చచ్చినా లెక్కలేదు!
► వడదెబ్బ మరణాలపై ఆరోగ్యశాఖ కాకిలెక్కలు మూణ్నెళ్లలో వెయ్యిమందికిపైగా మృతి..
► రికార్డుల్లో 30మంది మాత్రమే!
► మృతుల్లో ఉపాధి, రైతు కూలీలే అధికం
► రాష్ట్రంలోనే పాలమూరు ప్రథమస్థానం
► శాఖల మధ్య సమన్వయలోపం.. బాధితులకు శాపం
మహబూబ్‌నగర్ క్రైం: ప్రచండభానుడి దెబ్బకు సామాన్యులు విలవిల్లాడిపోతున్నారు. ముఖ్యంగా కూలినాలీ పనులకు వెళ్లే, ఎండలో ఎక్కువసమయం పనిచేసేవారు పిట్టల్లారాలిపోతున్నారు. జిల్లాలో వడదెబ్బకు రోజుకు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మూణ్నెళ్ల కాలంలో జిల్లాలో సుమారు వెయ్యిమందికిపైగా చనిపోయినట్లు అంచనా.. వడదెబ్బ మరణాల్లో రాష్ట్రంలో జిల్లా ప్రథమస్థానంలో నిలిచింది. మృతుల్లో ఎక్కువమంది ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న కూలీలు, రైతులు, గొర్రెలు, మేకలు, పశువులకాపరులు, వ్యవసాయ, దినసరి కూలీలు ఉన్నారు.
వీరిలో మధ్యవయస్కులే అధికం. కానీ వైద్యారోగ్య శాఖ మాత్రం మరణాలపై కాకిలెక్కలు వేసింది. ఎండల తీవ్రతకు కేవలం 30మంది మాత్రమే చనిపోయినట్లు రికార్డుల్లో పేర్కొంది. ఫలితంగా బాధిత కుటుంబాలకు న్యాయం జరగకుండాపోయింది. పోలీసు, తహసీల్దార్, వైద్యాధికారి ధ్రువీకరిస్తే వడదెబ్బ మృతులుగా పరిగణించాలని ఉన్నతాధికారుల ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. కానీ వైద్యారోగ్య శాఖ వారిని నామమాత్రంగా చూస్తూ ఏదో ఒకరోగం అంటగట్టి తమకేమీ సంబంధం లేదన్నట్లుగా తప్పించుకుంటుందనే విమర్శలు ఉన్నాయి. జిల్లా అధికారులు పంపించే నివేదికల ఆధారంగానే బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరిహారం దక్కుతుంది. ఈ నేపథ్యంలో శాఖల సమన్వయలోపం బాధితులకు శాపంగా మారింది. ఈనెల చివరి వరకు ఉష్ణోగ్రతల ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉండటంతో జిల్లావాసులు మరింత ఆందోళనకు గురవుతున్నారు.
అందని పరిహారం
ప్రస్తుత కరువు పరిస్థితుల్లో ఎంతోమంది పేదలు ఎర్రటి ఎండలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పనులు చేస్తున్నారు. తీవ్రమైన వడగాలులు, ఉష్ణోగ్రతలకు తట్టుకోలేక వడదెబ్బతో చాలామంది చనిపోతున్నారు. అయితే బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.50వేల ఆర్థికసాయం వస్తుందనే అవగాహన లేకపోవడంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయలేకపోతున్నారు. తద్వా రా పరిహారం పొందలేకపోతున్నారు. జిల్లాలో వడదెబ్బతో ఇప్పటివరకు 1012మంది అంచనా. కానీ వారిలో కేవలం 30మంది మాత్రమే మరిణించినట్లు వైద్య ఆరోగ్యశాఖ నివేదిక రూపొందించింది. ఓ వైపు వడదెబ్బ ని వారణ చర్యలు తీసుకోవడంలోనూ నిర్లక్ష్యం నెలకొంది. జిల్లాలో ఆరులక్షల ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశామ ని, మరో లక్ష ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నా.. పీహెచ్‌సీల్లో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని వడదెబ్బ బాధితులు చెబుతున్నారు.
30మరణాలు గుర్తించాం
జిల్లాలో ఇప్పటి వరకు వడదెబ్బతో మృతిచెందిన వాళ్లను 30మందిని గుర్తించాం. జిల్లాలో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించాం... ఇటీవలే కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా దీనిపై కార్యక్రమం ఏర్పాటుచేశాం. - డాక్టర్ పార్వతి, ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఓ