ఆర్టీఏలో డిజిటల్ కెమెరాల ఏర్పాటు
♦ ఆన్‌లైన్ వ్యవస్థ మరింత పటిష్టం
♦ ఉన్నతాధికారులతో ప్రిన్సిపల్ సెక్రటరీ సమీక్ష
♦ ‘సాక్షి’ కథనంతో స్పందించిన రవాణాశాఖ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీఏలో ఏజెంట్లు, దళారులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా.. ఆన్‌లై న్ సేవలను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు రవాణాశాఖ సన్నద్ధమైంది. అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో కౌంటర్ల వద్ద డిజిటల్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయనున్నట్లు రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్‌శర్మ తెలిపారు. ‘ఆన్‌లైన్ కాదు.. అదే ‘లైన్’... ఆర్టీఏ దారి అడ్డదారి’ అనే శీర్షికన ‘సాక్షి’ వెలువరించిన కథనంపై రవాణాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ శాఖ ఉన్నతాధికారులతో ప్రిన్సిపల్ సెక్రటరీ సమావేశమయ్యారు. దళారుల జోక్యం లేకుం డా పౌర సేవలను పారదర్శకంగా అమలు చేయాలని సూచించారు. దీనికోసం ఆన్‌లైన్ వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. మరోవైపు ఇదే అంశంపై ఆయన ‘సాక్షి’తోనూ మాట్లాడారు. వినియోగదారులు దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించవద్దని కోరారు. ఏజెంట్ల జోక్యంపై రవాణా కమిషనర్‌కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
అంతటా అప్రమత్తం: ఇలా ఉండగా ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం నేపథ్యంలో అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. ఖైరతాబాద్, సికింద్రాబాద్, మలక్‌పేట్, నాగోల్, ఉప్పల్, తదితర చోట్ల వాహనదారులే నేరుగా వెళ్లి పనులు చేసుకోగలిగారు. ఉప్పల్ ప్రాంతీయ రవాణా అధికారి వెంకటేశ్వర్లు ప్రధాన గేటు వద్దనే కూర్చొని తనిఖీలు నిర్వహించారు. కూకట్‌పల్లి, ఇబ్రహీంపట్నం వంటి శివారు ఆర్టీఏ కార్యాలయాల్లో మాత్రం శనివారం కూడా దళారుల కార్యకలాపాలు జోరుగా కొనసాగాయి.