ఉట్నూర్‌రూరల్: నవోదయ నగర్‌లో ఇళ్లలోకి చేరిన నీరు
సాక్షి, ఆదిలాబాద్: భారీ వర్షాలతో అతలాకుతలమైన జిల్లాలో వాన విరామం లేకుండా కురుస్తూనే ఉంది. తేరుకునేందుకు కూడా సమయం ఇవ్వకుండా వర్షం పడుతూనే ఉంది. దీంతో సహాయక, రక్షణ చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఆదివారం రాత్రి నుంచి మళ్లీ ఎడతెరిపి లేకుండా ముసురు కొనసాగుతోంది. జిల్లా అంతటా ఇదే పరిస్థితి ఉంది. ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మరోవైపు జిల్లాలో వ్యాధులు ప్రబలుతున్నాయి. డయేరియాతో ఒకరు, జ్వరంతో మరొకరు మృత్యువాతపడ్డారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న నిరాశ్రయులకు ఆపన్నహస్తం, సహాయం అందజేస్తున్నారు. 29.8 మిల్లీమీటర్ల వర్షం..జిల్లాలోని అన్ని మండలాల్లో ఆదివారం సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం నమోదైంది.
జిల్లా వ్యాప్తంగా సగటున 29.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉట్నూర్‌లో 60 మిల్లీమీటర్లు, ఇంద్రవెల్లిలో 57.2, గుడిహత్నూర్ 45.6, సిరికొండలో 35.8, బేలలో 33.8, ఆదిలాబాద్‌రూరల్ 33.5, నార్నూర్‌లో 30.2, జైనథ్‌లో 29.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉట్నూర్‌లో భారీ వర్షం కురువడంతో లక్కారం చెరువు పొంగి ప్రవహిస్తోంది. దీంతో సమీపంలోని గ్రామంలోకి వరదనీరు చుట్టుముట్టింది. ఉట్నూర్ మండలకేంద్రంలోని శాంతినగర్‌లో భారీ వర్షంతో ఇళ్లలోకి నీరు చేరింది. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డిలు ఈ గ్రామాలను సందర్శించారు. వరద ముంపు బాధితులకు ఉట్నూర్ బీసీ హాస్టల్‌లో పునరావాసం కల్పించారు. ఇంద్రవెల్లి మండలం జైత్రంతాండ, మామిడిగూడ, జెండాగూడాల్లో వాగులు ఉప్పొంగడంతో గ్రామాలను వరదనీరు ముంచెత్తింది.
బేల మండలం దహెగాం బ్రిడ్జికి గుంత పడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు ఏడు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగాయి. గణేష్‌పూర్ బ్రిడ్జిపై గుంత పడడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆదిలాబాద్ మండలంలోని బంగారుగూడ వాగు ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. తలమడుగు మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో కృష్ణవేణి(4) డయేరియాతో మృతిచెందింది. ఇంద్రవెల్లి మండలంలోని బుద్ధనగర్‌కు చెందిన సోన్‌కాంబ్లే సక్కుబాయి(65) జ్వరంతో చనిపోయింది. భారీ వర్షాలకు ఈమె ఇంట్లోకి వరదనీరు చేరడంతో బాధితురాలు అస్వస్థతకు గురై మృత్యువాతపడింది. ఈ రెండు సంఘటనలు జిల్లాలో వరద ముప్పు కారణంగా ప్రబలే వ్యాధులకు సంకేతంగా నిలుస్తున్నాయి.
కొనసాగుతున్న పునరావాస కేంద్రాలు..
ఆదిలాబాద్, బేల, గుడిహత్నూర్, ఇచ్చోడ, బజార్‌హత్నూర్, సిరికొండ, ఇంద్రవెల్లిలలో పునరావాస కేంద్రాలు కొనసాగుతున్నాయి. వేలాది మంది వరద బాధితులు తలదాచుకుంటున్నారు. బాధితుల సహాయార్థం పలువురు ఆపన్నహస్తం అందిస్తున్నారు. కలెక్టర్ పిలుపు మేరకు పలు జిల్లాల నుంచి వివిధ నిత్యావసర సామగ్రితోపాటు బాధితులకు నగదు అందజేస్తున్నారు. పోలీసు శాఖ నుంచి రూ.4లక్షల విరాళం అందజేశారు. త్వరలో కలెక్టర్‌కు ఈ నగదును అందజేయనున్నట్లు ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ తెలిపారు. పలువురు స్వచ్ఛంద సంఘాలు వరదబాధితుల సహాయార్థం చర్యలు తీసుకుంటున్నారు.
ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటి విడుదల..
వర్షాలతో జైనథ్ మండలం సాత్నాల ప్రాజెక్టు మళ్లీ క్రమంగా నిండుతోంది. ఇటీవల భారీ వర్షాలతో ఈ ప్రాజెక్టు నిండినప్పటికీ గేట్లను సరైన సమయంలో మూయకపోవడంతో ప్రాజెక్టులోని నీరంతా దిగువకు వెళ్లిపోయింది. కాగా రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో మళ్లీ ప్రాజెక్టులో జలకళ సంతరించుకుంది. సాత్నాల ప్రాజెక్టు నీటిమట్టం 286.5 మీటర్లు కాగా, ప్రస్తుతం 285 మీటర్లకు చేరుకుంది. నీటి సామర్థ్యం 1.240 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.932 టీఎంసీలకు చేరింది.
సోమవారం ఉదయం ఇన్‌ఫ్లో 13500 క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 21వేల క్యూసెక్కులు ఉంది. సాయంత్రం వరకు ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 4800 క్యూసెక్కులకు చేరింది. మత్తడివాగు 277.5 మీటర్లు నీటిమట్టం కాగా, ప్రస్తుతం 276.5కు చేరుకుంది. నీటి సామర్థ్యం 0.571 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.457కు చేరుకుంది. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 580 ఉంది. కాగా సాత్నాల ప్రాజెక్టును ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం పరిశీలించింది. సోమవారం వేకువజామున భారీ వర్షం నమోదు కావడం, సాత్నాలకు ఇన్‌ఫ్లో అధికంగా ఉండడంతో అప్రమత్తమైన ఈ బృందం అక్కడికి చేరుకుంది. ప్రాజెక్టులో నీటి పరిస్థితులను గమనించారు. జనరేటర్ గదులను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment