పంటలకు ప్రాణం.. | Heavy Rains In Nizamabad | Sakshi
Sakshi News home page

జోరు వాన

Published Mon, Aug 13 2018 11:21 AM | Last Updated on Wed, Oct 17 2018 6:10 PM

Heavy Rains In Nizamabad - Sakshi

నవీపేట మండలం జన్నెపల్లి వద్ద కొట్టుకుపోయిన తాత్కాలిక రోడ్డు

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: చాలా రోజుల తర్వాత భారీ వర్షం జిల్లాను ముంచెత్తింది. ఎండిపోతున్న పంటలకు ప్రాణం పోసింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కాలువల్లో నీరు చేరి జల కళ సంతరించుకున్నాయి. ఉపరితల ఆవర్తనం కారణంగా శనివారం తెల్లవారు జామున నుంచి ప్రారంభమైన వాన ఆదివారం ఉదయం వరకు ఎడ తెరిపి లేకుండా కురిసింది. జిల్లా వ్యాప్తంగా 232.9 సెం.మీటర్ల వర్షపాతం రికార్డు కాగా, సగటున 8.6 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా ఆర్మూర్‌లో 13.6 సెం.మీటర్ల వర్షం కురియగా, మోర్తాడ్‌లో 11.3, ఏర్గట్ల, నిజామాబాద్‌ దక్షిణం, నవీపేట్, నందిపేట్‌ మండలాల్లో 10 సెం.మీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది. దీంతో జిల్లాలోని చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి.
 
పంటలకు ప్రాణం..
పక్షం రోజులుగా సరైన వర్షాలు లేకపోవడంతో పంటలు ఎండుముఖం పట్టాయి. ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలన్నీ వాడిపోయాయి. ముఖ్యంగా వరి పొలాలు నీళ్లు లేక బీటలు వారాయి. నాట్లు వేసుకున్న చాలా చోట్ల వాడిపోయే పరిస్థితికి చేరుకుంది. అలాగే, మొక్కజొన్న, పూత దశలో ఉన్న సోయా ఎండి పోయే దశకు చేరడంతో రైతులు ఆందోళన చెందారు. పంటలు ఎండిపోతున్న తరుణంలో కురిసిన తాజా వర్షం ప్రాణం పోసింది. దీంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది.
 
ఎస్సారెస్పీకి స్వల్ప ఇన్‌ఫ్లో.. 
తాజా వర్షాలతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో స్వల్పంగా పెరిగింది. వారం రోజులుగా ఇన్‌ఫ్లో లేని ఈ జలాశయానికి ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 3,224 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎస్సారెస్పీ ఎగువ ప్రాంతంలో వర్షాలు కురిస్తే మరింత వరద నీరు వచ్చే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.


ఎనిమిది మండలాల్లో లోటు.. 
జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురిసినప్పటికీ ఇంకా ఎనిమిది మండలాలు లోటు వర్షపాతం జాబితాలో ఉన్నాయి. ఆదివారం నాటికి సగటున 7.9 సెం.మీ. లోటుంది. బాల్కొండ, మోపాల్, ఇందల్‌వాయి, రుద్రూర్, నిజామాబాద్‌ రూరల్, రెంజల్, ముప్కాల్, మెండోరాల్లో ఇప్పటికీ సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. జక్రాన్‌పల్లి, మోర్తాడ్‌ మండలాల్లో మాత్రమే సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం రికార్డయింది. మిగిలిన మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా జూన్‌ 1 నుంచి ఈ నెల 12 నాటికి 1,503.8 సెం.మీ. సాధారణ వర్షపాతం కురవాల్సి ఉండగా, 1,385.6 సెం.మీల వర్షం మాత్రమే కురిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

ఉప్లూర్‌లో వర్షానికి కూలిన ఇల్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement