ఆదిలాబాద్ మండలం అర్లి(బి) శివారులో నీటమునిగిన పత్తి పంట
ఆదిలాబాద్‌రూరల్: జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి మొదలైన వర్షం విరామం లేకుండా కురుస్తోంది. దీంతో జిల్లాలో 140.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా ఉట్నూర్‌లో అత్యధికంగా 235.3 మిల్లీమీటర్లు, భీంపూర్‌లో అత్యల్పం గా 89.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాలతో వాగులు, వంకలు జలకళ సంతరించుకున్నాయి. ఆయా ప్రాంతాల్లో లోలెవల్ వంతెనల పైనుంచి వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. చెరువులు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. ప్రాజెక్టులకూ భారీగా నీరు చేరుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని వ్యవసాయ పంట పొలాల్లో కొంత మేర పంట దెబ్బతిని నేలమట్టమైంది. ఎడతెరిపి లేకుండా ముసురు వానతో జనజీవనం స్తంభించింది. చేలలోకి వెళ్లాల్సిన రైతులు ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి కనిపించింది.
ముసురువాన..
ముసురు ఇంకా కొనసాగుతోంది. ఉట్నూర్, గాదిగూడ, నార్నూర్, ఇంద్రవెల్లి, గుడిహత్నూర్, నేరడిగొండ, సిరికొండ, ఇచ్చోడ మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. పక్షం రోజులుగా వర్షాలు ముఖం చాటేయడంతో ఆందోళన చెందిన రైతన్నలు ముసురు వానలతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెన్‌గంగ, సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టు పరీవాహక ప్రాంతాల్లోని వాగుల సమీపంలో పంట పొలాల్లో వరద నీరు చేరడంతో కొంతమేర దెబ్బతిన్నాయి. దీంతో ఆ రైతులు ఆందోళన చెందుతున్నారు. జూన్ మొదటి వారంలో జిల్లాను తొలకరి పలకరించింది. తొలకరి వానలతో రైతులు మురిసిపోయారు. పత్తి, సోయా పంటలు సాగు చేశారు. ఆ తర్వాత వర్షాలు ముఖం చాటేశాయి. దీంతో రైతుల్లో ఆందోళన కనిపించింది. మధ్య మధ్యలో కురిసిన వానలు కొంత ఊరటనిచ్చాయి. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అన్ని చోట్ల వాగులు, వంకల్లో వరద నీరు ప్రవహిస్తోంది. పంటలకు ఈ వర్షాలు జీవాన్నిస్తున్నాయి.
చెరువులకు జలకళ.. ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో..
జిల్లాలో కురుస్తున్న వర్షాలతో చెరువులు జలకళ సంతరించుకున్నాయి. వరుణుడి కరుణ కోసం ఆకాశంవైపు దిగాలుగా చూస్తున్న రైతన్నకు ఈ వర్షాలు ఊపిరినిచ్చాయి. జైనథ్ మండలం సాత్నాల ప్రాజెక్టు 1.24 టీఎంసీ సామర్థ్యం కలిగి ఉండగా, 1 టీఎంసీ నీటి నిల్వ ఉంది. 1400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా, ఒక గేటు ఎత్తి అంతే మొత్తంలో దిగువకు వదులుతున్నారు. లక్ష్మీపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీటిమట్టం 250.6 మీటర్లు కాగా, నీటి నిల్వ సామర్థ్యం 0.153 టీఎంసీలు కాగా, ప్రస్తుతం పూర్తిగా నిండింది. ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు సాత్నాల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో నిండుకుండలా తలపిస్తోంది. తాంసి మండలం మత్తడి వాగు ప్రాజెక్టు 277.5 మీటర్లు నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉండగా, ప్రస్తుతం 277.3 మీటర్ల నీటి నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టులో 5 గేట్లు ఉండగా, 3 గేట్లను ఎత్తివేసి ఇన్‌ఫ్లో వదులుతున్నారు.
అతలాకుతలం..
జిల్లాలో భారీ వర్షాలు కురియడంతో అతలాకుతలమైంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో పలు లోతట్టు ప్రాంతాల్లోని పంట పొలాల్లో వర్షపు నీరు చేరి నష్టం వాటిల్లింది. సిరికొండ మండలం గుండాల వాగు పొంగిపొర్లడంతో సుమారు 70 మంది రైతులకు సంబంధించిన 150 ఎకరాల పత్తి పంట కొట్టుకుపోయింది. ఇచ్చోడ మండలం చించోలి, హీరాపూర్, ఆడెగాం(కె) గ్రామాల్లోని శివారు సుమారు 120 ఎకరాల పంట పొలాలు వరదనీటితో ముంపునకు గురయ్యాయి. వర్షాలు తగ్గుముఖం పట్టాకే వీటి నష్టం అంచనా వేసే వీలుంటుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇంద్రవెల్లి మండలం లోతట్టు ప్రాంతంలోని వ్యవసాయ పంట పొలంలో వరదనీరు చేరి సోయాబీన్, కొంత మేర పత్తి పంటకు నష్టం వాటిల్లింది.
పంట నష్టాన్ని అధికారులు అంచనా వేయాలని కోరుతున్నారు. నార్నూర్ మండలం గాదిగూడ లోలెవల్ వంతెన పైనుంచి వరదనీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో సుమారు 25 గ్రామాల ప్రజలు రాకపోకల కోసం ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆదిలాబాద్‌రూరల్ మండలం అనుకుంట లోలెవల్ వంతెన పైనుంచి వరదనీరు పోటెత్తడంతో ఎక్కడి గ్రామాల ప్రజలు అక్కడే ఉండిపోయారు. ఆయా వాగుల ఉధృతి ఆదివారం ఉదయం 10గంటల వరకు తగ్గకపోవడంతో ప్రజలు అవస్థలు ఎదుర్కొన్నారు.
పంటలకు మేలైన వర్షం..
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పంటలకు అనుకూలంగా ఉన్నాయి. గత 20 రోజుల నుంచి వర్షాల జాడ లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ఆనందంలో ఉన్నారు. మరో వారం రోజులు వర్షాలు కురియకుండా ఉంటే దిగుబడిపై ప్రభావం చూపే ప్రమాదం ఉండేది. కొన్ని ప్రాంతాల్లో వాగుల సమీపంలోని పంట పొలాల్లో వరదనీరు చేరడంతో పంట దెబ్బతింది. మరికొన్ని పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. – మంగీలాల్, జేడీఏ, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment