మలేషియాలో శానిటేషన్ అద్భుతం | Malaysia Sanitesan miracle | Sakshi
Sakshi News home page

మలేషియాలో శానిటేషన్ అద్భుతం

Published Fri, Mar 11 2016 2:16 AM | Last Updated on Sun, Sep 3 2017 7:26 PM

మలేషియాలో శానిటేషన్ అద్భుతం

మలేషియాలో శానిటేషన్ అద్భుతం

ఆ స్ఫూర్తితో నగరంలో  గ్రీనరీ అభివృద్ధి
మేయర్ కోనేరు శ్రీధర్

 
విజయవాడ సెంట్రల్ : మలేషియాలో శానిటేషన్ అద్భుతంగా ఉందని, ఆ దేశ స్ఫూర్తితో నగరంలో పచ్చదనాన్ని అభివృద్ధి చేయనున్నట్లు నగర మేయర్ కోనేరు శ్రీధర్ చెప్పారు. మలేషియాలోని మెలేకా నగరంలో జరిగిన  2వ ఆసియా పసిఫిక్ ఫోరమ్ ఆన్ అర్బన్ రీసెలైన్స్ అండ్ అడాప్షన్ సదస్సులో పాల్గొన్న మేయర్ గురువారం నగరానికి చేరుకున్నారు. తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సదస్సు వివరాలు వెల్లడించారు. ఒక్క కాగితం ముక్కకూడా రోడ్డుపై కనిపించదన్నారు. ఆ దేశాన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని వివరించారు.

మూడు లక్షల జనాభా ఉన్న నగరంలో రెండు వేల మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తారన్నారు. ప్రతి పారిశుధ్య కార్మికుడికి సొంత ఇల్లు, కారు ఉన్నాయని, ఇళ్లకు ఏసీలు ఉన్నాయన్నారు. కార్పొరేషన్ కార్యాలయంలోకి బయటి ప్రజల్ని అనుమతించరన్నారు. వివిధ పనులపై వచ్చే వారికి ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఉద్యోగులు పనులు పూర్తిచేసి పంపుతారన్నారు. అనుమతుల్లేకుండా ఎలాంటి కట్టడాలు, షాపుల్ని ఏర్పాటు చేయరన్నారు. అక్కడ ముఖ్యమంత్రే మేయర్, కార్పొరేటర్లను నామినేట్ చేస్తారన్నారు. చట్టాలను ప్రజలు గౌరవిస్తారన్నారు. పోలీస్‌ల సంఖ్య తక్కువగానే ఉందన్నారు. అండర్‌గ్రౌండ్ డ్రెయినేజ్  వ్యవస్థ పకడ్బందీగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఫలితంగా రోగాలు తక్కువే ఉన్నట్లు గుర్తించామన్నారు. ప్లాస్టిక్‌పై పూర్తిస్థాయిలో నిషేధం అమల్లో ఉందన్నారు.

గ్రీనరీపై దృష్టి
 అక్కడ అన్ని రకాలుగా ఉపయోగపడే మొక్కల్ని పెంచుతారన్నారు. వాతావరణ, ధ్వని కాలుష్యాం తక్కువగా ఉన్నాయన్నారు. సాలీడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ద్వారా ఎనర్జీ, సోలార్ ఎనర్జీని అక్కడ రూపొందిస్తున్నారన్నారు. అదే విధానాన్ని నగరంలోనూ కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటులో విజయవాడ నగరపాకల సంస్థే ముందు ఉందన్నారు. నగరంలో 90 శాతం ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తే అక్కడ 50 శాతం మాత్రమే ఎల్‌ఈడీ లైట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఆస్తిపన్నుతో కలిపే నీటి, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజ్, ఖాళీ స్థలాల పన్నుల్ని అక్కడ వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన అమరావతి రాజధాని నిర్మాణం, ల్యాండ్‌పూలింగ్ పద్ధతిలో భూసేకరణ, జెఎన్‌ఎన్యూఆర్‌ఎం ఇళ్ల కేటాయింపు తదితర అంశాలపై సదస్సులో తాను వివరించినట్లు పేర్కొన్నారు. అక్కడ కూడా ప్రభుత్వం కొత్తగా చేపట్టే నిర్మాణాలకు స్థల సమస్య ఉందన్నారు. అదనపు కమిషనర్ పి.అరుణ్‌బాబు పాల్గొన్నారు.

అభివృద్ధి జరగాలంటే  ప్రజల మైండ్‌సెట్ మారాలి
మలేషియా తరహాలో నగరంలో అభివృద్ధి జరగాలంటే ప్రజల మైండ్‌సెట్ మారాలని మేయర్ కోనేరు శ్రీధర్ అభిప్రాయపడ్డారు. గురువారం తన చాంబర్లో ఏర్పాటు చేసిన కార్పొరేటర్లు, అధికారుల సమావేశంలో తన పర్యటన వివరాలు వివరించారు. వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ షేక్‌బీ జాన్‌బీ మాట్లాడుతూ మనకి అక్కడికి తేడా ఏంటి అని ప్రశ్నించగా, మేయర్ పై విధంగా స్పందించారు. ప్రపంచ వాతావరణ మార్పులు, గ్రీనరీ, హౌసింగ్‌పై ప్రధానంగా సదస్సు జరిగిందన్నారు. 30 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారన్నారు. స్థానిక సంస్థలకు అధికారాలు పెంచాలని, వారి నిర్ణయాలను పరిగణనలోకి తీసుకోవాలని తాను సదస్సులో సూచించినట్లు తెలిపారు. మనదేశంలోనే మహిళల కట్టుబొట్టు బావున్నాయని, అక్కడి కల్చర్ ఓపెన్‌గా ఉందన్నారు. అభివృద్ధి గురించి ఏదైనా చెప్పగలం కానీ చేయడం కష్టమన్నారు. ప్రజల సహకారం ఉంటేనే మార్పు సాధ్యమవుతోందని పేర్కొన్నారు.

 సూచనలు ఇలా
 ప్రతినగరంలో పచ్చదనాన్ని పెంపొందించాలని, ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో మొక్కల నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని సదస్సులో పలుదేశాల ప్రతినిధులు సూచనలు చేశారన్నారు. నదుల అనుసంధానం జరగాలని,అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ గ్రూపులు తయారుచేసి వాటికి ఫైనాన్స్ చేయడం ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు తీసుకురావచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement