water relese
-
పోతిరెడ్డిపాడు నుంచి దిగువకు నీటి విడుదల
-
సాగర్ నీళ్లొచ్చేస్తున్నాయ్..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఎట్టకేలకు ప్రభుత్వం సాగర్ కుడికాలువకు తాగు, సాగు నీటి అవసరాల కోసం నీరు విడుదల చేసింది. ఎగువ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసి ఇప్పటికే శ్రీశైలం జలాశయం నిండింది. నాగార్జున సాగర్‌కు సైతం పూర్తి స్థాయిలో నీరు చేరింది. దీంతో కుడికాలువ పరిధిలో గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ నీరు గుంటూరు జిల్లా పరిధిలోని బుగ్గవాగుకు చేరింది. అక్కడి నుంచి శుక్రవారం ఉదయానికి ప్రకాశం జిల్లా సరిహద్దుకు చేరనుంది. జిల్లాకు 3వేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు పేర్కొంటున్నారు. తొలుత గుండ్లకమ్మ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయనున్నారు. గుండ్లకమ్మలో 3 టీఎంసీలనిల్వకు అవకాశం.. 3.875 టీఎంసీలు సామర్థ్యం కలిగిన గుండ్లకమ్మలో 3 టీఎంసీలకు పైగా నీటిని నిల్వ చేసే అవకాశం ఉంది. అనంతరం రామతీర్థం రిజర్వాయర్‌లో నీటిని నిల్వ చేస్తారు. ఆ తర్వాత ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయనున్నారు. పిబ్రవరి నెల వరకు నీటి విడుదల ఉంటుంది. సాగర్ కుడికాలువ పరిధిలో ప్రకాశం జిల్లాలో 4,37,330 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో 1,85,046 ఎకరాలు మాగాణి భూములు ఉండగా 2,49,283 ఎకరాలు ఆరుతడి పంటలు పండే భూములు ఉన్నాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో వరిపంటకు సాగునీరు ఇవ్వడంఇదే తొలిసారి. గత ఏడాది సైతం ఎగువన కురిసిన వర్షాలతో నాగార్జున సాగర్ జలాశయంలో 580 అడుగుల మేర నీరు చేరినా కుడికాలువ పరిధిలో ఆయకట్టుకు ప్రభుత్వం సాగునీరు విడుదల చేయలేదు. దీంతో నాలుగేళ్లుగా సాగర్ రైతాంగం పంటలు లేక పొలాలు బీళ్లుగా పెట్టుకుని ఎదురు చూపులు చూడాల్సి వచ్చింది. తిండిగింజలు, పశువుల మేత గోదావరి జిల్లాల నుంచి కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు సాగర్‌నీటిని విడుదల చేయడంతో జిల్లా రైతాంగం హర్షం వ్యంక్తం చేస్తోంది. రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే అద్దంకి, దర్శి, పర్చూరు, సంతనూతలపాడు ప్రాంతాల్లో బోరుబావి వసతి ఉన్న రైతాంగం వరినార్లు పోసి సిద్ధంగా ఉన్నారు. నీరు చేరిన వెంటనే నాట్లు వేసే అవకాశం ఉంది. -
కుంటాల అందాలకు కుఫ్టి జలాలు
సాక్షి, హైదరాబాద్: గోదావరి ఉపనది అయిన కడెం నదీ జలాలను వినియోగంలోకి తీసుకొచ్చేలా మరో రిజర్వాయర్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ, ఇచ్చోడ మండలాల మధ్య కుఫ్టి గ్రామం వద్ద రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కడెం ప్రాజెక్టు కింది ఆయకట్టు స్థిరీకరణతో పాటు అవసరమైనపుడు కుంటాల జలపాతానికి నీరు విడుదల చేసేలా ప్రాజెక్టును రూపొందించారు. 5.32 టీఎంసీల సామర్థ్యంతో రూ.744 కోట్లతో రిజర్వాయర్ నిర్మించనున్నారు. ప్రాజెక్టు పనులు ముమ్మరం చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో కేబినెట్ నోట్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. బడ్జెట్ సమావేశాలకు ముందు జరిగే కేబినెట్ భేటీలో దీన్ని ఆమోదించే అవకాశం ఉంది. 7 టీఎంసీలే వినియోగం.. కడెం నదిపై ఆదిలాబాద్ జిల్లాలో కడెం ప్రాజెక్టు నిర్మించిన విషయం తెలిసిందే. దీనికి 13.42 టీఎంసీల నీటి కేటాయింపులుండగా 7.2 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో 4 టీఎంసీలే వాడుకుంటుండగా మిగతా 3 టీఎంసీలు డెడ్ స్టోరేజీగా ఉంది. ఆ 4 టీఎంసీలతో 68,150 ఎకరాలకు నీరివ్వాలనే లక్ష్యం ఉన్నా ఆశించిన మేర అందడం లేదు. అదీగాక వరద ఉన్న ఒక్క సీజన్లోనే పంటలకు నీరందుతోంది. నీటి నిల్వ పెంచేందుకు కడెం ప్రాజెక్టు ఎత్తు పెంచితే అటవీ భూములు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. దీనికి తోడు ఎత్తు పెంపు పనులు పూర్తయ్యే వరకు నాలుగైదేళ్లు పంటలు వేసుకునే అవకాశం ఉండదు. మరోవైపు మొత్తం కేటాయింపుల్లో 6.22 టీఎంసీల నీటి వినియోగమే లేదు. ఈ నేపథ్యంలోనే కుఫ్టి రిజర్వాయర్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బోథ్‌లో 30 వేల ఎకరాలకు నీరు.. ఆదిలాబాద్ జిల్లాలో నేరడిగొండ, ఇచ్చోడ మండలాల పరిధిలో సహజసిద్ధంగా ఉన్న 2 కొండల మధ్య నుంచి కడెం వాగు ప్రవహిస్తుంటుంది. ఈ కొండలను కలుపుతూ ఆనకట్ట నిర్మిస్తే 6.22 టీఎంసీల నీటిని వినియోగంలోకి తీసుకురావొచ్చని ప్రభుత్వం తొలుత అంచనా వేసింది. దీనిపై సర్వే నిర్వహించగా 5.32 టీఎంసీలతో ప్రాజెక్టు నిర్మించవచ్చని తేలింది. అలాగే కుఫ్టిని కడెం ప్రాజెక్టుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా వాడుకుంటూ బోథ్ నియోజకవర్గంలో 30 వేల ఎకరాలకూ నీరిచ్చే అవకాశం ఉంటుంది. అవసరమైనపుడు కుంటా లకు కూడా నీరు విడుదల చేయొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆదిలాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా ప్రాజెక్టు పనులను వీలైనంతర త్వరగా ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు. -
సింగూరు నుంచి ఎస్సారెస్పీకి 15 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: సింగూరు ప్రాజెక్టు నుంచి శ్రీరాంసాగర్‌కు 15 టీఎంసీల నీటిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దిగువన ఎస్సారెస్పీతోపాటు నిజాంసాగర్ కింద తాగు, సాగు అవసరాల కోసం వెంటనే నీటిని విడుదల చేయాలని గురువారం అధికారులను ఆదేశించింది. ఈ మేరకు వీలైనంత త్వరగా సింగూరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. ఈ ఏడాది యాసంగిలో సింగూరు, నిజాంసాగర్, ఎస్సారెస్పీల కింద నీటి అవసరాలపై ప్రభుత్వం ఇప్పటికే లెక్కలు సిద్ధం చేసింది. మిషన్ భగీరథ అవసరాలు, నీటి సరఫరా, ఆవిరి నష్టాలు, కనీస మట్టాలకు పైన ఉండే లభ్యత నీటితో ఎంతమేర సాగుకు నీరు ఇవ్వవచ్చన్న అంశాలపై యాసంగి ప్రణాళిక ఖరారు చేశారు. ఎస్సారెస్పీలో లోటుతో.. ఎస్సారెస్పీ నీటినిల్వ సామర్థ్యం 90.31 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 54.36 టీఎంసీలు ఉన్నాయి. మిగతా 35.35 టీఎంసీల లోటు ఉంది. అయితే ఇక్కడి అవసరాలను దృష్టిలో పెట్టుకుని సింగూరు నుంచి 15 టీఎంసీల మేర విడుదల చేయాలని నిర్ణయించారు. ఇందులో ఐదు టీఎంసీల మేర నిజాంసాగర్‌లో నిల్వ చేసి.. మిగతా 10 టీఎంసీలను ఎస్సారెస్పీకి తరలిస్తారు. దీంతో ఎస్సారెస్పీలో లభ్యత జలాలు 64.36 టీఎంసీలకు చేరుతాయి. ఇక ఎస్సారెస్పీ నుంచి లోయర్‌మానేర్ డ్యామ్ (ఎల్ఎండీ)కు కాకతీయ కెనాల్ ద్వారా 15 టీఎంసీలు విడుదల చేయాలని, మిషన్ భగీరథ అవసరాలకు 12.6 టీఎంసీలను వినియోగించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. మొత్తంగా ఎస్సారెస్పీలో సుమారుగా 38.41 టీఎంసీల నీరు మిగులుతుంది. ఈ నీటినీ ఆన్‌అండ్‌ఆఫ్ పద్ధతిన 5.60 లక్షల ఎకరాలకు అందిస్తారు. ఇందులో ఎల్ఎండీ ఎగువన 4 లక్షల ఎకరాలు, ఎల్ఎండీ దిగువన 1.60 లక్షల ఎకరాలకు సాగు నీరందనుంది. సింగూరు కింద 1.5 లక్షల ఎకరాలకు శ్రీరాంసాగర్‌కు తరలించే 15 టీఎంసీలుపోగా.. సింగూరులో సుమారు 14.5 టీఎంసీల నీరు ఉంటుంది. ఇందులో 5.7 టీఎంసీలను తాగు అవసరాలకు కేటాయించి, మరో టీఎంసీలతో ప్రాజెక్టు కింది 30 వేల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే అవకాశముంది. ఇక నిజాంసాగర్‌లో ప్రస్తుతం 12.93 టీఎంసీల నీరుండగా.. సింగూరు నుంచి వచ్చే 5 టీఎంసీలతో కలసి 18 టీఎంసీల లభ్యత ఉండనుంది. ఇందులో తాగునీటికి 3 టీఎంసీలు పక్కనపెట్టి.. మిగతా 15 టీఎంసీలతో 1.50 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే అవకాశముంది. -
జీడీపీ ఆయకట్టుకు నేటి నుంచి నీటి విడుదల
కర్నూలు(సిటీ): గాజులదిన్నె ప్రాజెక్టు కింద ఈ ఖరీఫ్‌లో సాగు చేసిన ఆయకట్టును కాపాడేందుకు నేటి నుంచి నీటిని విడుదల చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ జలవనరుల శాఖ ఇంజనీర్లకు ఆదేశాలు ఇచ్చారు. జీడీపీ కింద ప్రస్తుత ఖరీఫ్‌లో 14 ఎకరాలకు పైగా ఆయకట్టు సాగయింది. గూడూరు, సి.బెళగల్, కోడుమూరు, కష్ణగిరి, గోనెగండ్ల మండలాలకు చెందిన రైతులు పత్తి, మిరప తదితర పంటలను సాగు చేశారు. వర్షాలు కురవకపోవడంతో ఈ పంటలు ఎండుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయకట్టుదారుల నుంచి కాల్వలకు సాగునీరు ఇవ్వాలని అధికారులపై ఒత్తిళ్లు పెరిగాయి. సాధాసాధ్యాలను పరిశీలించిన జలవనరుల శాఖ అధికారులు ప్రస్తుతం జీడీపీలో ఉన్న నీటి నిల్వలు తదితర వివరాలపై జిల్లా కలెక్టర్‌కు నివేదికను అందజేశారు. దీనిపై శుక్రవారం రాత్రి కలెక్టర్ ఎస్ఈ చంద్రశేఖర్‌రావుతో చర్చించిన అనంతరం కుడి, ఎడమ కాల్వలకు రోజుకు 75 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదలకు ఆదేశించారు. జీడీపీ పూర్తిస్థాయి నీటిమట్టం 4.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.8 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇందులో ఆయకట్టుకు 3.2 టీఎంసీ వాడుకునే వీలున్నట్లు అధికారులు చెబుతున్నారు.