మండే ఎండలతో ఆరోగ్యానికి దెబ్బ
- పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి
- ఇప్పటికే 20కి చేరిన వడదెబ్బ మరణాల సంఖ్య..
- తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్న వైద్య, ఆరోగ్యశాఖ
- స్కూళ్లు మిట్టమధ్యాహ్నం వరకు ఉండటంతో విద్యార్థులకు ఇక్కట్లు
సాక్షి, హైదరాబాద్: అప్పుడే ఎండలు 43 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి. సాధారణం కంటే అనేకచోట్ల మూడు నాలుగు డిగ్రీలు అధికంగా నమోదవుతు న్నాయి. మండే ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వడదెబ్బతో మృతి చెందుతున్న వారి సంఖ్య దాదాపు 20కి చేరింది. ముఖ్యంగా కూలీలు, వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు భానుడి ప్రతాపానికి విలవిలలా డుతు న్నారు. తీవ్రమైన ఎండలో తిరిగేవారికి వడదెబ్బ తగిలే ప్రమాదముంది. దీంతో వాంతులు, విరేచనాలు, హైఫీవర్, చర్మం పొడిబారడం, డీహైడ్రేషన్, బీపీ పెరగడం, కిడ్నీ, గుండె వంటి ఫెయిల్యూర్ అవడం సంభవిస్తాయి.
వేసవిలో నీరు, ఆహారం కారణంగా కూడా అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఎండల తీవ్రతతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్య పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. దీంతో వైద్యారోగ్యశాఖ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
వేసవి ప్రణాళిక అమలులో నిర్లిప్తత...
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించి మిట్టమధ్యాహ్నం ఎర్రటి ఎండలో వదిలిపెడుతుండటంతో విద్యా ర్థులు విలవిలలాడుతున్నారు. అధిక ఉష్ణోగ్రత లుంటే ఉదయం 11 గంటల వరకే పాఠశాలలను నిర్వహించాలన్న వేసవి ప్రణాళికను విద్యాశాఖ ఏమాత్రం పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు న్నాయి. బస్టాండుల్లో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచడంలేదు. వేసవి ప్రణాళిక అమలుకు ప్రభుత్వం ఒక్క పైసా కూడా కేటాయించ లేదని అధికారులు పెదవి విరుస్తున్నారు.
వైద్యారోగ్యశాఖ పేర్కొన్న జాగ్రత్తలు...
► ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు బయట తిరగకూడదు.
► తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వెళితే టోపీ, తెల్లటి నూలు వస్త్రాలు ధరించాలి.
► నీరు, ఇతర ద్రవ పదార్థాలు వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి.
► మత్తుపానీయాలు తీసుకోకూడదు.
► వడదెబ్బకు గురైన వారిని ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి తరలించాలి.
► ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి.
► వడదెబ్బకు గురైన వారి శరీరాన్ని చల్లని నీటిలో ముంచిన గుడ్డతో తుడవాలి.
► వారికి ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరినీళ్లు, నిమ్మరసం, గ్లూకోజ్ లేదా ఓఆర్‌ఎస్ కలిపిన నీటిని తాగించాలి.
వడదెబ్బ లక్షణాలు...
► రోజుకు ఐదారుసార్ల కంటే ఎక్కువగా నీళ్ల విరేచనాలు రావడం, వాంతులు, వికారం, మెలిపెట్టినట్లుగా కడుపునొప్పి ఉండటం.
► జ్వరం 101 డిగ్రీల కంటే ఎక్కువగా ఉండటం.
► ఐదారు గంటలుగా మూత్రవిసర్జన నిలిచిపోవడం, నాలుక తడారిపోవడం.
► ఒక్కోసారి పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితికి చేరుకోవడం.
► పిల్లల శరీరంపై దద్దుర్లు రావడం, నుదురు వేడిగా ఉండటం.