TS: ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం.. యాక్షన్‌ ప్లాన్‌ ఇదే.. | TSCHE Key Decision Degree Course Action Plan Here Full Details | Sakshi
Sakshi News home page

TS: ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం.. యాక్షన్‌ ప్లాన్‌ ఇదే..

Published Wed, Oct 5 2022 11:57 AM | Last Updated on Wed, Oct 5 2022 3:18 PM

TSCHE Key Decision Degree Course Action Plan Here Full Details - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డిగ్రీ కోర్సుల్లో గుణాత్మక మార్పులకు ఉన్నత విద్యామండలి శ్రీకారం చుడుతోంది. వచ్చే ఏడాది నుంచి డిమాండ్‌ మేరకే కోర్సులు, సీట్లను అనుమతించాలని నిర్ణయించింది. విద్యార్థుల డిమాండ్‌ను బట్టి బ్రాంచ్‌లను మార్చుకునేందుకు అవకాశం ఇవ్వనుంది. జీరో అడ్మిషన్లున్న కోర్సులు, కాలేజీలను రద్దు చేసే ప్రతిపాదనను కఠినంగా అమలు చేసే యోచనలో ఉంది.
చదవండి: టీఆర్‌ఎస్‌ టు బీఆర్‌ఎస్‌ 'మరో ప్రస్థానం'

ఈ మేరకు రూపొందించిన యాక్షన్‌ ప్లాన్‌కు మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి, ఉన్నత విద్య కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ ఇప్పటికే సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఈ ఏడాది నుంచే సంస్కరణలకు ఉన్నత విద్యామండలి తెర తీసింది. ప్రవేశాలు, డిమాండ్‌ లేని కాలేజీల్లో దాదాపు లక్ష సీట్లను ఫ్రీజ్‌ చేసింది. కాలేజీల అభ్యర్థన మేరకు ఈ ఏడాది తిరిగి అనుమతించినా, వచ్చే సంవత్సరం కచ్చితంగా అమలు చేయాలని భావిస్తున్నారు.

కోర్సుల హేతుబద్దీకరణ 
రాష్ట్రంలో 4.60 లక్షల డిగ్రీ సీట్లున్నాయి. కానీ, ఏటా 2 నుంచి 2.5 లక్షల సీట్లే భర్తీ అవుతున్నాయి. కొన్ని కాలేజీల్లో జీరో ప్రవేశాలుంటే, మరికొన్నింటిలో 15 శాతంలోపే ఉంటున్నాయి. ఇలాంటి కాలేజీల్లోని విద్యార్థులు ఇతర కాలేజీల్లోకి వెళ్లేందుకు ఉన్నత విద్యామండలి అనుమతివ్వాలని నిర్ణయించింది. విద్యార్థుల సంఖ్యకు మించి సీట్లున్న కాలేజీల మూడేళ్ల డేటాను తెప్పించి, వీటిని హేతుబద్దీకరించాలని భావిస్తోంది. ఉదాహరణకు ఒక కాలేజీలో 240 సీట్లు ఉంటే, 110 మందే విద్యార్థులు చేరినప్పుడు 180 సీట్లకే అనుబంధ గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రతీ సెక్షన్‌కు 60 మంది విద్యార్థుల చొప్పున మూడు సెక్షన్లకు అనుమతించి, ఒక సెక్షన్‌ను ఎత్తివేస్తారు. మూడేళ్లలో 60 సీట్లు కూడా నిండని కాలేజీల్లో 120 సీట్లు ఉంటే, వాటిని 60 సీట్లకే పరిమితం చేస్తారు.

కోర్సుల మార్పిడి ఇలా.. 
దోస్త్‌ ప్రవేశాల డేటాను ప్రామాణికంగా తీసుకుని కోర్సుల మారి్పడి చేపట్టాలని నిర్ణయించారు. మూడేళ్లలో ఒక కాలేజీకి విద్యార్థులు ఏ కోర్సుకు ఎక్కువగా దరఖాస్తు చేస్తున్నారో చూస్తారు. అతి తక్కువ దరఖాస్తులు వచ్చిన కోర్సుల్లోని సీట్లను తగ్గించుకుని, ఎక్కువ మంది దరఖాస్తు చేసే కోర్సుల్లో సీట్లు, సెక్షన్లు పెంచుకునే వెసులుబాటు కల్పించాలని భావించారు. గత కొన్నేళ్లుగా విద్యార్థులు బీఏ కోర్సుల్లో 20 వేలకు మించి దరఖాస్తు చేయడం లేదు. బీఎస్సీ డేటా సైన్స్, కంప్యూటర్‌ అనుబంధ కోర్సులకు ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయి. ఈ లెక్కన కొన్ని సంప్రదాయ కోర్సులు గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది.

మార్పులు అవసరం
ఏటా ఇంటర్‌ ఉత్తీర్ణులు 3.60 లక్షలుంటే, డిగ్రీ సీట్లు 4.60 లక్షల వరకూ ఉంటున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని డిమాండ్‌–నిష్పత్తి విధానం అమలు దిశగా అడుగులేస్తున్నాం. కోర్సులు, కాలేజీల హేతుబద్ధీకరణ చేపట్టాలని భావిస్తున్నాం. విద్యార్థులు ఇష్టపడే, ఉపాధి అవకాశాలు ఉండే కోర్సుల్లో సీట్లు పెంచడమే ఈ సంస్కరణల ఉద్దేశం. 
–ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ 

నష్టం లేకుండా చూడాలి
ఇంజనీరింగ్‌ ప్రవేశాల తర్వాతే విద్యార్థులు డిగ్రీలో చేరడంపై నిర్ణయం తీసుకుంటారు. అందుకే ఈ ఏడాది దోస్త్‌ ప్రవేశాలు మందకొడిగా ఉన్నాయి. లక్ష సీట్లు ఫ్రీజ్‌ చేయడం సరికాదని అధికారులకు చెప్పాం. వాళ్లు ఒప్పుకున్నారు. ఏ సంవత్సరమైనా ఒక్కో కోర్సులో ప్రవేశాలు ఒక్కో రకంగా ఉంటాయి. పెరగడం, తగ్గడం సహజం. వీటిని దృష్టలో పెట్టుకుని కాలేజీలకు నష్టం జరగకుండా సంస్కరణలు చేపట్టాలి.  
– ఎకల్దేవి పరమేశ్వర్, ప్రైవేటు డిగ్రీ కాలేజీల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement