సాక్షి, హైదరాబాద్: ఎండల నుంచి ప్రజలను రక్షించేందుకు వైద్య ఆరోగ్యశాఖ కార్యాచరణ ప్రణాళిక ప్రకటించింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు మంగళవారం మార్గదర్శకాలు జారీచేశారు. ఎండ తీవ్రత మార్చి నుంచి జూన్ మధ్య ఉంటుందని, కొన్ని సందర్భాల్లో జూలై వరకు కూడా ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు.
ఈక్రమంలో జిల్లాల్లో 24 గంటలూ పనిచేసేలా హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. జిల్లా నిఘా అధికారి నోడల్ ఆఫీసర్‌గా ఉంటారన్నారు. వడదెబ్బ తదితర ఆరోగ్య సమస్యలకు ఎవరైనా గురైతే వారిని కాపాడేందుకు జిల్లా, డివిజనల్ స్థాయిల్లో 24 గంటలూ పనిచేసే ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య అధికారులు వడదెబ్బ కేసులు/మరణాలు, తీసుకున్న నివారణ చర్యలపై రోజువారీ నివేదికను తనకు పంపాలని కోరారు. ప్రతీ రోజూ నీటి క్లోరినేషన్‌ను పీహెచ్‌సీ వైద్యాధికారులు తనిఖీ చేయాలని కోరారు.
మార్గదర్శకాలివీ...
♦ అన్ని పీహెచ్‌సీలు, ఉప ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీల్లో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలి.
♦ ఎండదెబ్బకు అందించాల్సిన ప్రాథమిక చికిత్సపై వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి.
♦ అన్ని ఆసుపత్రుల్లోనూ అత్యవసర ఔషధాలను తగినంత సంఖ్యలో నిల్వ ఉంచాలి.
♦ సీరియస్ కేసులేవైనా వస్తే వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించాలి.
♦ శిశువులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఆయా వర్గాలకు చెందినవారు ఎండకు దూరంగా ఉండాలి.
♦ ఆరు బయట పనిచేసే కార్మీకులు మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఎండలో పనిచేయకూడదు. పని ప్రదేశంలో వారికి ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా సురక్షితమైన తాగునీటిని అందించాలి. పని చేసే ప్ర దేశానికి సమీపంలోని కమ్యూనిటీ హాల్స్‌లో అవసరమైన షెల్టర్లను ఏర్పాటు చేయాలి.
♦ పట్టణ ప్రాంతాలు, మునిసిపాలిటీలలో స్వచ్ఛంద సేవా సంస్థలు, దాతృత్వ సంస్థలు ‘చలివేంద్రం’ ద్వారా సురక్షితమైన మంచినీటి సరఫరా అందజేయాలి.
♦ నీటి పైపులైన్‌లు లీకేజీ కాకుండా చర్యలు తీసుకోవాలి.
♦ పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, జిల్లా ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో ఎండ వేడిమి నుంచి ప్రజలను కాపాడేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి.
♦ ఆసుపత్రుల్లో బాధితులకు వడదెబ్బ పాలైన వారికోసం ప్రత్యేకంగా పడకలను సిద్ధం చేయాలి.
♦ ప్రజలు దాహం వేయకపోయినా, వీలైనంత వరకు తగినంత నీరు తాగాలి. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్‌ఎస్) వాడాలి. నిమ్మరసం, మజ్జిగ లేదా లస్సీ, పండ్ల రసాలు వంటి వాటిని తీసుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు నీటిని తీసుకెళ్లాలి.
♦ పుచ్చకాయ, నారింజ, ద్రాక్ష, పైనాపిల్, దోసకాయ వంటి పండ్లు, కూరగాయలను తినాలి.
♦ సన్నని వదులుగా ఉండే కాటన్ వ్రస్తాలను ధరించడం మంచిది
♦ ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ, టవల్ వంటి వాటిని ఉపయోగించాలి.
♦ పగటిపూట కిటికీలు, కర్టెన్లను మూసి ఉంచాలి.
♦ వేసవి ఎక్కువగా ఉండే సమయంలో వంట చేయడం మానుకోండి. వంట ప్రదేశాన్ని తగినంతగా వెంటిలేట్ చేయడానికి తలుపులు, కిటికీలను తెరవండి.
♦ ఆల్కహాల్, టీ, కాఫీ, శీతల పానీయాలు లేదా పెద్ద మొత్తంలో చక్కెరతో కూడిన పానీయాలను తాగకూడదు.
Comments
Please login to add a commentAdd a comment