సాక్షి, గుంటూరు: కాకినాడలో పట్టుకున్న పీడీఎస్ బియ్యం మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడిదే.. మంత్రి నాదెండ్ల మనోహార్ నిజాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టు గురించి అభద్రతా భావంతో మాట్లాడుతున్నారని కామెంట్స్ చేశారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ..‘సీజ్ చేసిన షిప్‌నే మళ్లీ సీజ్ చేయడమేంటి?. కాకినాడ పోర్టు నుంచి పెద్ద ఎత్తున బియ్యం ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి కాకినాడ పోర్టుకు బియ్యం వస్తుంది. కాకినాడ యాంకరేజ్ పోర్టుపై వేల కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి. కాకినాడ పోర్టు నుంచి పీడీఎస్ బియ్యం తరలివెళ్లడం ఈనాటిది కాదు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టు గురించి అభద్రతా భావంతో మాట్లాడుతున్నారు.
అక్రమాలను అడ్డుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. చంద్రబాబు హాయాంలోనే అక్రమాలు జరిగాయి. వైఎస్సార్‌సీపీపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. పవన్, నాదెండ్ల మనోహర్ చేతకాని మాటలు మాట్లాడుతున్నారు. చెక్‌పోస్టులు ఉండగా.. పీడీఎస్ బియ్యం ఎలా తరలిపోతుంది?. అధికారం పవన్ కల్యాణ్ చేతిలోనే ఉంది కదా?. వైఎస్ జగన్‌పై బురద జల్లడానికి కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారు. కాకినాడలో పట్టుకున్న పీడీఎస్ బియ్యం మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడిదే. మంత్రి నాదెండ్ల మనోహార్ నిజాలు తెలుసుకుని మాట్లాడాలి. పట్టాభి ఆగ్రో సంస్థ ద్వారా బియ్యం తరలి వెళ్తోంది. జనసేనకు చెందిన వారంతా పౌర సరఫరాల శాఖలోనే ఉన్నారు. జనసేన నేతలు కుమ్మకైపోయి అవినీతికి పాల్పడుతున్నారు’ అని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment