జీడీపీ ఆయకట్టుకు నేటి నుంచి నీటి విడుదల
కర్నూలు(సిటీ): గాజులదిన్నె ప్రాజెక్టు కింద ఈ ఖరీఫ్‌లో సాగు చేసిన ఆయకట్టును కాపాడేందుకు నేటి నుంచి నీటిని విడుదల చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ జలవనరుల శాఖ ఇంజనీర్లకు ఆదేశాలు ఇచ్చారు. జీడీపీ కింద ప్రస్తుత ఖరీఫ్‌లో 14 ఎకరాలకు పైగా ఆయకట్టు సాగయింది. గూడూరు, సి.బెళగల్, కోడుమూరు, కష్ణగిరి, గోనెగండ్ల మండలాలకు చెందిన రైతులు పత్తి, మిరప తదితర పంటలను సాగు చేశారు. వర్షాలు కురవకపోవడంతో ఈ పంటలు ఎండుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయకట్టుదారుల నుంచి కాల్వలకు సాగునీరు ఇవ్వాలని అధికారులపై ఒత్తిళ్లు పెరిగాయి. సాధాసాధ్యాలను పరిశీలించిన జలవనరుల శాఖ అధికారులు ప్రస్తుతం జీడీపీలో ఉన్న నీటి నిల్వలు తదితర వివరాలపై జిల్లా కలెక్టర్‌కు నివేదికను అందజేశారు. దీనిపై శుక్రవారం రాత్రి కలెక్టర్ ఎస్‌ఈ చంద్రశేఖర్‌రావుతో చర్చించిన అనంతరం కుడి, ఎడమ కాల్వలకు రోజుకు 75 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదలకు ఆదేశించారు. జీడీపీ పూర్తిస్థాయి నీటిమట్టం 4.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.8 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇందులో ఆయకట్టుకు 3.2 టీఎంసీ వాడుకునే వీలున్నట్లు అధికారులు చెబుతున్నారు.