
బాబు పోరాడరు.. జగన్‌ను పోరాడనివ్వరు
వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు తమను ఎప్పుడూ అడగలేదని, టీడీపీ చిల్లర రాజకీయాలు మానుకోవాలంటూ బీజేపీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్‌చార్జి సిద్ధార్థనాథ్‌సింగ్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి తెలుగు ప్రజలకు సమాధానం చెప్పాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఏపీ ప్రయోజనాల విషయంలో సీఎం స్థానంలో ఉండి చంద్రబాబు పోరాటం చేయరు, పోరాడే ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డిని పోరాడనివ్వరు అని ధ్వజమెత్తారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘సిద్ధార్థనాథ్‌సింగ్ అలా మాట్లాడాక కూడా చంద్రబాబు, టీడీపీ ఏ విధంగా బీజేపీ ప్రభుత్వంలో కొనసాగుతుంది? కేంద్రం ఇప్పటి వరకు రూ.1.43 లక్షల కోట్లు రాష్ట్రానికి ఆర్థికసాయం చేసిందని బీజేపీ నేత చెప్పారు. అంత మొత్తం ఆర్థిక సహాయం చేస్తే ఆ డబ్బంతా ఏమైంది. ఏ రూపేణా ఎంతెంత ఇచ్చారో చెప్పాల్సిన బాధ్యత కేంద్రంపైనా, ఏ విధంగా ఖర్చు చేసిందీ చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపైనా ఉంది’ అని అంబటి వ్యాఖ్యానించారు.
వెన్నుపోటు ప్రయత్నాలు..
ప్రత్యేకహోదా కోసం జగన్‌మోహన్‌రెడ్డి గతంలో గుంటూరులో నిరాహార దీక్ష చేస్తే అది దొంగ దీక్షలని విమర్శలు చేయడంతోపాటు ఆ దీక్షకు అనుమతి ఇవ్వకుండా ప్రయత్నం చేసిందీ చంద్రబాబు, ఈ ప్రభుత్వమేనన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఛీ అన్న బీజేపీ ప్రత్యేక హోదా కోసం తమతో కలిసి పోరాడానికి సిద్ధమై రమ్మని అడుగుతున్నామని చెప్పారు. మేమే నిరహార దీక్షలు చేసి కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నాలు చేస్తే మమ్మల్ని అణచడానికీ, మాకు వెన్నుపోటు పొడుద్దామని ప్రయత్నం చేసి ఏం సాధిద్దామని అనుకుంటున్నావ్. నువ్వు సాధించలేవు, వీరత్వంతో పోరాడుతున్న జగన్‌మోహన్‌రెడ్డిని దొంగదెబ్బ తీయడం ధర్మమేనా? అని ప్రశ్నించారు.
కర్నూలు దీక్షపైనా విమర్శలేనా?
రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగేలా తెలంగాణ ప్రభుత్వం అనుమతులు లేకుండానే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టానికి వ్యతిరేకంగా జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలు వేదికగా నిరహార దీక్ష చేపట్టడంపై టీడీపీ నేతలు అవాకులు చవాకులు మాట్లాడడంపై అంబటి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కృష్ణా, గోదావరి నదులపై ఎగువ రాష్ట్రాలైనా మనమైనా కొత్త ప్రాజెక్టులు చేపట్టాలంటే ఆయా బోర్డుల అనుమతి తీసుకున్నాకే కట్టాలని విభజన బిల్లులో స్పష్టంగా ఉందని.. ఏ అనుమతులు లేకున్నా పక్క రాష్ట్రం కడుతుంటే చంద్రబాబు దాన్ని తప్పుపట్టలేకపోయారన్నారు.
పోరాడితే పోతాయి కదా?
‘పొరుగు రాష్ట్రాల అక్రమ ప్రాజెక్టులపై జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్దితో పోరాడుతుంటే కావాల్సిన కాంట్రాక్టులు ఇప్పించుకున్నారని కొత్తగా మాట్లాడుతున్నారు. ప్రాజెక్టులు పోతే కాంట్రాక్టు పోతాయి కదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యం గురించి బహిరంగ చర్చకు తమ పార్టీ సిద్ధంగా ఉందని టీడీపీకి సవాల్ విసిరారు.