కుంటాల జలపాతం
జిల్లాలో బుధవారం భారీ వర్షం కురిసింది. జిల్లాలోని జలాశయాలు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరదనీరు వచ్చిచేరింది. దీంతోప్రాజెక్టుల్లో నీటిమట్టాలు, నీటి సామర్థ్యం పూర్తిస్థాయికి దరిదాపులోకి వచ్చాయి. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు పెన్‌గంగ నదిలో ఎగువ మహారాష్ట్ర నుంచి వరద ప్రవాహం పోటెత్తుతోంది.
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో బుధవారం భారీ వర్షం కురిసింది. బజార్‌హత్నూర్, నేరడిగొండ, గుడిహత్నూర్, బోథ్, ఇచ్చోడ, గాదిగూడ, ఉట్నూర్‌లలో భారీగా వర్షం కురువగా, మిగితా మండలాల్లో ఓ మోస్తారు నుంచి సాధారణ వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఇప్పటివరకు 18 మండలాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. పెన్‌గంగ నది లో ఎగువ మహారాష్ట్ర నుంచి వరద ప్రవాహం అధి కంగా ఉంది. జిల్లాలోని జైనథ్ మండలం కొరటా, మహారాష్ట్రలోని చనాకా మధ్యన నది వద్ద నిర్మించిన బ్యారేజీ 23 గేట్ల నుంచి ఈ వరద దిగువకు ప్రవహిస్తుంది.
జూన్ 1 నుంచి ఈ బ్యారేజీ గేట్లను దాటి 26.89 టీఎంసీల వరదనీరు దిగువకు వెళ్లిపోయింది. జైనథ్ మండలంలోని సాత్నాల ప్రాజెక్టుకు ఈ వర్షాకాలంలో 0.77 టీఎంసీల నీరు వచ్చిచేరింది. దీంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి మరో 2 మీటర్ల దూరంలో ఉంది. తాంసి మండలంలోని మత్తడివాగు ప్రాజెక్టుకు ఇప్పటివరకు 0.29 టీఎంసీల వరద నీరు రావడంతో పూర్తిస్థాయి నీటి మట్టానికి ఒక మీటర్ దిగువలో ఉంది. వర్షాలు ఇదే రీతిలో కొనసాగితే ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదలాల్సి వస్తుంది. సాత్నాల ప్రాజెక్టుకు 4 గేట్లు, మత్తడివాగు ప్రాజెక్టుకు 5 గేట్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల కింద సాత్నాలకు 24వేల ఎకరాలు, మత్తడివాగు ప్రాజెక్టుకు 8500 ఎకరాల ఆయకట్టు ఉంది.
తాంసి మండలంలోని మత్తడివాగు ప్రాజెక్టు
Comments
Please login to add a commentAdd a comment