అంబటి రాంబాబు
సాక్షి, విజయవాడ: గత నాలుగేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయాలనే పవన్ కల్యాణ్ చెప్పారని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. జనసేన ఆవిర్భావసభలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు ఏపీ మంత్రి నారా లోకేష్‌పై పవన్ చేసిన అవినీతి విమర్శలకు వాళ్లు సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రాన్ని అవినీతి ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని, దివంగత సీఎం ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందని పవన్ అన్న విషయాన్ని అంబటి గుర్తు చేశారు. గురువారం ఇక్కడ మీడియాతో అంబటి రాంబాబు మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు పవన్ నిజాలు తెలుసుకుని వ్యవహరించడం ఉత్తమమన్నారు.
ఇసుక మాఫియా, ఎమ్మార్వో వనజాక్షిపై దాడి, ఏపీ ప్రభుత్వ అవినీతి గురించి ఇన్నాళ్లు పవన్ ఎందుకు లెవనెత్తలేదని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ మౌనం.. ఏపీకి చాలా నష్టం చేసిందని, కానీ అన్ని విషయాలు తెలిసినా ఆయన ఇన్నాళ్లు చంద్రబాబుకు మద్దతివ్వడాన్ని తప్పుపట్టారు. ఫిబ్రవరి 13న వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాహసోపేత నిర్ణయాన్ని ప్రకటించగానే ఏపీలో రాజకీయ పరిణామాలు ఆశ్చర్యకరంగా మారిపోతున్నాయని చెప్పారు. ఏప్రిల్ 6న వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామా చేస్తారని వైఎస్ జగన్ ప్రకటన చేయగానే సీఎం చంద్రబాబు తన మంత్రులను కేంద్రం నుంచి ఉపసంహరించుకున్నారని తెలిపారు.
కానిస్టేబుల్ కొడుకు కాదు.. మెగాస్టార్ తమ్ముడు!
'చంద్రబాబు, నారా లోకేష్ అవినీతికి పాల్పడ్డారని పవన్ బహిరంగంగానే ఆరోపించారు. దీనిపై చంద్రబాబు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఏపీని చంద్రబాబు అవినీతి ఆంధ్రప్రదేశ్‌గా మార్చడంతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందని పవన్ వ్యాఖ్యానించారు. కానిస్టేబుల్ కుమారుడిని మాత్రమే అని పవన్ ఆ సభలో పదే పదే చెప్పారు. ఆయన మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు, ప్రముఖ హీరో కావడంతోనే ఆ ఆదరణ వస్తుందన్నారు. సామాన్యుడిని, కానిస్టేబుల్ కొడుకునంటూ పవన్ ఆ ఆదరణను రాజకీయంగా వాడుకోవాలని చూడటం సబబు కాదు. పవన్ వల్ల ఏపీలో రాక్షస పాలన అంతం కావాలే తప్ప.. ఎట్టి పరిస్థితుల్లోనూ అనినీతికి పాల్పడుతున్న టీడీపీకి మేలు జరగకూడదు. ప్రస్తుత పరిణామాలు ఏపీకి హోదా వచ్చేందుకు ఉపయోగపడాలి. అందుకోసం వైఎస్ఆర్‌సీపీ ఎంతదాకైనా పోరాడేందుకు సిద్ధంగా ఉందని' అంబటి స్పష్టం చేశారు.
పవన్ ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకో!
మాకు సీబీఐ అంటే భయమా.. మేం పోరాటాలు చేయడం లేదా! కేంద్రంపై అవిశ్వాస తీర్మానం, రాజీనామాలు ఇలా అన్ని విషయాల్లోనూ ముందడుగు వేసింది వైఎస్ఆర్‌సీపీ కాదా అని పవన్‌ను ప్రశ్నించారు. భయముంటే ఇవన్నీ ఎందుకు చేస్తామన్నారు. ఓదార్పు యాత్ర చేయొద్దని బెదిరించినా వినకపోవడంతో సోనియా గాంధీ మాపై కక్ష కట్టిన విషయం పవన్‌కు కొత్తగా చెప్పాలా అన్నారు. రాజకీయ కక్షతోనే వైఎస్ జగన్‌పై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని తెలిపారు. మూడేళ్లు అసెంబ్లీలో పోరాడి విరక్తి చెందిన తర్వాత సమావేశాలను ప్రతిపక్షం బహిష్కరించిందన్నారు. కాగా, చంద్రబాబు మాత్రం 23 మంది వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొని.. అందులో నలుగురికి ఏపీ కేబినెట్‌లో మంత్రి పదవులు ఇచ్చిన విషయం పవన్ గుర్తుంచుకోవాలన్నారు. అలాంటిది వైఎస్ఆర్‌సీపీ నేతలు అసెంబ్లీని బహిష్కరించడం తప్పెలా అవుతుందన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని వ్యవహరించడం ఉత్తమమని పవన్‌కు అంబటి రాంబాబు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment