సాక్షి, హైదరాబాద్: గోదావరి ఉపనది అయిన కడెం నదీ జలాలను వినియోగంలోకి తీసుకొచ్చేలా మరో రిజర్వాయర్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ, ఇచ్చోడ మండలాల మధ్య కుఫ్టి గ్రామం వద్ద రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కడెం ప్రాజెక్టు కింది ఆయకట్టు స్థిరీకరణతో పాటు అవసరమైనపుడు కుంటాల జలపాతానికి నీరు విడుదల చేసేలా ప్రాజెక్టును రూపొందించారు. 5.32 టీఎంసీల సామర్థ్యంతో రూ.744 కోట్లతో రిజర్వాయర్ నిర్మించనున్నారు. ప్రాజెక్టు పనులు ముమ్మరం చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో కేబినెట్ నోట్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. బడ్జెట్ సమావేశాలకు ముందు జరిగే కేబినెట్ భేటీలో దీన్ని ఆమోదించే అవకాశం ఉంది.
7 టీఎంసీలే వినియోగం..
కడెం నదిపై ఆదిలాబాద్ జిల్లాలో కడెం ప్రాజెక్టు నిర్మించిన విషయం తెలిసిందే. దీనికి 13.42 టీఎంసీల నీటి కేటాయింపులుండగా 7.2 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో 4 టీఎంసీలే వాడుకుంటుండగా మిగతా 3 టీఎంసీలు డెడ్ స్టోరేజీగా ఉంది. ఆ 4 టీఎంసీలతో 68,150 ఎకరాలకు నీరివ్వాలనే లక్ష్యం ఉన్నా ఆశించిన మేర అందడం లేదు. అదీగాక వరద ఉన్న ఒక్క సీజన్‌లోనే పంటలకు నీరందుతోంది. నీటి నిల్వ పెంచేందుకు కడెం ప్రాజెక్టు ఎత్తు పెంచితే అటవీ భూములు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. దీనికి తోడు ఎత్తు పెంపు పనులు పూర్తయ్యే వరకు నాలుగైదేళ్లు పంటలు వేసుకునే అవకాశం ఉండదు. మరోవైపు మొత్తం కేటాయింపుల్లో 6.22 టీఎంసీల నీటి వినియోగమే లేదు. ఈ నేపథ్యంలోనే కుఫ్టి రిజర్వాయర్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
బోథ్‌లో 30 వేల ఎకరాలకు నీరు..
ఆదిలాబాద్ జిల్లాలో నేరడిగొండ, ఇచ్చోడ మండలాల పరిధిలో సహజసిద్ధంగా ఉన్న 2 కొండల మధ్య నుంచి కడెం వాగు ప్రవహిస్తుంటుంది. ఈ కొండలను కలుపుతూ ఆనకట్ట నిర్మిస్తే 6.22 టీఎంసీల నీటిని వినియోగంలోకి తీసుకురావొచ్చని ప్రభుత్వం తొలుత అంచనా వేసింది. దీనిపై సర్వే నిర్వహించగా 5.32 టీఎంసీలతో ప్రాజెక్టు నిర్మించవచ్చని తేలింది. అలాగే కుఫ్టిని కడెం ప్రాజెక్టుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా వాడుకుంటూ బోథ్ నియోజకవర్గంలో 30 వేల ఎకరాలకూ నీరిచ్చే అవకాశం ఉంటుంది. అవసరమైనపుడు కుంటా లకు కూడా నీరు విడుదల చేయొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆదిలాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా ప్రాజెక్టు పనులను వీలైనంతర త్వరగా ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
కుంటాల అందాలకు కుఫ్టి జలాలు
Published Thu, Mar 1 2018 3:33 AM | Last Updated on Wed, Aug 15 2018 9:04 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment