సాక్షి, విజయవాడ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరుపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం విషయంలో పవన్ కల్యాణ్ చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తున్నారని, అవిశ్వాస తీర్మానం పెట్టాలని మొదట సవాలు చేసింది పవన్ కల్యాణ్ అని, ఆయన సలహాను స్వీకరించి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అవిశ్వాసం తీర్మానం పెట్టేందుకు ముందుకొచ్చారని స్పష్టం చేశారు. తన పార్ట్‌నర్ చంద్రబాబును ప్రశ్నించకుండా.. ప్రత్యేక హోదా కోసం మొదటినుంచీ పోరాడుతున్న వైఎస్ జగన్‌పై వ్యాఖ్యలు చేయడం ఏమిటని పవన్ తీరుపై మండిపడ్డారు. హోదా కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో పోరాటాలు చేసిందని గుర్తు చేశారు.
అవిశ్వాస తీర్మానం ఐదో తారీఖున పెట్టండి.. ఆరో తారీఖున పెట్టండంటూ పవన్ చైల్డిష్‌గా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయన వ్యాఖ్యలతో సంబంధం లేకుండా తమ పోరాటవ్యూహంలో భాగంగా ముందుకెళుతామని స్పష్టం చేశారు. మార్చి 5వ తేదీ నుంచి తమ పార్టీ ఎంపీలు పార్లమెంటులో ఆందోళనలు కొనసాగిస్తారని, మార్చి 21న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టి తీరుతుందని, కేంద్రంపై తప్పకుండా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని తేల్చిచెప్పారు.
హోదా కోసం మొదటినుంచీ..
‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని వైఎస్ జగన్ మొదటినుంచి నినదిస్తున్నారు. హోదాపై పోరాటంలో భాగంగా మార్చి 1న కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు నిర్వహిస్తాం. మార్చి 5 నుంచి పార్లమెంటులో ఉద్యమం చేయాలని నిర్ణయించాం. అప్పటికీ దిగిరాకుంటే ఎంపీలు రాజీనామా చేస్తారని వైఎస్ జగన్ ఇప్పటికే ప్రకటించారు. అవిశ్వాస తీర్మానం పెట్టాలని పవన్ చెప్పారు.. మేం దానికి కట్టుబడి ఆయన సలహాను స్వీకరించాం. అవిశ్వాసం విషయంలో పవన్ భాషాప్రయోగం తప్పు.. వైఎస్ జగన్ ఇందుకోసం సవాల్ చేయలేదు. మీ సలహాను స్వీకరిస్తున్నామని మాత్రమే వైఎస్ జగన్ చెప్పారు. మీ పార్ట్‌నర్ టీడీపీని ఒప్పించాలని పవన్‌కు చెప్పాం. కానీ పవన్ కల్యాణ్‌చిన్నపిల్లాడిలా వ్యవహరిస్తున్నారు. అవిశ్వాసం ఎప్పుడు పెట్టాలనేది మీరు చెప్పేది కాదు. ఇప్పటికే మేం షెడ్యూల్ ఖరారు చేసుకున్నాం, షెడ్యూల్ ప్రకారం ముందుకెళ్తాం’ అని అంబటి స్పష్టం చేశారు.
మమ్మల్ని నమ్మరా.. బాబునే నమ్ముతారా?
‘అవిశ్వాసం తలా, తోక లేనిదని, దాని వల్ల ప్రయోజనం ఉండదని చంద్రబాబు అంటున్నారు. అవిశ్వాసం తప్పు అని చంద్రబాబు చెప్తున్నా మీరెందుకు స్పందించడం లేదు. ఎందుకు ఆయనను పల్లెత్తుమాట అనడం లేదు. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన వెంటనే చర్చకు వస్తుంది. అలా చర్చకు రావాలంటే 50మంది ఎంపీల మద్దతు కావాలి. లేకపోతే.. అవిశ్వాసాన్ని తీసి పక్కన పెడతారు. కాబట్టి అవిశ్వాసానికి ముందే 50మంది ఎంపీల మద్దతు కూడగట్టాలి’ అని అంబటి అన్నారు.
వివరణ ఇవ్వాల్సిన బాధ్యత పవన్‌దే
‘పవన్ మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కానీ.. చంద్రబాబును ప్రశ్నించడం లేదు. మా మీద ఆయనకు హక్కు లేదు. కానీ చంద్రబాబుపై ఉంది. బాబుకు ఓట్లు వేయమని చెప్పింది పవనే అన్న భావన ప్రజల్లో ఉంది. కేంద్రం హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినప్పుడు అది పుచ్చిపోయిన, పాచిపోయిన లడ్డూలని మీరు బీజేపీ తప్పుబట్టారు కానీ, చంద్రబాబుకు ఒక్క మాట అనలేదు. పాచిపోయిన లడ్డూలు అద్భుతంగా ఉన్నాయన్న చంద్రబాబును ప్రశ్నించలేదు’ అని పవన్ తీరును అంబటి తప్పుబట్టారు. చంద్రబాబుపై పవన్ ఎందుకు కామెంట్ చేయడం లేదని ప్రశ్నించారు. ఎక్కడో ఏదో జరుగుతుందన్న భావన ప్రజల్లో ఉందని, దీనిపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత పవన్‌పై ఉందని స్పష్టం చేశారు. అవిశ్వాస తీర్మానం పెట్టేముందు కేంద్ర కేబినెట్ నుంచి టీడీపీ తప్పుకోవాలంటూ చంద్రబాబును ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. పవన్ తప్పుదోవలో వెళుతున్నారని, ఆయన ఎవరికో మేలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఆయన నిష్పక్షపాతంపై అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు.
‘మీరు అధికారంలోకి తీసుకొచ్చిన పార్టీకి 20మంది ఎంపీలు ఉన్నా.. వారిని ఒప్పించకుండా.. పక్కనున్న తమిళనాడు, కర్ణాటకను ఒప్పిస్తారా’ అని పవన్‌ను ప్రశ్నించారు. పవన్ మద్దతు ఇచ్చినా.. ఇవ్వకపోయినా మార్చి 21న కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని, వెనుదిరిగే ప్రసక్తే లేదని అంబటి స్పష్టం చేశారు. పవన్ ఓ కమిటీ వేశారని, దానిద్వారా ఆయన ఏం తెలుసుకున్నారని ప్రశ్నించారు. సెక్షన్ 184 కింద వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పార్లమెంటులో నోటీసు ఇచ్చారని, దీనిపై కచ్చితంగా చర్చ, ఓటింగ్ జరుగుతుందని, అప్పుడైనా ఓటింగ్‌ళో పాల్గొనాలని మీ పార్ట్‌నర్ చంద్రబాబుకు చెప్పాలని సూచించారు. మా పార్టీకి చెందిన సభ్యులను కొంటుంటే.. పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment