshi News home page

‘డబుల్’ ఎంపిక ట్రబుల్

Published Mon, Mar 14 2016 2:30 AM | Last Updated on Sun, Sep 3 2017 7:40 PM

‘డబుల్’ ఎంపిక ట్రబుల్

‘డబుల్’ ఎంపిక ట్రబుల్

వివాదాస్పదమవుతున్న లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ
కలెక్టర్‌కు నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఫిర్యాదు
అధికార పార్టీ ప్రజాప్రతినిధుల నుంచే విమర్శలు
ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం తీరిదీ..


 సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ప్రభుత్వ ప్రతిష్టాత్మక డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పథకం వివాదాస్పదమవుతోంది. ఈ గృహాల నిర్మాణానికి టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోగా, తాజాగా చేపట్టిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా విమర్శలకు దారితీస్తోంది. నిర్మల్‌లో గృహాలు మంజూరు చేయిస్తామని చెప్పి కొందరు దళారులు దరఖాస్తుదారుల నుంచి రూ.లక్షల్లో వసూళ్లకు పాల్పడుతున్నారని ఏకంగా అధికార పార్టీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో కొత్త వివాదానికి తెరలేచింది.

లబ్ధిదారుల ఎంపికను రహస్యంగా కాకుండా, పారదర్శకంగా నిర్వహించాలని చైర్మన్ కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గృహ నిర్మాణ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సొంత నియోజకవర్గంలోనే ఈ తీరు నెలకొనడం చర్చనీయాంశంగా మారింది. డబుల్‌బెడ్‌రూం ఇళ్ల కోసం నెల రోజుల క్రితం నిర్మల్‌లో దరఖాస్తులు తీసుకున్నారు. కొందరు నేరుగా మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా, కొన్ని వార్డుల్లో కౌన్సిలర్లే దరఖాస్తులు తీసుకుని మున్సిపల్ కార్యాలయంలో ఇచ్చారు.

ఒక్క నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలోనే సుమారు రెండు వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటిని అధికారులు రెవెన్యూ శాఖకు పంపారు. తాజాగా ఈ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ చేపట్టారు. పట్టణంలో వార్డుల వారీగా ఈ పరిశీలన చేస్తున్నారు. ఈ తంతును అధికారులు మొక్కుబడిగా ముగుస్తుండడంతో పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లబ్ధిదారుల జాబితా ఎప్పుడో సిద్ధం చేశారనే ఆరోపణలు వస్తున్నారుు. ఈ నేపథ్యంలో చైర్మన్ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.

 ఆదిలాబాద్‌లోనూ..
 జిల్లా కేంద్రంలోనూ ఈ పథకం అమలు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులుండగా, టీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్ల వార్డులనే ఈ పథకానికి ఎంపిక చేశారని ఇటీవల ఆమ్‌ఆద్మీ పార్టీ విమర్శించింది. ఈ పథకం కేటాయింపుల్లో అధికారులు మార్గదర్శకాలను పాటించడం లేదని, వికలాంగులు, వితంతువులకు ప్రాధాన్యత కల్పించాల్సి ఉండగా, అధికారులు ఇవేవీ పట్టించుకోవడం లేదన్నారు. గ్రామసభలు, వార్డు సభలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక జరగాలి. కానీ అలాంటేవేవీ లేకుండానే ఇష్టానుసారంగా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

మొదటి విడతలో ఒక్కో నియోజకవర్గానికి 400 చొప్పున జిల్లాకు 4,000 గృహాలు మంజూరయ్యాయి. అదనంగా ఆదిలాబాద్ నియోజకవర్గానికి 500, నిర్మల్ నియోజకవర్గానికి 250 ఇండ్లు మంజూరయ్యాయి. వీటి నిర్మాణ బాధ్యతలను పట్టణాల్లో ఆర్‌అండ్‌బీకి, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖకు అప్పగించారు. వీటి నిర్మాణానికి పంచాయతీరాజ్ అధికారులు ఇప్పటికే రెండు పర్యాయాలు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రతిష్టంబన నెలకొన్న విషయం విదితమే. తాజాగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా వివాదానికి దారితీస్తుండడం గమనార్హం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement