kuntala water fall
-
కుండపోత వాన.. పరవళ్లు తొక్కుతున్న కుంటాల జలపాతం
జిల్లాలో బుధవారం భారీ వర్షం కురిసింది. జిల్లాలోని జలాశయాలు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరదనీరు వచ్చిచేరింది. దీంతోప్రాజెక్టుల్లో నీటిమట్టాలు, నీటి సామర్థ్యం పూర్తిస్థాయికి దరిదాపులోకి వచ్చాయి. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు పెన్‌గంగ నదిలో ఎగువ మహారాష్ట్ర నుంచి వరద ప్రవాహం పోటెత్తుతోంది. సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో బుధవారం భారీ వర్షం కురిసింది. బజార్హత్నూర్, నేరడిగొండ, గుడిహత్నూర్, బోథ్, ఇచ్చోడ, గాదిగూడ, ఉట్నూర్‌లలో భారీగా వర్షం కురువగా, మిగితా మండలాల్లో ఓ మోస్తారు నుంచి సాధారణ వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఇప్పటివరకు 18 మండలాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. పెన్‌గంగ నది లో ఎగువ మహారాష్ట్ర నుంచి వరద ప్రవాహం అధి కంగా ఉంది. జిల్లాలోని జైనథ్ మండలం కొరటా, మహారాష్ట్రలోని చనాకా మధ్యన నది వద్ద నిర్మించిన బ్యారేజీ 23 గేట్ల నుంచి ఈ వరద దిగువకు ప్రవహిస్తుంది. జూన్ 1 నుంచి ఈ బ్యారేజీ గేట్లను దాటి 26.89 టీఎంసీల వరదనీరు దిగువకు వెళ్లిపోయింది. జైనథ్ మండలంలోని సాత్నాల ప్రాజెక్టుకు ఈ వర్షాకాలంలో 0.77 టీఎంసీల నీరు వచ్చిచేరింది. దీంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి మరో 2 మీటర్ల దూరంలో ఉంది. తాంసి మండలంలోని మత్తడివాగు ప్రాజెక్టుకు ఇప్పటివరకు 0.29 టీఎంసీల వరద నీరు రావడంతో పూర్తిస్థాయి నీటి మట్టానికి ఒక మీటర్ దిగువలో ఉంది. వర్షాలు ఇదే రీతిలో కొనసాగితే ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదలాల్సి వస్తుంది. సాత్నాల ప్రాజెక్టుకు 4 గేట్లు, మత్తడివాగు ప్రాజెక్టుకు 5 గేట్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల కింద సాత్నాలకు 24వేల ఎకరాలు, మత్తడివాగు ప్రాజెక్టుకు 8500 ఎకరాల ఆయకట్టు ఉంది. తాంసి మండలంలోని మత్తడివాగు ప్రాజెక్టు -
వావ్.. కుంటాల జలపాతం వద్ద ‘వాచ్‌టవర్’..
సాక్షి, నేరడిగొండ(నిర్మల్): రాష్ట్రంలోనే ఎత్తయిన జలపాతంగా పేరొందిన కుంటాల జలపాతం వద్ద రూ.10లక్షలతో నిర్మించిన వాచ్‌టవర్‌ను ఆదివారం పీసీసీఎఫ్ శోభ, కలెక్టర్ సిక్తా పట్నాయక్‌తో కలిసి ప్రారంభించారు. వాచ్‌టవర్‌కు ఊటచెలిమ కుంటాల వాచ్టవర్గా నామకరణం చేశారు. జలపాతం ‘యూ’ పాయింట్ వద్దకు వెళ్లి జలపాతం అందాలను తిలకించారు. కుంటాల(కె) సర్పంచ్ ఎల్లుల్ల అశోక్, వీఎస్ఎస్ చైర్మన్ నర్సయ్యలు కుంటాల జలపాతానికి వచ్చే పర్యాటకులకు మెట్ల ద్వారా దిగడం ఇబ్బందిగా ఉందని, జలపాతం వద్ద రూప్‌వే ఏర్పాటు చేస్తే బాగుంటుందని వారి దృష్టికి తీసుకెళ్లారు. అయితే జలపాతం అభయారణ్యంలో ఉందని, రూప్‌వే నిర్మాణం సాధ్యం కాదన్నారు. వీరి వెంట సీఎఫ్ రామలింగం, డీఎఫ్‌వో రాజశేఖర్, ఉట్నూర్ ఎఫ్‌డీవో రాహుల్‌కిషన్ జాదవ్, నేరడిగొండ, సిరిచెల్మ ఎఫ్ఆర్వోలు రవికుమార్, వాహబ్ అహ్మద్, ఎఫ్ఎస్వో వసంత్‌కుమార్, ఎఫ్‌బీవో రాధకృష్ణ, అటవీ శాఖ అధికారులు తదితరులు ఉన్నారు. -
Photo Story: కుండపోత వాన, పర్యాటకుల సందడి, ఆరుద్ర ఆగమనం
వర్షాల కోసం భీంసన్ దేవుడికి పూజలు బేల(ఆదిలాబాద్): మండలకేంద్రంలోని ఆదివాసీ పర్దాన్లు వర్షాలు సమృద్ధిగా పడాలని ఆదివారం భీంసన్ దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కుటుంబ సభ్యులతో కలిసి శోభాయాత్ర నిర్వహించారు. స్థానిక ఇందిరా నగర్‌కాలనీలో భీంసన్ దేవుడికి ప్రత్యేక పూజలు చేసి, నైవేద్యం సమర్పించారు. కుండపోత వర్షం వేములవాడ : వేములవాడలో ఆదివారం సాయంత్రం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈదురుగాలుల కారణంగా సెస్ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపి వేశారు. పలు గ్రామాల్లో పత్తి చెళ్లలో వర్షపు నీరు నిలిచింది. ఇల్లంతకుంట మండలంలోని పొత్తూరు–కందికట్కూర్ గ్రామాల మధ్య ఉన్న సుద్ద ఒర్రె ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు నిలిచిపోయాయి. కుంటాల జలపాతం వద్ద పర్యాటకుల సందడి వరుసగా కురుస్తున్న వర్షాలకు ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల, పొచ్చెర జలపాతాలు జలకళను సంతరించుకున్నాయి. లాక్డౌన్ కారణంగా పర్యాటకులను అనుమతించకపోవడంతో ఇన్ని రోజులు నిర్మానుష్యంగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం కరోనా ఆంక్షలు ఎత్తివేయడం, ఆదివారం కలిసి రావడంతో హైదరాబాద్, మహారాష్ట్ర నుంచి పర్యాటకులు తరలివచ్చారు. జలపాతం వద్ద స్నానాలు చేస్తూ.. సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ ఆరుద్ర.. ఆగమనం ఏడాది మొత్తంలో ఆరుద్రకార్తెలో మాత్రమే ఆరుద్ర పురుగులు దర్శనమిస్తాయి. ఆరుద్ర కార్తెకు రైతులకు అవినాభావ సంబంధం ఉంది. ఈ పురుగుల ఆగమనాన్ని అన్నదాతలు శుభసూచకంగా భావిస్తారు. ఆదివారం నెన్నెల శివారులోని చేన్లలో ఆరుద్ర పురుగులు దర్శనమిచ్చాయి. దీంతో ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడి, పంటలు బాగా పండుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. – నెన్నెల విరబూసిన ‘బ్రహ్మ కమలం’ రెబ్బెన(ఆసిఫాబాద్): అత్యంత అరుదుగా కనిపించే బ్రహ్మకమలం రెబ్బెన మండలంలోని గోలేటి టౌన్షిప్లో దర్శనమిచ్చింది. బెల్లంపల్లి ఏరియాలోని ఏరియా వర్క్‌షాప్ డీజీఎంగా పనిచేస్తున్న శివరామిరెడ్డి నివాసంలో ఈ బహ్మకమలం వికసించింది. కొద్ది గంటలు మాత్రమే పూర్తిగా వికసించే ఈ పుష్పం ఆపై ముడుచుకుంటుంది. శివరామిరెడ్డి సతీమణి సృజన మాట్లాడుతూ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే బ్రహ్మకమలం వికసిస్తుందని తెలిపారు. అలాంటి అరుదైన పుష్పం పూయటం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. -
ఆదిలాబాద్ అందాలు.. కన్నులకు నయానానందం
సాక్షి,ఆదిలాబాద్ : అబ్బురపరిచే అందాలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. ఎటు చూసిన పచ్చదనం, దట్టంగా ఉండి ఆహ్లాదాన్ని పంచే అడవులు, చెంగుచెంగున పరుగు తీసే వన్యప్రాణులు, పక్షుల కిలకిలరావాలు, గలగల పారే సెలయేర్లు..ఇలాంటి ఎన్నో అందాలకు నెలవు ఉమ్మడి ఆదిలాబాద్. ఈ ప్రాంతం మరో కశ్మీర్‌లా పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటోంది. బాసరలో నెలకొన్న జ్ఞానసరస్వతి, కుంటాల జలపాతం, కవ్వాల్‌లో వన్యప్రాణులు, జైపూర్‌లో మొసళ్లమడుగు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చూడతగిన ప్రదేశాలకు నిలయం మన జిల్లా. నేడు పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లాలోని టూరిజంపై కథనం. కవ్వాల్‌లో చూడదగిన ప్రదేశాలు... ఎటు చూసిన పచ్చదనం, దట్టంగా నిటారుగా ఉండి ఆహ్లాదాన్ని పంచే అడవులు, చెంగు చెంగున పరుగులు తీసే వన్యప్రాణులు, పక్షుల కిలకిల రావాలు, గలగల పారే సెలయేరులు ఇవన్నింటికి చిరునామ కవ్వాల్ అభయారణ్యం. నిత్యం తమ పనుల్లో బిజీబిజీగా గడిపే వారు తమ కుటుంబంతో కొంత రిలాక్స్ అయ్యేందుకు సూదూర ప్రాంతాల వారు వచ్చి బస చేసే సౌకర్యం ఏర్పాటు చేశారు. గిరిజనుల ఆటపాట, వారు తయారు చేసిన వెదురు వస్తువులు, ఇక్కడ చూడవచ్చు. పచ్చదనంతో పర్యాటకులకు అహ్లాదాన్ని పంచుతూ అడవులను చూడటానికి సుదూర ప్రాంతాల నుంచి ప్రకృతి ప్రేమికులు నిత్యం వస్తుంటారు. వీరికి పర్యటకశాఖ ఆధ్వర్యంలో బస చేసేందుకు కార్టేజీలు, రెస్టారెంట్లతో పాటుగా సఫారీ సౌకర్యం కల్పించారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ నుంచి నుంచి జూన్ వరకు జంగల్ సఫారీ ద్వారా అడవుల్లో 15 నుంచి 20 కీమీ దూరం తిప్పుతారు. ముఖ్యమైన ప్రదేశం టైగర్‌జోన్ కవ్వాల్ అభయారణ్యాన్ని 2012 ఎప్రిల్ 10 న కేంద్ర ప్రభుత్వం టైగర్‌జోన్‌గా ప్రకటించింది. ఈ టైగర్‌జోన్ లో అప్పుడప్పుడు వస్తు , పోయే పులితో పాటుగా చిరుత పులులు, ఎలుగుబంట్లు, లాంటి క్రూరమృగాలతో పాటు అడవి దున్నలు, నీలుగాయిలు, సాంబర్లు, చుక్కల దుప్పులు, కొండగొర్రెలు, మనుబోతులు, కుందేళ్లు, ముళ్లపంది, అడవి పందులు, తోడేళ్లు లాంటి వన్యప్రాణులు ఇక్కడ నివసిస్తుంటాయి. చూడాల్సిన ప్రదేశాలు కవ్వాల్ టైగర్‌జోన్‌లో అనేక చూడదగిన ప్రదేశాలున్నాయి. కొన్ని ప్రదేశాల వరకు మాత్రమే అటవిశాఖ అనుమతి ఇచ్చింది. వాటిలో మల్యాల, కల్పకుంట వాచ్టవర్లు, నీలుగాయి కుంట, గడ్డి క్షేత్రాలు, సొలార్కుంట, బేస్క్యాంపులున్నాయి. ఎలా రావచ్చు.. జన్నారంలోని కవ్వాల్ అభయారణ్యం చూడటానికి హైదరాబాద్ నుంచే కాకుండా తెలంగాణలోని పలు జిల్లాల నుంచి వచ్చేందుకు రైలు, రోడ్డు మార్గాలున్నాయి. హైదరాబాద్ నుంచి 250కి.మీ దూరం ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఆదిలా బాద్ జిల్లాకు చెందిన బస్సులు ప్రతిరోజు రాకపోకలు కొనసాగిస్తాయి. ఆదిలాబాద్ నుంచి మంచిర్యాలకు వెళ్లే బస్సుల ద్వారా జన్నారంకు చేరుకోవచ్చు. నిర్మల్, కొమురంభీం జిల్లా ల నుంచి బస్సు సౌకర్యాలు ఉన్నాయి. ఆదిలాబాద్ నుంచి 100కి.మీ, నిర్మల్ నుంచి 80, కుమురంభీం జిల్లా నుంచి 120కి.మీ దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. చూడదగిన ప్రదేశం జోడేఘాట్ జల్.. జంగల్.. జమీన్ కోసంబ అసువులు బాసి అమరవీరుడైన ఆదివాసీ ముద్దుబిడ్డ కుముర భీం పోరుగడ్డలోని భీం మ్యూజియం పర్యాటకులను ఆకట్టుకుటుంది. ప్రతి రోజు అనేక మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చి మ్యూజియంలోని పరికరాలను తిలకిస్తారు. నాటి ప్రభుత్వం జోడేఘాట్‌ను గుర్తించక పోగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు విడుదల చేసి దీనికి ప్రత్యేక ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఇలా వెళ్లాలి... కెరమెరి మండలంలోని హట్టి గ్రామం నుంచి జోడేఘాట్‌కు 22కిలో మీటర్ల దూరం ఉంది. ఆసిపాబాద్ నుంచి 52, ఆదిలాబాద్ నుంచి 123 కిటో మీటర్ల దూరం, ఆసిపాబాద్ నుంచి ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. ఆసిఫాబాద్ నుంచి రూ.35, కెరమెరి నుంచి రూ.19బస్సు టిక్కట్టు ఉంది. కెరమెరి నుంచి ఆటోలు ప్రతి రోజు నడుస్తాయి. హట్టి నుంచి జోడేఘాట్ వరకు బీటీరోడ్డు సౌకర్యం ఉంది. చారిత్రక ప్రదేశం పార్పల్లి పర్యాటకులు కోటపల్లి మండలం పార్పల్లి గ్రామంలోని కొండపై కొలువున్న భైరవస్వామి ఆలయం చూడదగిన ప్రదేశం. దీనిని అభివృద్ధి చేస్తే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ గ్రామంలోని ప్రజలు శుభకార్యాలు ప్రారంభించే ముందు భైరవస్వామిన దర్శించుకుంటారు. గోదావరి నది పరివాహక ప్రాంతంలో పూర్వకాలంలో మునులు, రుషులు తపస్సు చేసేవారని తెలుస్తోంది. మండలంలోని పార్పల్లి సమీపంలోని గుట్టపై స్వయంభుగా వెలసిన భైరవుడి జయంతిని శనివారం ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. కనువిందు చేస్తున్న కుంటాల ప్రకృతి సహజ సిద్ధమైన కుంటాల జలపాతం పచ్చని అడవితల్లి ఒడిలో సెలయేళ్ల పరవళ్లు తొక్కుతున్న జలధారాలతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. కొండ కోనలు.. పచ్చని పందిరి లాంటి చెట్ల నడుమ జాలువారే జలధారలు.. ఇది జిల్లాలో ప్రకృతి వరప్రసాదమైన కుంటాల జలపాతం ప్రత్యేకత. ఇక్కడ ఆహ్లాదాన్ని ఆస్వాదించడానికి ఇతర రాష్ట్రాల నుంచి ప్రకృతి ప్రేమికులు నిత్యం వస్తుంటారు. పరిశ్రమలు, కార్యాలయాల్లో పనిచేసే కార్మికులు, అధికారులు, ఉద్యోగులు, యువత మానసిక ఉల్లాసానికి వారంతపు సెలువుల్లో వేల సంఖ్యల్లో వస్తారు. రాష్ట్రంలోనే ప్రసిద్ధి... రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రాల్లో కుంటాల జలపాతం ఒకటి. ఇది ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రం నుంచి 12కిలో మీటర్ల దూరం వెళ్లితే దట్టమైన అటవీ ప్రాంతంలో పాలనురుగుల పరవళ్లతో కనిపిస్తోం ది. శని,ఆదివారాల్లో హైదరాబాద్, కరీం నగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలతో పాటు మహరాష్ట్ర, ఆంధ్ర, ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల నుంచి విద్యార్థులు, యువత, వివిధ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు ఆ జలధారలు, చుట్టూర అటవీ ప్రాంతం మధ్యలో నుంచి జాలువారే జలధారాలను చూస్తూ మంత్రముగ్ధులవుతారు. పాపికొండలను తలపించే అందాలు చెన్నూర్ మండలంలోని సోమన్‌పల్లి ప్రాంతంలోని గోదావరి నది తీరంలో సుమారు రెండు వందల ఏళ్ల క్రితం పాండవులు సంచరించారనే ప్రాచీన చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. మండలంలోని సోమన్‌పల్లి నది తీరంలో శివాలయం, భీముని లొద్ది, బుగ్గమలన్న ఆలయాలు ఉన్నాయి. గతంలో ఈ ప్రాంత వాసులు ఈ ఆలయాల్లో పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకునే వారు. గ్రామానికి దూరంగా ఉండడంతో పాటు రోడ్డు సౌకర్యం లేక అటవీ ప్రాంతం కావడంతో భక్తుల రాక రోజు రోజుకు తగ్గుముఖం పట్టింది. భీముడు సోమన్‌పల్లి గుట్ట మీద ఒక్క అడుగు భీమినిలో మరో అడుగు వేసి వెళ్లాడని ఇక్కడ ఉన్న భీముని అడుగే ఇందుకు నిదర్శనమని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకాభివృద్ధి చేస్తే మరో పాపికొండలను తలపిస్తుందని స్థానికులంటున్నారు. తెలంగాణ అన్నవరంగా.. గూడెం ఉమ్మడి రాష్ట్రంలో రెండో అన్నవరంగా, ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ అన్నవరంగా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయం ప్రసిద్ధికెక్కింది. 1964లో గూడెం గ్రామ వాస్తవ్యుడు శ్రీ గోవర్ధన పెరుమాండ్ల స్వామి అనే చాదాత్త వైష్ణవుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. అప్పటినుంచి ఈ ఆలయం దినదినాభిభివృద్ధి చెందుతోంది. ఈ ఆలయం 63వ జాతీయ రహదారికి పక్కనే ఉండటంతో నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. ఆలయ సమీపాన్నే పవిత్ర గోదావరి నది ప్రవహించడంతో ఆలయానికి వచ్చిన భక్తులు గోదావరినదిలో పుణ్యస్నానాలు ఆచరించి సత్యదేవున్ని దర్శించుకుంటారు. వెళ్లడం ఇలా... గూడెం సత్యనారాయణస్వామి ఆలయం జిల్లా కేంద్రం మంచిర్యాలకు 30కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. ఆలయానికి కరీంనగర్ నుంచి వచ్చే వారు లక్సెట్టిపేట, లేదా, వయా లక్సెట్టిపేట మీదుగా ఆదిలాబాద్, మంచిర్యాల వెళ్లే బస్సుల్లో రావచ్చు. ఈ బస్సులు ఆలయం ముందునుంచే వెళ్తాయి కాబట్టి ఆలయం వద్దనే దిగొచ్చు. నిజామాబాద్, జగిత్యాల వైపు నుంచి వచ్చే వాళ్లు లక్సెట్టిపేట, మంచిర్యాల వెళ్లేవారు బస్సుల్లో రావచ్చు. ఆదిలాబాద్ నుంచి వచ్చే వాళ్లు మంచిర్యాల, లేదా వయా లక్సెట్టిపేట మీదుగా కరీంనగర్, హైదరాబాద్, వరంగల్, గుంటూరు, ఖమ్మం వెళ్లే బస్సుల్లో రావచ్చు. నిర్మల్ జిల్లా.. పర్యాటక ఖిల్లా పచ్చని చెట్లు, గలగల పారే గోదారి అలలు, ఎగిసి పడే జలపాతాలు, చెంగున ఎగిరే వన్యప్రాణులున్న అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్‌లోకి స్వాగత తోరణంలా ఉంటుంది నిర్మల్ ఖిల్లా. హైదరాబాద్ నుంచి వచ్చే పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది. నూతనంగా ఏర్పడిన నిర్మల్ జిల్లాలో ప్రధాన పర్యాటక పుణ్యక్షేత్రం బాసర. జిల్లాకు పడమరన ఉన్న ఈ ఆలయం దక్షిణ భారతాన గల ఏకైక సరస్వతీ క్షేత్రం. నాలుగు వందల ఏళ్ల కిందట నిర్మించిన నగరం నిమ్మల. అదే కాలక్రమంలో నిర్మల్‌గా మారింది. ఇక్కడి నకాశీ కళకు అంతే చరిత్ర ఉంది. ఏకైక క్షేత్రం..బాసర వేదాలు, ఉపనిషత్తులు, మహాభారతాన్ని రాసిన వేదవ్యాసుడి చేతుల మీదుగా సరస్వతమ్మ ఇక్కడ ప్రాణం పోసుకుంది. తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్న గోదావరి నది నిర్మల్ జిల్లా బాసర వద్దే రాష్ట్రంలోకి అడుగు పెడుతోంది. గోదారి ఒడ్డున పచ్చని చెట్లు, ప్రశాంత వాతావరణంలో గల కోవెలలో చదువుల తల్లి కొలువై ఉంది. ఈ అమ్మ ఒడిలోనే తమ పిల్లలకు అక్షర శ్రీకారాలు చేయిస్తుంటారు. -
జలపాతం.. జరభద్రం
సాక్షి, తిర్యాణి(ఆసిఫాబాద్) : వర్షాకాలంలో సరదాగా గడపాలని జలపాతాల వద్దకు వెళ్లడం పరిపాటి. జలపాతాల అందాలను తిలకించే సమయంలో ఆదమరిస్తే అంతే సంగతులు. ఆ రోజు ఆనందంగా గడపాల్సిన వారు చిన్నపాటి పొరపాటుతో విషాదాన్ని మిగుల్చుకుంటారు. ఉల్లాసంగా వెళ్లే పర్యాటకుల ప్రయాణం సాఫీగా సాగాలంటే జలపాతాల వద్ద కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మేలు. ఆదమరిస్తే అంతే... ఒక్క చిన్నపాటి సరదాగా కుటుంబంలో తీరని వేదనను మిగుల్చుతోంది. విహారం కోసం వెళ్లితే ఆ రోజు అంతా సంతోషంగా గడపాలి కాని అది కాస్తా విషాదంగా మాత్రం మిగులకూడదు. జలపాతం అంటేనే దట్టమైన అడవి ప్రాంతంలో ఉండి ఎత్తైన కొండల మధ్యపై నుంచి నీరు కిందకు జలువారుతూ ఉంటుంది. ఇలాంటి ప్రదేశాలలో ఏమాత్రం ఆదమరిచి ఆజాగ్రత్తగా వ్యవహరించిన ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. అలాంటి సంఘటన గురువారం కుమురం భీం జిల్లా తిర్యాణి మండలంలోని చింతల మాదర జలపాతం వద్ద సంభవించింది. మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంకు చెందిన పోలవేణి కుమారస్వామి (22) అనే యువకుడు తన మిత్రులతో కలసి వచ్చి సరదాగా గడుపుతున్న సమయంలో మృతువు కబలించిన సంఘటన విదితమే. ఇది ఒక్కటే కాదు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 30 చిన్న చితక జలపాతలు ఉన్నాయి. ప్రతి ఏడాది పదుల సంఖ్యలో యువకులు జలపాతలు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. జలపాతాల వద్దకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటిస్తే మేలు. లోతును అంచనా వేయలేం వర్షాకాలంలో నీళ్లతో జలపాతాలు కనువిందు చేస్తుండడంతో వాటి లోతును అంచనా వేయలేకపోతాం. దీంతో పర్యాటకులు జలపాతంలో దిగి సెల్ఫీల కోసం పోటీ పడుతూ ఉంటారు. సెల్ఫీల మోజులో లోతుగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళి ప్రాణాలను కోల్పోతున్న సంఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. జలపాతంలో ఎక్కువగా పెద్దపెద్ద బండలతో ఉండటం నిత్యం నీళ్ళలో ఉండడంతో వాటికి సాధారణంగా పాకురుపట్టి ఉంటుంది. కానీ పర్యాటకులు ఇది గమనించకుండా సెల్ఫీల కోసం ఎత్తున బండరాళ్లను ఎక్కి ఫొటోలు దిగే క్రమంలో జారీ లోతున్న ప్రదేశలు పడటం జరుగుతోంది. ఈతరాని వాళ్ళు ఇలాంటి ప్రయోగాలు చేయడంతోఈత రాక నీటిలో పడి (గల్లంతు) చనిపోతున్నారు. మద్యంకు దూరంగా ఉంటే మేలు... జలపాతాల సందర్శన కోసం వచ్చే పర్యాటకులు సరదాగా గడిపేందుకు జలపాతాల వద్దనే వనభోజనాలు చేస్తుంటారు. అంత వరకు ఆగకుండ ఆల్కహాల్‌కు తీసుకోవడం సమస్యకు కారణంగా మారుతుంది. ఎక్కువ శాతం పర్యాటకులు మద్యం సే వించి జలపాతంలో దిగడం ద్వారా మత్తులోని ఉత్తేజంతో ఈత రాకున్నా లోతుగా ఉండే ప్రదేశాలకు వెళ్లి బయటకు రాకుండా ప్రా ణాలను కోల్పోతు....తమ కుటుంబంలో విషాదాన్ని నింపుతున్నారు. మత్తుకు దూరంగా ఉంటే జలపాతాల్లో జరుగుతున్న ప్రమాదాలనుకొంతవరకు నియంత్రించవచ్చు. రక్షణ చర్యలు కరువు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జలపాతల్లో రక్షణ చర్యలు పూర్తిగా కరువయ్యాయి. పర్యాటకులను వారించేందుకు ఎలాంటి సిబ్బంది ఉండకపోవడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రభుత్వం జిల్లాలోని జలపాతాలను పర్యాటక ప్రాంతంగా గుర్తించి సెక్యూరిటీ పెంచి డెంజర్ జోన్ బోర్డులను ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలను కొంతమేర వరకు తగ్గించచ్చు. జలపాతాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు → పర్యాటకులు ఎట్టి పరిస్థితిలోనూ జలపాతం కొండలపై ఎక్కడం చేయకూడదు. ఎందుకంటే ఆ బండరాళ్లపై నిరంతరం నీళ్ళు ప్రవహిస్తూ ఉండటం ద్వారా అవి పాకురుబట్టి జారుడుతత్వంను కలిగి ఉంటుంది. → సెల్ఫీల కోసం జలపాతం లోపల ఉన్నా ఎత్తైన బండలను ఎక్కకూడదు. → నీళ్లు అధికంగా ప్రవహిస్తున్న ప్రదేశంలో స్నానాలు చేయకూడదు. → జలపాతాలకు వెళ్తున్న సమయంలో ఆల్కాహాల్‌కు దూరంగా ఉండాలి. → ఈత వస్తే తప్ప జలపాతంలో దిగడానికి సహసించద్దు. → వర్షాలు అధికంగా పడుతున్న సమయంలో జలపాతాల వద్దకు వెళ్లకపోవడం మేలు. → సూర్యస్తమం వరకు అడవి నుంచి బయటకు వచ్చేలా ఫ్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే రాత్రి సమయంలో అటవి జంతువుల సంచారం అధికంగా ఉండడం వాటి భారీన పడితే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. → జలపాతాలకు ఒక్కరుగా కాకుండా గుంపులుగానే వెళ్లాలి. -
తెలంగాణ ‘నయాగరా’
సాక్షి, ఆసిఫాబాద్: చుట్టూ అడవి.. కొండల నుంచి జాలువారే జలపాతాలు.. పాలనురుగును తలపించే నీళ్లు.. దిగువకు దూకుతున్న జల సవ్వడులు.. రెప్పకూడా వేయకుండా తనివితీరా చూడాలనిపించే ప్రకృతి సోయగాలు.. ఫొటో చూస్తుంటేనే అదిరిపోతోంది.. నిజంగా అక్కడకు వెళ్లి చూస్తే తన్మయత్వంతో మైమరచిపోవడం ఖాయం అనిపిస్తోంది కదూ! మరి ఇంతటి అందమైన.. మినీ నయాగరాలా కనిపిస్తున్న ఈ జలపాతం ఎక్కడుందో తెలుసా? అచ్చంగా మన గడ్డ మీదే..! చదవండి: జలపాతాల కనువిందు మనసు దోచే జలపాతాలు, హృదయం పులకరించే ప్రకృతి సోయగాలు చూడాలంటే ఇకపై మనం ఎక్కడికో వెళ్లక్కర్లేదు. దర్జాగా మన గడ్డపైనే వాటిని చూస్తూ తన్మయత్వంతో మైమరచిపోవచ్చు. మదిని కట్టిపడేస్తూ కనువిందు చేస్తున్న ఈ అందాలు.. మన కుమురంభీం జిల్లాలోనే ఉన్నాయి. లింగాపూర్ మండల సమీపంలో ఈ జలపాతాలు హోయలొలికిస్తున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. సప్తగుండాలుగా పిలిచే ఏడు జలపాతాలు మదిని పులకరింపజేస్తున్నాయి. ఇక్కడి దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న రామ గుండం, సీత గుండం, లక్ష్మణ గుండం, భీమ గుండం, సవితి గుండం, చిరుతల గుండం, సప్తగుండం అనే ఏడు గుండాలను కలిపి మిట్టె జలపాతం అని పిలుస్తారు. ఇటీవల కురిసిన వర్షాలకు వరద చేరడంతో ఎత్తైన కొండల నుంచి జలపాతం పరవళ్లు తొక్కుతూ చూపరులను కట్టిపడేస్తోంది. కుమురంభీం జిల్లా కేంద్రానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతాన్ని గతంలో పనిచేసిన కలెక్టర్ చంపాలాల్ సందర్శించడంతో మరింత వెలుగులోకి వచ్చింది. అద్భుతమైన పర్యాటక కేంద్రంగా విరజిల్లాల్సిన ఈ ప్రదేశం.. సరైన రోడ్డు మార్గం లేకపోవడంవల్ల ప్రాచుర్యం సంతరించుకోలేకపోతోంది. ఇవే కాకుండా ఈ జిల్లాలో దట్టమైన అటవీ ప్రాంతాల్లో అనేక జలపాతాలు ఉన్నా ఇన్నాళ్లూ అవి బాహ్య ప్రపంచానికి పరిచయం కాలేదు. -
జలపాతాల కనువిందు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని దట్టమైన అడవుల్లోని కొండల మధ్య జాలువారుతున్న దృశ్యాలు చూపరులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. అడవుల్లో అందాలు దాగి ఉన్న అందాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నారు. ప్రస్తుత వర్షాకాలంలో జలపాతాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. జలపాతాల వద్ద సరైన వసతులు లేకున్నప్పటికీ పర్యాటకుల సంఖ్య ఏడాదికి ఏడాది పెరుగుతూనే ఉంది. పలు జలపాతాల వద్దకు వెళ్లేందుకు సరైన రవాణా సౌకర్యం కల్పిస్తే మరింతగా అభివృద్ధి చెందే అవకాశాలు లేకపోలేదు. సాక్షి, ఆసిఫాబాద్ : కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని చింతల మాదర, గుండాల జలపాతం సందర్శకులను కనువిందు చేస్తున్నాయి. చింతలమాదర జలపాతానికి చేరుకోవాలంటే మండల కేంద్రం నుంచి 15కిలో మీటర్ల వయా సుంగాపూర్ వరకు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి మూడు కిలో మీటర్ల ముందు నుంచి నడకనే ద్వారానే వెళ్లడం సాధ్యమవుతుంది. మండలంలోని మరో జలపాతం గుండాల. ఈ జలపాతం చేరుకోవాలంటే 16కిలో మీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అందులో 10కిలో మీటర్లు వయా రోంపెల్లి మీద నుంచి వాహనాల ద్వారా వెళ్లవచ్చు. మిగత ఆరు కిలో మీటర్లు దట్టమైన అడవి కొండలపై నడుచుకుంటూ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం పర్యాటకులకు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని గురిస్తే అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఆకర్షిస్తున్న కుంటాల రాష్ట్రంలోనే అతిపెద్ద జలపాతమిది. తెలంగాణ నయాగార పిలుచుకునే ఈ వాటర్‌ఫాల్స్ టీవీ సీరియల్స్ ద్వారా మనకు సుపరిచితమే. ఈ జలపాతం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుంటాల వద్ద ఉంది. ఈ జలపాతం చుట్టూ దట్టమైన కుంటాల రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. అయితే ఇప్పటివరకు జలపాతం జలధారతో ఉట్టిపడింది. ఇప్పుడు వర్షాలు లేక జలధార బోసిపోయి కనిపిస్తుంది. అయినప్పటికీ పర్యాటకుల తాకిడి తగ్గడంలేదు. జలపాతం అందాలను ఆస్వాదించి వెనుదిరుగుతున్నారు. సముతుల గుండం వర్షాకాలంలో ప్రకృతితో పరశించిపోతున్న సుముతుల గుండం జలపాతం కుమురం భీం జిల్లా నుంచి 26కిలో మీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో కలదు. జిల్లా నుంచి వాహనాలు బలంపూర్ 21కిలో మీటర్ల వరకు రోడ్డు సౌకర్యాల కలదు. మిగతా 5కిలో మీటర్ల వరకు దట్టమైన అడవి పెద్ద పెద్ద రాళ్లు మధ్యలో కాలినకతో వెళ్లాల్సి వస్తోంది. ఆసిఫాబాద్ మండలంలోని ఏకైక జలపాతానికి సంబంధిత అధికారులు రోడ్డు సౌకర్యం కల్పిస్తే ప్రకృతి ప్రేమికులతో పాటు సందర్శకులను ఇట్టే ఆకర్షిస్తోందని స్థానికులు అంటున్నారు. వర్షాకాలంలో జలపాతం చుట్టు పచ్చని అటవితో పర్చుకుని నీరు జాలువారుతో అందరిని ఆకర్షిచే విధంగా ఈ జలపాతం ఉంది. -
కుంటాలపై వేలాడే వంతెన
సాక్షి, హైదరాబాద్: అంతెత్తు నుంచి జాలువారే జలపాతంలో చేతులుంచి నీటి సోయగాన్ని ఆస్వాదిస్తే? ఆ అనుభూతే వేరు. తెలంగాణలో ప్రధాన జలపాతమైన కుంటాల వద్ద ఈ ఆకర్షణ త్వరలోనే అందుబాటులోకి రానుంది. కుంటాల, బొగత జలపాతాల వద్ద వేలాడే వంతెనలు నిర్మించాలని పర్యాటక శాఖ నిర్ణయించింది. ప్రమాదాలకు తావు లేకుండా పర్యాటకులు సరక్షితంగా పద్ధతిలో నీటికి చేరువగా వెళ్లి ఆస్వాదించేలా వీటికి రూపకల్పన చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా లక్నవరంలో గతంలో వేలాడే వంతెన నిర్మించిన బెంగళూరు సంస్థే వీటినీ ఏర్పాటు చేయనుంది. గతేడాది భారీ వర్షాలు పడటంతోడీ జలపాతాలకు పర్యాటకులు పోటెత్తడం తెలిసిందే. కొందరు అత్యుత్సాహంతో నీళ్లు పడే చోటకు వెళ్లి జారి పడిపోవటం, దిగువన మడుగులో ఈతకు వెళ్లి చిక్కుకుని చనిపోవడం వంటి దుర్ఘటనలు జరిగాయి. సరైన రక్షణ చర్యలు లేకపోవడమే ఇందుకు కారణమన్న విమర్శలు విన్పించాయి. దాంతో వచ్చే వానాకాలంలో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలని పర్యాటక శాఖ నిర్ణయించింది. శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం మంగళవారం అటవీ శాఖ ముఖ్య సంరక్షణ అధికారి ఝా, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో కలిసి కుంతాలను పరిశీలించారు. జలపాతానికి చేరువగా... ప్రస్తుతం పర్యాటకులు కుంతాల జలపాతాన్ని దూరం నుంచే చూసి ఆనందిస్తున్నారు. కుంటాల వద్ద ఉన్న రెండు జలపాతాలకు రెండు వంతెనలు పరస్పర అనుసంధానంతో ఏర్పాటవుతాయి. వాటిపైకి ఎక్కి జలపాతానికి అతి చేరువగా వెళ్లి అక్కడి ప్లాట్‌ఫామ్‌పై నిలబడి నీటి పరవళ్లను దగ్గరి నుంచి చూసేందుకు వీలవుతుంది. రెండో జలపాతాన్ని చూశాక మరోవైపు నుంచి దిగువకు వచ్చేలా ఏర్పాటు చేస్తారు. జలపాతం నీళ్లు నిలిచే చోట అడుగుభాగంలో ఉన్న మడుగులు సుడిగుండాల తరహాలో ప్రాణాలను హరిస్తున్నాయి. తొలుత వాటిని మూసేయాలని భావించారు. కానీ ఎండా కాలంలో నీటి ప్రవాహం లేని సమయంలో వాటి వద్ద పూజాదికాలు చేసే పద్ధతి అనాదిగా ఉన్నందున పూడ్చడం సరికాదని స్థానిక గిరిజన పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో వంతెనల ఆలోచన తెరపైకి వచ్చింది. మంగళవారం బెంగళూరు సంస్థ ప్రతినిధులు కూడా అధికారుల వెంట వచ్చి కొలతలు తీసుకున్నారు. వంతెనల నమూనాను వారంలో సిద్ధం చేసి డీపీఆర్ సమర్పిస్తారు. దానికి ఆమోదం లభించగానే పనులు ప్రారంభిస్తామని, వానాకాలం నాటికి వంతెన సిద్ధమవుతుందని అధికారులు చెబుతున్నారు. తొలుత కుంటాల వద్ద, ఆ తర్వాత బొగత వద్ద వంతెన ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. -
కుంటాల అందాలకు కుఫ్టి జలాలు
సాక్షి, హైదరాబాద్: గోదావరి ఉపనది అయిన కడెం నదీ జలాలను వినియోగంలోకి తీసుకొచ్చేలా మరో రిజర్వాయర్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ, ఇచ్చోడ మండలాల మధ్య కుఫ్టి గ్రామం వద్ద రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కడెం ప్రాజెక్టు కింది ఆయకట్టు స్థిరీకరణతో పాటు అవసరమైనపుడు కుంటాల జలపాతానికి నీరు విడుదల చేసేలా ప్రాజెక్టును రూపొందించారు. 5.32 టీఎంసీల సామర్థ్యంతో రూ.744 కోట్లతో రిజర్వాయర్ నిర్మించనున్నారు. ప్రాజెక్టు పనులు ముమ్మరం చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో కేబినెట్ నోట్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. బడ్జెట్ సమావేశాలకు ముందు జరిగే కేబినెట్ భేటీలో దీన్ని ఆమోదించే అవకాశం ఉంది. 7 టీఎంసీలే వినియోగం.. కడెం నదిపై ఆదిలాబాద్ జిల్లాలో కడెం ప్రాజెక్టు నిర్మించిన విషయం తెలిసిందే. దీనికి 13.42 టీఎంసీల నీటి కేటాయింపులుండగా 7.2 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో 4 టీఎంసీలే వాడుకుంటుండగా మిగతా 3 టీఎంసీలు డెడ్ స్టోరేజీగా ఉంది. ఆ 4 టీఎంసీలతో 68,150 ఎకరాలకు నీరివ్వాలనే లక్ష్యం ఉన్నా ఆశించిన మేర అందడం లేదు. అదీగాక వరద ఉన్న ఒక్క సీజన్లోనే పంటలకు నీరందుతోంది. నీటి నిల్వ పెంచేందుకు కడెం ప్రాజెక్టు ఎత్తు పెంచితే అటవీ భూములు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. దీనికి తోడు ఎత్తు పెంపు పనులు పూర్తయ్యే వరకు నాలుగైదేళ్లు పంటలు వేసుకునే అవకాశం ఉండదు. మరోవైపు మొత్తం కేటాయింపుల్లో 6.22 టీఎంసీల నీటి వినియోగమే లేదు. ఈ నేపథ్యంలోనే కుఫ్టి రిజర్వాయర్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బోథ్‌లో 30 వేల ఎకరాలకు నీరు.. ఆదిలాబాద్ జిల్లాలో నేరడిగొండ, ఇచ్చోడ మండలాల పరిధిలో సహజసిద్ధంగా ఉన్న 2 కొండల మధ్య నుంచి కడెం వాగు ప్రవహిస్తుంటుంది. ఈ కొండలను కలుపుతూ ఆనకట్ట నిర్మిస్తే 6.22 టీఎంసీల నీటిని వినియోగంలోకి తీసుకురావొచ్చని ప్రభుత్వం తొలుత అంచనా వేసింది. దీనిపై సర్వే నిర్వహించగా 5.32 టీఎంసీలతో ప్రాజెక్టు నిర్మించవచ్చని తేలింది. అలాగే కుఫ్టిని కడెం ప్రాజెక్టుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా వాడుకుంటూ బోథ్ నియోజకవర్గంలో 30 వేల ఎకరాలకూ నీరిచ్చే అవకాశం ఉంటుంది. అవసరమైనపుడు కుంటా లకు కూడా నీరు విడుదల చేయొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆదిలాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా ప్రాజెక్టు పనులను వీలైనంతర త్వరగా ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు. -
కుంటాల జలపాతంలో ఒకరు గల్లంతు
నేరడిగొండ : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుంటాల జలపాతంలో ఒకరు గల్లంతయ్యారు. కుంటాల జలపాతం అందాలను తిలకించేందుకు ఆదివారం సాయంత్రం నిజామాబాద్ నుంచి ఏడుగురు మిత్రబృందంతో కలిసి వచ్చారు. ప్రకృతి అందాలను వీక్షించారు. ఈ క్రమంలో కుంటాల జలపాతం వద్ద స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు రుద్రవరం వినయ్(31) గల్లంతయ్యాడు. మిగతా మిత్రులు తేరుకునే లోపే ఆయన కనిపించకుండా పోయాడు. నిజామాబాద్ జిల్లా ఎల్లమ్మగుట్టకు చెందిన వినయ్ బుక్‌స్టాల్ నడుపుతూ జీవనం కొనసాగిస్తుండే వాడని అతడి మిత్రులు తెలిపారు. కాగా జలపాతం వద్ద జాలువారే అందాలను తిలకించడానికి వచ్చి జలపాతంలో గల్లంతయ్యాడు. మిగతా స్నేహితులు ఆందోళనకు గురయ్యారు. రాత్రి కావడంతో జాలర్లు ఉదయం గాలిస్తామని తెలిపారు. జలపాతంలో అతడు గల్లంతయ్యాడా.. లేక మిత్రులే తోసేశారా అనే అనుమానలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై ఏఎస్సై దశరథ్ను సంప్రదించగా.. వారు వివరాలు తెలపడానికి నిరాకరించారు.