‘ఆన్‌లైన్’..స్వాహాకార్యం! | Online System | Sakshi
Sakshi News home page

‘ఆన్‌లైన్’..స్వాహాకార్యం!

Published Sat, Jul 18 2015 11:56 PM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

Online System

నల్లగొండ టూ టౌన్ : ‘ప్రభుత్వ కార్యాలయాలలో అన్నీ పారదర్శకంగా జరుగుతున్నాయి.. ఆన్‌లైన్ వ్యవస్థ అయిన తరువాత అక్రమాలకు తావులేదు ... ఆన్‌లైన్‌లో అంతా ప్రభుత్వ  నిబంధనల ప్రకారమే ఉంటుంది ... కంప్యూటర్ ఎక్కువ .. తక్కువ తీసుకోదు .. రాష్ట్ర ఉన్నతాధికారులే కంప్యూటర్‌లోఅన్నీ సెట్ చేసి ఇస్తారు.. ఇక్కడ మనం ఏ ఒక్కటీ మార్చలేం’ అని అధికారులు చెప్పే మాటలు నమ్మారో మీరు తప్పులో కాలేసినట్లే. ఆన్‌లైన్ వ్యవస్థను సైతం పక్కదారి పట్టించి కొంతమంది ఉద్యోగులు కోట్ల రూపాయల స్వాహా చేసి నీలగిరి మున్సిపాలిటీని రాష్ట్రంలోనే మార్మోగిస్తున్న చరిత్ర ఈ అక్రమార్కులకు దక్కుతుందని చెప్పొచ్చు. ప్రత్యేకాధికారుల పాలన నుంచి పాలకవర్గం ఏర్పడిన తరువాత కూడా అవినీతికి అలవాటు పడిన అక్రమార్కులు తమ స్వాహా పర్వాన్ని యథేచ్ఛగా కొనసాగించినట్లు విచారణలో ప్రస్ఫుటమవుతోంది. ఆస్తిపన్ను వసూలు చేసి మున్సిపాలిటీలో జమ చేయాల్సింది పోయి తమ జేబులు నింపుకుని చిరుద్యోగులు సైతం కోట్ల రూపాయలకు పడగలెత్తినట్లు సమాచారం. ఈ అక్రమ మార్గాన సంపాదించిన డబ్బుతోనే కొంతమంది ఉద్యోగులు హైదరాబాద్‌లో భవనాలు కొనుగోలు చేయగా, మరి కొంతమంది స్థానికంగానే అంతస్తుల మీద అంతస్తులు నిర్మించినట్లు తెలిసింది.
 
 ఆన్‌లైన్ మాటున మహామాయ ...
 నల్లగొండ మున్సిపాలిటీలో ఆన్‌లైన్ మాటున మహామాయ చేశారు. ప్రతి సంవత్సరం వాణిజ్య భనాలు, అపార్ట్‌మెంట్లు, వివిధ రకాల నివాసాల నుంచి ఆస్తిపన్ను వసూలు చేసి ఆ డబ్బులను మున్సిపాలిటీ అకౌంట్‌లో జమ చేయాలి. నివాసాల ఆస్తిపన్ను, లక్ష రూపాయల లోపు ఉన్న ఆస్తి పన్నును వసూలు చేసి జమ చేశారు. పెద్ద వాణిజ్య భవనాలు, ప్రవేటు విద్యాసంస్థల భవనాలు, వివిధ చిన్న పరిశ్రమలు, బకా యి పడ్డ వారిని ఎంచుకుని భారీ అవినీతికి తెరలేపారు. ప్రతి పనికి తీసుకునే చేతివాటంతో పాటు కోట్లకు పడగలెత్తాలనే ఆశతో ఆన్‌లైన్ మాటున గుట్టు చప్పుడు కాకుండా కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారు. తమ ఆస్తులను పెంచుకున్నారు. ఏ ఒక్క మున్సిపల్ శాఖ ఉన్నతాధికారికి అనుమానం రాకుండా ఆన్‌లైన్ ద్వారానే స్వాహాకార్యానికి తెరలేపారంటే వీరు అవినీతి అక్రమాలలో ఏ స్థాయికి వెళ్లి పోయారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
 
 వెలుగు చూసిన అక్రమాలు ...
 నల్లగొండ పట్టణంలోని కొన్ని వాణిజ్య భవనాల ఆస్తి పన్ను వివరాలు చూస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే. ప్రకాశం బజారులో రోగులకు ‘ఆయుష్’ పోసే ఓ ఆసుపత్రి.. ఆస్తిపన్ను రూ.3 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఇక్కడ వీరు కేవలం రూ.లక్ష  మాత్రమే ఆస్తిపన్ను కింద చెల్లించినట్లు తెలిసింది. మిగతా రూ.2 లక్షల బకాయి చూపకుండా సదరు సిబ్బంది ఆన్‌లైన్‌లో అంతా చెల్లించినట్లు చూపారు. ‘అన్సారీ’ కాలనీలో మరో ఆసుపత్రిది రూ.4.21లక్షల ఆస్తిపన్ను ఉంది. వీరు మూడుసార్లు రూ.50వేల చొప్పున రూ.1.50లక్షలు చెల్లించారు. ఇంకా రూ. 2.70లక్షలు చెల్లించాల్సి ఉన్నా కేవలం రూ.70 వేలు మాత్రమే బకాయి చూపించారు. వివేకానంద నగర్‌లోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాల భవనాలు, హైదరాబాద్ రోడ్డులోని ప్రసాద్ ఉడిపి హోటల్ సమీపంలో ప్రభుత్వ బ్యాంకు ఉన్న భవనం, నెహ్రూగంజ్‌లోని ఓ అయిల్ మిల్లు తదితర భారీ వాణిజ్య భవనాల ఆస్తి పన్నులు వసూల్‌లో కూడా అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలిసింది.
 
 వినియోగదారులు ఎన్ని డబ్బులు చెల్లించినా మొత్తం చెల్లించినట్లు ఆన్‌లైన్‌లో చూపించి అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. సంబంధిత భవనాల వారు ఆస్తిపన్ను తక్కువ చెల్లించిన రశీదు నంబరు మీద ఆన్‌లైన్‌లో అంతా చెల్లించినట్లు చూపెడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ ఘటనలు మున్సిపల్ అధికారుల తనిఖీలో కూడా వెలుగు చూసినట్లు తెలిసింది. ఇలా పెద్ద భవంతులు, బకాయిదారులను చూసి అక్రమాల తంతు యథేచ్ఛగా కొనసాగించినట్లు తెలుస్తుంది. లక్షల రూపాయల పాత బకాయిలు వసూలు అయినట్లు చెప్పినవన్ని ఉత్తవేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
 2010 నుంచే ...
 2010 సంవత్సరం నుంచి ఈ తరహా అవినీతికి తెరలేపినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కొంతమంది ఉద్యోగులు రచించిన వ్యూహంతో సిబ్బంది కోట్లు కొల్లగొట్టినట్లు సమాచారం. పట్టణంలోని భారీగా బకాయిలు ఉన్న విద్యా సంస్థలు, ఇతర చిన్న పరిశ్రమలు, పలు దుకాణాలను ఎంచుకొని ఈ తతంగం నడిపినట్లు తెలుస్తోంది. ఏటా బకాయిలు ఎంతమంది చెల్లించారు.. ఎన్నిసార్లు చెల్లించారు.. ఎప్పటినుంచి బకాయి పడ్డారో అనే వివరాలు పరిశీలన జరపాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2010 నుంచి పెద్ద పెద్ద ( లక్షల రూపాయలు) బకాయిలు చెల్లించిన వారి వివరాలు సేకరించి విచారణ జరిపితే మరో భారీ కుంభకోణం బయటపడే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement