విలేకరులతో మాట్లాడుతున్న అంబటి రాంబాబు
సాక్షి, విజయవాడ: దేశ రాజకీయాల్లో చంద్రబాబు నంబర్‌వన్ ద్రోహి అని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై చంద్రబాబు పిల్లిమొగ్గలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. ద్రోహులను ఎన్నికలలో ఓడించాలని చంద్రబాబు ప్రకటించడం విడ్డూరంగా వుందని, దొంగే.. దొంగా దొంగా అని అరిచినట్లుగా ఆయన వైఖరి ఉందని ఎద్దేవా చేశారు. ఆరు వందల వాగ్దానాలు ఇచ్చి ఒక్కటైనా నిలబెట్టుకున్నారా అని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు వంటి ద్రోహులకు డిపాజిట్లు కూడా రావన్నారు.
కొత్త మిత్రుల కోసం వెంపర్లాట
చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మేకప్ వేసుకుని వేషాలు వేస్తుంటే, ఎటువంటి మేకప్ లేకుండా చంద్రబాబు రోజుకో వేషం వేస్తున్నారని దుయ్యబట్టారు. పాత మిత్రులు దూరం కావడంతో కొత్త మిత్రుల కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారని ఆరోపించారు. తాజాగా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తానని చంద్రబాబు చెబుతున్నారని తెలిపారు.
మొదట మా దగ్గరకే వచ్చారు
బీజేపీ నేత రామ్ మాధవ్‌కు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు వైఖరి ఇప్పుడు అర్ధం అయ్యిందన్నారు. ‘బీజేపీతో కుమ్మక్కయ్యారని వైఎస్సార్‌సీపీపై టీడీపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఫ్రంట్ కడదామని మొదట వైఎస్సార్‌సీపీ వద్దకే బీజేపీ వచ్చింది. మేం నిరాకరించడం వల్లే టీడీపీతో కలిసింద’ని అంబటి రాంబాబు వెల్లడించారు.
ఈరోజైనా చర్చ జరగాలి
అవిశ్వాస తీర్మానంపై ఈరోజైనా పార్లమెంట్‌లో చర్చ జరుగుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. చర్చ జరగనివ్వకుండా బీజేపీ ప్రయత్నిస్తోందని, చర్చ జరిగితే దేశ ప్రజలకు ఏపీకి జరిగిన అన్యాయం తెలుస్తుందన్నారు. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలతో రాజీనామా చేయిస్తామని కనిగిరి సభలో వైఎస్ జగన్ ప్రకటించారని గుర్తుచేశారు. హోదా సాధన కోసమే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment