మార్చి 21న అవిశ్వాసం | Ambati Rambabu suggestion to Pawan | Sakshi
Sakshi News home page

మార్చి 21న అవిశ్వాసం

Published Wed, Feb 21 2018 1:17 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

Ambati Rambabu suggestion to Pawan - Sakshi

సాక్షి, అమరావతి: ఐదుకోట్ల మంది ఆంధ్రులకు సంజీవని వంటి ప్రత్యేక హోదా కోరుతూ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ముహూర్తం ఖరారయ్యింది. మార్చి 21న అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. 184 నిబంధన కింద ఆపార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లోక్‌సభ స్పీకర్‌కు నోటీసు ఇచ్చారు. ‘ప్యాకేజీతో మోసం చేయొద్దు.. ప్రత్యేక హోదా మన హక్కు’ అన్న నినాదంతో వైఎస్సార్సీపీ హోదా ఉద్యమాన్ని ఉధృతం చేసిన సంగతి తెల్సిందే. మార్చి నెలలో ఏపీలోనూ, ఢిల్లీలోనూ, పార్లమెంటులోనూ పోరాట కార్యాచరణను ప్రకటించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏప్రిల్‌ 6న తమ ఎంపీలు రాజీనామా చేస్తారని కూడా స్పష్టంచేసింది. ప్రత్యేక హోదా కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని ప్రకటించిన వైఎస్సార్సీపీ మార్చి 21న కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నట్లు ప్రకటించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మంగళవారం నాడు విజయవాడ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. హోదా కోసం  ఎంపీ పదవులకు రాజీనామా చేయాలని ఇప్పటికే వైఎస్సార్‌సీపీ నిర్ణయించిందన్నారు. 

చాలెంజ్‌ చేయలేదు.. సలహా స్వీకరించాం..
‘మా పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎక్కడా చాలెంజ్‌ చేయలేదు. అవసరమైతే ఒకసారి యూట్యూబ్‌ రివైండ్‌ చేసి చూసుకోండి. అవిశ్వాస తీర్మానం పెట్టాలని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. అందుకు జగన్‌ మోహన్‌రెడ్డి స్పందిస్తూ సలహాను స్వీకరిస్తున్నాం...అవిశ్వాసానికి మీ పార్ట్‌నర్‌ ను ఒప్పించండని మాత్రమే పవన్‌ కల్యాణ్‌ను కోరారు’ అని అంబటి వివరించారు. మా అధ్యక్షుడు జగన్‌ ఎక్కడా సవాల్‌ చేయకపోయినా, సవాల్‌ను స్వీకరిస్తున్నా నంటూ పవన్‌ కల్యాణ్‌ చెప్పడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.  పవన్‌ చిన్న పిల్లాడిలా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని వైఎస్సార్‌సీపీ మొదట్నుంచి చెబుతూ ఎన్నో ఉద్యమాలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు.

పోరాటక్రమాన్ని మేము ముందుగా ప్రకటించాం. ఇందులో భాగంగానే మార్చి 1న కలెక్టరేట్ల వద్ద ఆందోళన  చేపట్టిన అనంతరం 5వ తేదీ నుంచి వివిధ పద్ధతుల్లో ఉద్యమం చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు తన పార్ట్‌నర్‌ కాదంటూనే పవన్‌ ప్రతిపక్షాన్ని ప్రశ్నించటం ఏమిటి అని అంబటి ధ్వజమెత్తారు. కేంద్రంపై ఒత్తిడి పెంచకుండా చంద్రబాబు మోసం చేస్తున్నా ఆయన్ను పవన్‌ ఎందుకు ప్రశ్నించడం లేదు అనే అనుమానం ప్రజల్లో వ్యక్తం అవుతోందన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన సందర్భంగా పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని మండిపడిన మీరు, ఆ పాచి పోయిన లడ్డూలు తీసుకొన్న చంద్రబాబు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పినా ఇంతవరకు ఆయన్ను ప్రశ్నించకపోవటానికి గల కారణం ఏమిటో చెప్పాలని పవన్‌ను అంబటి డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదాపై పోరాటం చేసింది ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ అన్నది వాస్తవమా? కాదా అన్నది మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలని పవన్‌కు అంబటి రాంబాబు సూచించారు.  

చంద్రబాబును ఎందుకు ప్రశ్నించరు?
‘అవిశ్వాసం తలా...తోక లేని ఆలోచన అని,  అవిశ్వాసం అక్కర్లేదని వ్యాఖ్యలు చేసిన చంద్రబాబును ఎందుకు నిలదీయరు’ అని పవన్‌ కల్యాణ్‌ను అంబటి రాంబాబు ప్రశ్నించారు. ‘హోదా ఇవ్వాలని ఒత్తిడి తెస్తూ.. కేంద్ర మంత్రివర్గం నుంచి ఎందుకు తప్పుకోవటం లేదు అని చంద్రబాబును పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించలేక పోతున్నా రన్నారు. దీన్ని బట్టి చూస్తే పవన్‌ కల్యాణ్‌ ఎవర్నో మోస్తూ వారికి లబ్ధి చేకూర్చుతున్నారన్న భావన ప్రజల్లో కలుగుతోందని అంబటి పేర్కొన్నారు. 

టీడీపీని కాదని ఇతర రాష్ట్రాలకు ఎంపీల మద్దతు కోసం వెళ్లడం ఏమిటి?
ఎన్నికల్లో మద్దతు ఇచ్చి మీరు అధికారంలోకి తీసుకువచ్చిన పార్టీకి 20 మంది ఎంపీలు ఉంటే.. వాళ్లను కాదని అవిశ్వాస తీర్మానం మద్దతు కోసం ఢిల్లీ వెళ్లి కేజ్రీవాల్‌ ఆ తర్వాత తమిళనాడు, ఒరిస్సా తదితర రాష్ట్రాలకు వెళ్లి ఆయా రాజకీయ పార్టీలను ఒప్పిస్తానటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ‘మీరు గెలిపించిన రాజకీయ పార్టీకి చెందిన మిత్రుడ్నే ఒప్పించ లేనప్పుడు  పొరుగు రాష్ట్రాల ఎంపీలను ఎలా ఒప్పిస్తారు’ అని పవన్‌ను అంబటి ప్రశ్నించారు. ఇది ఎలా ఉందంటే.. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతాను అందట .. అలా ఉంది మీ పరిస్థితి అని పవన్‌ కల్యాణ్‌ను ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాను ముంచిన చంద్రబాబు ప్రశ్నించలేనంత కాలం పవన్‌పై అనుమాన పడాల్సి ఉంటుందన్నారు. 


వైవీ సుబ్బారెడ్డి 184 కింద నోటీసు ఇచ్చారు
‘మా పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి 184 నిబంధన కింద నోటీసు ఇచ్చారు. ఈ సందర్భంగా పార్లమెంటులో ప్రత్యేక హోదాపై  చర్చ జరుగుతుంది. ఆ తర్వాత ఓటింగ్‌ ఉంటుంది. ఇందులో టీడీపీ ఎంపీలు పాల్గొనేలా చూడండి’ అని పవన్‌ కల్యాణ్‌కు అంబటి సూచించారు. ‘నీతి, నిజాయితీలకు సిద్ధపడి రాజకీయాల్లోకి వచ్చామని చెబుతున్న మీరు ప్రతిపక్ష పార్టీకి చెందిన శాసనసభ్యుల్ని కొనుగోలు చేయటం తప్పు అని చంద్రబాబుకు ఎందుకు చెప్పలేక పోతున్నారు’ అని పవన్‌ను ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు దొరికిపోతే.. ఇలాంటివి చేయటం తప్పు అని ఒక్కమాట అన్నారా అని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.

ఎవరు మద్దతు ఇవ్వకపోయినా ‘హోదా’పై మా పోరాటం ఆగదు
‘పవన్‌ కల్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు మద్దతు ఇవ్వకపోయినా ప్రత్యేక హోదాపై మా పోరాటం ఆగదు’ అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని చంద్రబాబు ముంచేశారని బీజేపీ నాయకులు బహిరంగంగా పేర్కొంటున్నా కేంద్ర మంత్రివర్గం నుంచి బయటకు వచ్చి పోరాటం చేయకుండా ఎంత కాలం కొనసాగుతారు? అని చంద్రబాబును అంబటి ప్రశ్నించారు. అవిశ్వాసం చివరి అస్త్రం అని చెబుతున్న చంద్రబాబు ఆ అస్త్రాన్ని ఎప్పుడు ప్రయోగిస్తారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement