‘పుష్కర’ సేవకు గుర్తింపేది.. | 'Pushkarni' service to be recognized | Sakshi
Sakshi News home page

‘పుష్కర’ సేవకు గుర్తింపేది..

Published Fri, Aug 21 2015 3:12 AM | Last Updated on Sun, Sep 3 2017 7:48 AM

‘పుష్కర’ సేవకు గుర్తింపేది..

‘పుష్కర’ సేవకు గుర్తింపేది..

ఆదిలాబాద్ : పుష్కరాలు ముగిసి దాదాపు నెల రోజులు కావస్తోంది. అయినా వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందికి ఇప్పటి వరకు నయాపైసా టీఏ, డీఏ చెల్లించలేదు. ఇక వస్తాయని ఎదురుచూస్తున్నా రోజులు గడుస్తున్నాయో గానీ డబ్బులు ఏ ఒక్కరికి చేతికి అందలేదు. దీంతో అసలు టీఏ, డీఏ సొమ్ము వస్తుందా.. లేదా.. అని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు, రెవెన్యూ శాఖలతో సమానంగా తాము విధులు నిర్వర్తించామని, వారికి ఇప్పటికే డబ్బులు అందగా తమకు మాత్రం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ డబ్బులను కాజేశారా..? లేకపోతే ఎందుకు విడుదల చేయడం లేదని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు చాలకపోవడంతోనే సిబ్బందికి టీఏ, డీఏ ఇవ్వలేకపోతున్నామని వైద్య, ఆరోగ్య శాఖాధికారులు చెబుతున్నారు. ఇది అధికారుల వైఫల్యంగా కన్పిస్తోంది.

 ఇదా.. గుర్తింపు..!
 పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే గోదావరి పుష్కరాలను గత జూలై నెలలో పన్నెండు రోజులపాటు నిర్వహించారు. రాష్ట్రంలో తొలిసారి ఘనంగా నిర్వహించామని ప్రభుత్వం గొప్పలకు పోతున్నప్పటికీ సేవలందించిన వారిని విస్మరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంద్రాగష్టు రోజు పుష్కరాల పనుల్లో సేవలందించిన వారికి ప్రశంస పత్రాలు కూడా అందించారు. వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందికి టీఏ, డీఏలు కూడా ఇవ్వకపోవడం విమర్శలకు దారితీస్తోంది.

జూలై 14 నుంచి 25 వరకు జిల్లాలోని 33 పుష్కర ఘాట్లలో 696 మంది సిబ్బంది వైద్య సేవలు అందించారు. ఇందులో వైద్యులు, పారామెడికల్, 104 సిబ్బంది, గజిటెడ్, నాన్ గజిటెడ్, నాలుగో తరగతి ఉద్యోగులు ఉన్నారు. సేవలందించినందుకుగాను వారి హోదాకు తగ్గట్టుగా డీఏలు ఉండగా, దూర వ్యత్యాసాలను బట్టి రవాణ చార్జీలు అందజేయాలి. పోలీసు శాఖలో పుష్కర డ్యూటీకి చేరే ముందు రోజే వారిలో ఉత్సాహం నింపేందుకు టీఏ, డీఏలను ముందుగానే చెల్లించారు.

మరి పుష్కరాలు ముగిసి నెల రోజులు కావస్తున్నప్పటికీ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి ఇప్పటికీ టీఏ, డీఏలు ఇవ్వకపోవడంతో వారిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇదేనా మాకిచ్చే గుర్తింపు అని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం కలెక్టర్ జగన్మోహన్ జిల్లాలోని వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందితో నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్‌లో డివిజన్, మండల స్థాయి వైద్యాధికారులు పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకేళ్లాలని అనుకున్నప్పటికీ వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తమను ఎక్కడ టార్గెట్ చేస్తారోనని మిన్నకుండిపోయినట్లు తెలుస్తోంది.  

 వైఫల్యమెవరిది.?
 నిధులు చాలినంత రాకపోవడంతోనే టీఏ, డీఏ డబ్బులు చెల్లించలేకపోతున్నామని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. టీఏ, డీఏలు అన్ని కలిపి పుష్కరాల కోసం రూ.36 లక్షలు అవసరమని డెరైక్టర్ ఆఫ్ హెల్త్‌కు పుష్కరాలు ప్రారంభానికి ముందే నివేదించినట్లు పేర్కొంటున్నారు. ప్రభుత్వం నుంచి రూ. 24 లక్షలు మంజూరైనట్లు వివరించారు. పుష్కరాల్లో సేవలందించిన వైద్య ఉద్యోగులందరి టీఏ, డీఏ లెక్కలు వేస్తే రూ.19 లక్షలు పైబడుతుందని చెబుతున్నారు. అలాంటప్పుడు మంజూరైన రూ.24 లక్షల నుంచి రూ.19 లక్షలు మంజూరు చేయవచ్చు కదా అనే ప్రశ్న తలెత్తుతోంది.

దీనికి వైద్యారోగ్య శాఖ అధికారి చెబుతున్నా సమాధానం గందరగోళానికి దారి తీస్తోంది. పుష్కరాల్లో మొదట తక్కువ ఘాట్లు ఉన్నాయని ప్రభుత్వం చెప్పిందని, అనంతరం ఘాట్ల సంఖ్యను పెంచిందని చెబుతున్నారు. ఘాట్ల సంఖ్య పెరిగిపోవడంతో మొదట అనుకున్న 696 మంది సిబ్బందికి అదనంగా రిమ్స్, తదితర ఆస్పత్రుల నుంచి వైద్యులు, ఇతర సిబ్బందిని ఘాట్ల వద్ద వినియోగించుకోవాల్సి వచ్చిందని పేర్కొంటున్నారు. దీంతో ఈ వ్యయం పెరిగిపోయిందని అంటున్నారు.

మంచిర్యాల, చెన్నూర్, ఖానాపూర్, లక్సెట్టిపేట, నిర్మల్, బాసరలలో సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ల(ఎస్పీహెచ్‌వో)ల అకౌంట్లకు మొదట వచ్చిన రూ.24 లక్షల నుంచి రూ.20 లక్షలు విడుదల చేశామని డీఎంహెచ్‌వో అధికారులు చెబుతున్నారు. ముందుగా రెవెన్యూ అధికారులే వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందికి వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తారని భావించినట్లు పేర్కొంటున్నారు. తీరా పుష్కర ఘాట్ల వద్ద సరైన వసతులు కల్పించకపోవడంతో లాడ్జీల్లో సిబ్బంది ఉండాల్సి వచ్చిందని, హోటళ్లలో తినాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు.

ఈ పరిస్థితుల్లో ఎస్పీహెచ్‌వోలు ఆ నిధులను నేరుగా ఖర్చు చేయడం జరిగిందని వివరిస్తున్నారు. బాసరలో ఈ పరిస్థితి తీవ్రంగా రావడంతోనే సమస్య ఉత్పన్నమైందని చెబుతున్నారు. బాసరలో సాధారణ పరిస్థితులో ఉన్న రేట్ల కంటే పుష్కరాలు కొనసాగిన రోజుల్లో ధరలు అధిక శాతం ఉండడంతో పరిస్థితులు తారుమారయ్యాయని చెబుతున్నారు. ప్రభుత్వం కేటాయించిన నిధులు నేరుగా ఖర్చుకావడంతో ఇప్పుడు టీఏ, డీఏలు ఇవ్వలేని పరిస్థితి ఉందని పేర్కొంటున్నారు. ఈ దృష్ట్యా ప్రభుత్వం మళ్లీ నిధులు మంజూరు చేస్తేనే వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందికి టీఏ, డీఏలు ఇచ్చే పరిస్థితి కనబడుతోంది.

 సమన్వయలోపమేనా..?
 పుష్కరాల సమయంలో సేవందించిన ఉద్యోగులకు వసతి, భోజనాల విషయంలో వివిధ శాఖల అధికారుల మద్య సమన్వయలోపమే ఈ పరిస్థితికి కారణమన్నా వాదనలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ శాఖ అధికారులే అన్ని శాఖల సిబ్బందికీ వసతి, భోజనాలు ఏర్పాటు చేస్తారని భావించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ముందుగా ఎంత ఖర్చవుతుందనే విషయంలో సరైనా అంచనా వేయలేకపోయామని అంగీకరిస్తున్నారు.

తీరా పుష్కరాల సమయంలో రెవెన్యూ సిబ్బంది వసతులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రైవేట్ లాడ్జీలు, హోటళ్లలో సిబ్బందికి వసతి, భోజనాలు ఏర్పాటు చేశామని, బయట రేట్లు అధికంగా భారం అధికమైందని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దీనిపై డీఎంహెచ్‌వో రుక్మిణమ్మను వివరణ కోరగా, ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు ఖర్చు కావడంతో సిబ్బందికి టీఏ, డీఏ ఇవ్వలేకపోయామని అంగీకరించారు. రూ.17 లక్షలు నిధులు అవసరమని డెరైక్టర్ ఆఫ్ హెల్త్‌కు రాయడం జరిగిందని, ఆ డబ్బులు రాగానే ఉద్యోగుల ఖాతాల్లో నేరుగా జమచేస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement