సాక్షి, హైదరాబాద్: రైతుల ముసుగులో క్రయవిక్రయాలు జరిపే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మార్కెటింగ్ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ‘నకిలీ రైతుల’ పట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఆయా జిల్లాల కలెక్టర్లు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, అర్హులే లబ్ధిపొందాలని అన్నారు.
కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ యార్డుల్లోనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మార్కెటింగ్ కార్యకలాపాలు, కందులు, శనగలు, వేరుశనగ కొనుగోలు కేంద్రాల అమలుతీరుపై మంత్రి హరీశ్‌రావు గురువారం ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బహిరంగ మార్కెట్‌లో ధరలు తగ్గిన వెంటనే శనగలు, వేరుశనగ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని మంత్రి సూచించారు.
ప్రస్తుతం కందుల కొనుగోలు కోసం ఏర్పాటు చేసిన సొసైటీల కొనుగోలు కేంద్రాలను సమీపంలోని మార్కెట్ కమిటీతో వెంటనే అనుసంధానించాలని సూచించారు. వ్యవసాయ విస్తరణ అధికారులతో ధ్రువీకరణపత్రం పొందిన రైతుల వద్ద నుంచి మాత్రమే కొనుగోళ్లు జరిగే విధంగా చూడాలని ఆదేశించారు. ధ్రువీకరణ పత్రాలపై నిఘా పెట్టి పారదర్శకతతో గుర్తింపు ఇచ్చేవిధంగా వ్యవసాయ విస్తరణ అధికారులకు జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేయాలని అన్నారు.
రైతులకు అవగాహన కల్పించాలి..
వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకురాకముందే నాణ్యతాప్రమాణాలపై రైతులకు అవగాహన కల్పించాలని హరీశ్ సూచించారు. కందుల కొనుగోళ్లపై కొన్నిచోట్ల ఆరోపణలు వచ్చాయని అన్నారు. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్‌లో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయని తెలిపారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
జిల్లాస్థాయిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి మార్కెట్ కమిటీల్లో జరిగే క్రయవిక్రయాలపై నిఘా పెట్టాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. 25 క్వింటాళ్ల కంటే ఎక్కువ పరిమాణంలో పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన వ్యక్తులపై నిఘా పెట్టాలని కోరారు. ఎంత విస్తీర్ణంలో సాగుచేశారో తనిఖీ చేయాలని కోరారు. వ్యవసాయశాఖ స్థానిక ఎగ్జిక్యూటివ్ అధికారుల నుంచి రైతులు ధ్రువీకరణపత్రం పొందాలని కోరారు. కొనుగోలు, చెల్లింపుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని మంత్రి ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాల్లో పంటల సేకరణ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని అన్నారు. రైతులకు మద్ధతుధర కల్పించే విషయంలో పూర్తిస్థాయి చర్యలు తీసుకోవాలని, రైతుల పేరుతో ప్రభుత్వానికి నష్టం కలిగించేవారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. నిజమైన రైతులకు లబ్ధి చేకూర్చాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment