నల్లగొండ, న్యూస్‌లైన్: వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నెలకొల్పిన సాక్షర భారత్ కేంద్రాల నిర్వహణ అగమ్యగోచరంగా తయారైంది. ఎంతో సదాశయంతో కూడిన ఈ కార్యక్రమాన్ని ‘ఆన్‌లైన్’ విధానం ద్వారా నిర్వహించాలని ఇటీవల కేంద్రం మార్గదర్శకాలు జారీ చేయడంతో అసలు సమస్య వచ్చిపడింది. ఆన్‌లైన్ విధానం అమలు చేసేందుకు అవసరమైన కంప్యూటర్లు లేకపోవడం, కోఆర్డినేటర్లకు సాంకేతిక పరిజ్ఞానం కొరవడిన నేపథ్యంలో కంప్యూటీకరణ ప్రక్రియ మూడు అడుగులు ముందుకు, ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. దీంతో సాక్షరభారత్ కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.
వేతనాలు లేక కోఆర్డినేటర్ల వేదన
నిధులు విడుదల చేయకపోవడంతో కోఆర్డినేటర్లకు ఏడాది కాలంగా వేతనాలు అందడం లేదు. దీనికితోడు కేంద్రాలకు పుస్తకాలు, ఇతర అవసరమైన వస్తువులు అందించేవారు కరువయ్యారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇప్పటికే జిల్లాలో సగానికి పైగా కేంద్రాలు మూతపడే దశకు చేరుకున్నాయంటే అతిశయోక్తి కాదు.
జిల్లాలో 59మంది మండల కోఆర్డినేటర్లు, 2,338 మంది గ్రామ కోఆర్డినేటర్లు కొనసాగుతుండగా, మండల కోఆర్డినేటర్లకు నెలకు రూ.6వేలు, గ్రామ కోఆర్డినేటర్లకు రూ.2వేలు, ఎఫ్‌టీఏ రూ.500 చొప్పున గౌరవ వేతనం చెల్లించేందుకు నిర్ణయించారు. అయితే, జిల్లాలో పనిచేస్తున్న మండల కోఆర్డినేటర్లకు దాదాపు 7నెలలుగా, గ్రామ కోఆర్డినేటర్లకు సంవత్సర కాలంగా వేతనాలు అందడం లేదు. మండల, గ్రామ కోఆర్డినేటర్లతో పాటు ఎఫ్‌టీఏల వేతనాల కోసం ఇప్పటివరకు రూ.5కోట్ల 87లక్షల 96వేల500 విడుదల కావాల్సి ఉంది. సాక్షరభారత్ కార్యక్రమానికి నిధుల కేటాయింపు జరిగింది. అయితే ఆన్‌లైన్ విధానం కారణంగా ఆ నిధుల విడుదల ఆలస్యం కావడంతో సిబ్బంది ఇబ్బందులు పడాల్సి వస్తోందని అధికారికవర్గాలు తెలియజేస్తున్నాయి.
కేంద్రాలన్నీ మూతే..
వయోజనులను అక్షరాస్యులుగా తీర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరంతర విద్యా కేంద్రాలు సరైన పర్యవేక్షణ లేక మూతపడ్డాయి. కనగల్ మండలంలోని 22గ్రామపంచాయతీల పరి ధిలో 44 నిరంతర విద్యాకేంద్రాలు ఉం డగా, అందులో వివిధ కారణాలతో బోయినపల్లితో పాటు మరో నాలుగు గ్రామాల్లోని విద్యాకేంద్రాలు పూర్తిగా మూతపడ్డాయి. మిగిలిన కేంద్రాలు కూడా సక్రమంగా నడవడంలేదని స్థానికులు పేర్కొం టున్నారు.
అటకెక్కిన ఆశయం
సాక్షర భారత్ కార్యక్రమం ద్వారా జిల్లాలో 15 ఏళ్లకు పైబడిన నిరక్షరాస్యులు 9.74 లక్షల మంది ఉన్నట్లు యంత్రాంగం గుర్తించింది. వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో 2010 ఆగస్టులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి దశలో 90వేల మందిని, రెండో దశలో 90వేల మందిని, మూడోదశలో 2.50 లక్షల మందిని అక్షరాస్యులుగా మార్చాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా 2,338 లోక్ శిక్షణ కేంద్రాలుండగా, ఒక్కో కేంద్రానికి ఒకరి చొప్పున 2,338 మంది కోఆర్డినేటర్లను నియమించారు.
వీరు ఒక్కొక్కరు పదిమంది వలంటీర్లను నియమించుకుని ఆరు లక్షల మంది నిరక్షరాస్యులను 2017 సంవత్సరం నాటికి అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి. అధికారుల నిర్లక్ష్యం, కోఆర్డినేటర్ల అలసత్వానికి తోడు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు పట్టించుకోకపోవడంతో జిల్లాలోని పలుచోట్ల సాక్షరభారత్ కేంద్రాలు మూతపడ్డాయి. అధికారులు సగానికి పైగా సెంటర్లకు అవసరమైన వస్తువులు సరఫరా చేయలేకపోయారు. దీనికితోడు స్వచ్ఛందంగా బోధించేవారిని ప్రోత్సహించకపోవడంతో తమ పనిలోనే బిజిగా ఉన్నామని, రాత్రిపూట చదువు చెప్పేందుకు వీలుకావడం లేదని వారు విముఖత చూపుతున్నారు.
జీతాలు అందక అల్లాడుతున్నాం
నిరంతర విద్యా కేంద్రాల్లో పని చేస్తున్న సాక్షరభారత్ గ్రామ కోఆర్డినేటర్లకు పదమూడు నెలలుగా జీతాలు అందడం లేదు. వేతనాలు అందక అల్లాడే పరిస్థితులు దాపురించాయి. కడుపునిండా తిండి పెట్టి కష్టం చేయమంటే చేస్తాం కాని తిండి తినకుండా కష్టం చేయాలంటేఎలా. ఇకనైనా అధికారులు గౌరవ వేతనాలు వెంటనే మంజూరు చేయాలి.
- రాయల శ్రవణ్‌కుమార్, గ్రామ కోఆర్డినేటర్
పదిరోజుల్లో వేతనాలు అందుతాయి
సాక్షర భారత్ మండల, గ్రామ కోఆర్డినేటర్లకు పదిరోజుల్లో వేతనాలు అందే అవకాశముంది. పెండింగ్‌లో ఉన్న వేతనాలకు కావాల్సిన బడ్జెట్ కోసం ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు పంపాం. కొన్నిరకాల సాంకేతిక సమస్యలు ఎదురు కావడం వల్లే చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నట్లు సమాచారం.
- చంద్రశేఖర్, డిప్యూటీ డెరైక్టర్, సాక్షరభారత్
‘సాక్షర భారత్’కు తాళం!
Published Sat, Nov 30 2013 3:31 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement