
అంతా ఆన్‌లైన్
తూకాల్లో మోసాలు... చెల్లింపుల్లో జాప్యాన్ని నివారించడంతోపాటు మార్కెట్ యార్డుల్లో జరుగుతున్న మోసాలకు చెక్ పెట్టేందుకు యంత్రాంగం సరికొత్త విధానం ప్రవేశపెట్టబోతోంది. ఆరుగాలం శ్రమించి పంటలు సాగుచేసే రైతన్న పంటను అమ్ముకునే క్రమంలో మోసపోకుండా అడ్డుకట్ట వేయనుంది. అందుకోసం ఇకనుంచి మార్కెట్‌యార్డుల్లో రైతు ధాన్యం అమ్మిన వెంటనే తక్‌పట్టీల జారీ...చెల్లింపుల వివరాలన్నీ ఆన్‌లైన్‌లో పొందుపరిచేందుకు సిద్ధమైంది. అంతేకాకుండా మూడు రోజుల్లోనే రైతులకు డబ్బు చెల్లించేలా చర్యలు తీసుకుంటోంది. మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు సొంత జిల్లా కావడంతో మన జిల్లా నుంచే ఈ సరికొత్త విధానం అమలు కాబోతోంది.
గజ్వేల్: వ్యవసాయ మార్కెట్ యార్డుల్లోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానం అమల్లోకి రాబోతోంది. ఇకనుంచి కంప్యూటర్ విధానంలో తక్‌పట్టీలను జారీ చేయనున్నారు. మోసాల నివారణతోపాటు రైతుకు కచ్చితమైన సమాచారాన్ని ఇవ్వడానికి ఈసారి నుంచి ఈ విధానాన్ని అమలుచేయడానికి రంగం సిద్ధమైంది. అదేవిధంగా గతంలో మాదిరి కాకుండా బ్యాంకుల ద్వారా మూడు రోజుల్లోపు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోనున్నారు. జిల్లాలోని అన్ని యార్డుల్లో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
అక్రమాలకు అడ్డుకట్ట
జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, వంటిమామిడి, దౌల్తాబాద్, తొగుట, మిరుదొడ్డి, దుబ్బాక, రామాయంపేట, చేగుంట, మెదక్, నారాయణఖేడ్, వట్టిపల్లి, రాయికోడ్, జహీరాబాద్, సదాశివపేట, సంగారెడ్డి, నర్సాపూర్, జోగిపేటల్లో వ్యవసాయ మార్కెట్ యార్డులున్నాయి. ఈ యార్డుల్లో ప్రతి సీజన్‌లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నిర్వహణ అస్థవ్యస్తంగా మారుతోంది. కేంద్రాల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతుండడంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. గత ఏడాది గజ్వేల్‌లో మక్కల కొనుగోలు కేంద్రం నిర్వహణలో ఐకేపీ సిబ్బంది కుంభకోణానికి పాల్పడటం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ వ్యవహారంలో ముగ్గురు ఐకేపీ సిబ్బందిని సస్పెండ్ చేసిన విషయం విధితమే.
గజ్వేల్‌లోనే కాదు దాదాపు అన్ని యార్డుల్లోనూ అక్రమాల చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈసారి కొనుగోళ్లలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు సర్కార్ ఉపక్రమించింది. మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు నేతృత్వంలో తెలంగాణలోని అన్ని యార్డుల్లో ఇక నుంచి కొనుగోలు కార్యకలాపాలన్నీ ఆన్‌లైన్ విధానంలో జరపాలని నిర్ణయించింది. ఈమేరకు యార్డుల్లో కంప్యూటర్ విధానానికి సంబంధించిన కసరత్తును అధికారులు పూర్తి చేశారు. ఇక నుంచి యార్డుల్లోని కొనుగోలు కేంద్రాల్లో కంప్యూటర్ విధానంలోనే తక్‌పట్టీ(రశీదు)లను ఇవ్వనున్నారు. అంతేకాకుండా గతంలో చెల్లింపులు నెలల తరబడి కేంద్రాల నిర్వాహకులు చుట్టూ తిరిగినా, ఫలితం లేక రైతులు విసిగి వేసారిపోయేవారు. ఈ దుస్థితికి అడ్డుకట్ట వేసే దిశలో మూడు రోజుల్లోనే రైతుకు బిల్లులు అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా రైతుకు ఎప్పటికప్పుడు సెల్‌ఫోన్ మెసేజ్ ఇవ్వనున్నారు. మంత్రి హరీష్‌రావు సొంత జిల్లాలో ఈ విధానాన్ని పకడ్బందీగా అమలు చేసి సత్ఫలితాలు తీసుకురావడానికి సంబంధిత యంత్రాంగం ప్రయత్నిస్తోంది.