అధికారులకు ‘పెమాండో’ శిక్షణ
సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణంలో సింగపూర్ చేతిలో కీలుబొమ్మగా మారిన ప్రభుత్వం తాజాగా పరిపాలనలో మలేసియా పెత్తనానికి తెర లేపింది. వివిధ శాఖల్లో సంస్కరణల అమలుకు మలేసియాకు చెందిన ‘ఫెర్ఫార్మెన్స్ మేనేజిమెంట్ అండ్ డెలివరీ యూనిట్ (పెమాండో) సహాయ సహకారాలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పెమాండో సంస్థతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ సంస్థ కోరిన సమాచారం ఎప్పటికప్పుడు ఇవ్వాలని అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది.
తాజాగా ఆదాయ ఆర్జన శాఖల (రెవెన్యూ ఎర్నింగ్) పరిస్థితిపై అధ్యయనం చేసి చేపట్టాల్సిన సంస్కరణలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు పెమాండో సన్నాహాలు చేపట్టింది. ఎంపిక చేసిన జాయింట్ కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లతోపాటు రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో మలేిసియా సంస్థ ప్రతినిధులు సమావేశమై మలేసియాలో అమలవుతున్న సంస్కరణలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. సీసీఎల్‌ఏ అనిల్ చంద్ర పునేఠా, సీసీఎల్‌ఏ కార్యదర్శి రామారావు ఇటీవల ఇదే అంశంపై ఆ దేశానికి వెళ్లి ఆ సంస్థ ప్రతినిధులతో సమావేశమై వచ్చారు. కాగా ఏయే శాఖల్లో ఎలాంటి లోపాలు ఉన్నాయో, ప్రభుత్వ కార్యక్రమాలు ఎందుకు సక్రమంగా అమలు కావడంలేదో ప్రత్యేకంగా విదేశీ సంస్థ చెప్పాల్సిన అవసరం లేదని ఇప్పటికే వివిధ కమిటీలు ఇచ్చిన నివేదికలను సర్కారు చిత్తశుద్ధితో అమలు చేస్తే సరిపోతుందని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.
నేడు వర్క్‌షాప్..
పెమాండో, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయమే లక్ష్యంగా హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(ఎంసీహెచ్‌ఆర్‌డీ)లో సోమవారం వర్క్‌షాప్‌ను నిర్వహించనున్నారు. దీన్ని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రారంభిస్తారు.
పాలనలో ఇక మలేసియా పెత్తనం!
Published Mon, Jun 20 2016 2:08 AM | Last Updated on Mon, Sep 4 2017 2:53 AM
Advertisement