ఎన్ఆర్ఐలకు ఈ-ఎన్పీఎస్
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ) ఇకపై ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్ విధానంలో జాతీయ పింఛను పథకం(ఎన్‌పీఎస్)లో చేరే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉన్న ఎన్‌ఆర్‌ఐలు ఆన్‌లైన్ ద్వారా ఎన్‌పీఎస్ ఖాతా తెరవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటి వరకు ఎన్‌ఆర్‌ఐలు ఎన్‌పీఎస్‌లో చేరేందుకు బ్యాంకు శాఖకు వెళ్లాల్సి వచ్చేది. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆ ఇబ్బంది తొలగిపోయింది. ఎన్‌ఆర్‌ఐలు రిపాట్రియేబుల్, నాన్ రిపాట్రియేబుల్ విధానంలో ఎన్‌పీఎస్ ఖాతా ప్రారంభించవచ్చని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.
రిపాట్రియేబుల్ విధానంలో అయితే ఎన్‌ఆర్‌ఐ తనకు సంబంధించిన ఎన్‌ఆర్‌ఈ/ఎఫ్‌సీఎన్‌ఆర్/ఎన్‌ఆర్‌వో ఖాతా ద్వారా నగదు ఉపసంహరించుకోవచ్చని స్పష్టం చేసింది. అదే నాన్ రిపాట్రియేబుల్ విధానంలో అయితే ఎన్‌ఆర్‌ఈ/ఎఫ్‌సీఎన్‌ఆర్/ఎన్‌ఆర్‌వో ఖాతాల ద్వారా ఎన్‌పీఎస్‌లో చేరవచ్చని తెలిపింది. అయితే ఉపసంహరణ సమయంలో మాత్రం నగదును ఎన్‌ఆర్‌వో ఖాతాలోనే జమచేయనున్నట్టు ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ డ్యాష్ ఎన్‌పీఎస్‌తో ప్రపంచ వ్యాప్తంగా 200కుపైగా దేశాల్లో స్థిరపడిన సుమారు 2.9 కోట్ల మంది ప్రవాస భారతీయులకు ఈ పథకం చేరువ అయ్యేందుకు మార్గం సుగమం అయింది.