గోదావరిపై సర్కారు ప్రత్యేక దృష్టి | Special vision to Godavari govt | Sakshi
Sakshi News home page

గోదావరిపై సర్కారు ప్రత్యేక దృష్టి

Published Mon, Oct 12 2015 2:49 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

గోదావరిపై సర్కారు ప్రత్యేక దృష్టి - Sakshi

గోదావరిపై సర్కారు ప్రత్యేక దృష్టి

- పూర్తి వాటా వినియోగంపై ప్రణాళికలు
 - నీటి లభ్యత ప్రాంతాలు, మళ్లింపునకు అనువైన ప్రదేశాల పరిశీలన
- మేడిగడ్డ నుంచే ప్రాణహిత నీటిని తీసుకోవాలని సూత్రప్రాయ నిర్ణయం
- వ్యాప్కోస్ ప్రతినిధులతో సీఎం సుదీర్ఘ సమీక్ష
 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి వర ప్రదాయణిగా ఉన్న గోదావరి నదిలో జలాల లభ్యత పుష్కలంగా ఉన్న ప్రాంతాలు, అలాగే నీటి మళ్లింపునకు అనువుగా ఉన్న ప్రదేశాల గుర్తింపుపై ప్రభుత్వం తన కసరత్తును తీవ్రం చేసింది. గోదావరి జలాల్లో రాష్ట్రానికి ఉన్న 950 టీఎంసీల మేర నీటి వాటాను పూర్తిగా వినియోగంలోకి తెచ్చే ప్రణాళికలకు తుదిరూపునిస్తోంది. నదీ పరీవాహకంలోని ఉపనదుల్లో ఏ ప్రాంతంలో నీటి లభ్యత పుష్కలంగా ఉంది, ఏటా సగటు వర్షపాతం ఎంత, గ్రావిటీ ద్వారా నీరు వచ్చే అవకాశాలు ఏమిటి.. అన్న అంశాలపై లోతైన అధ్యయనం చేసి, ప్రాజెక్టుల నిర్మాణంపై ఓ అంచనాకు రావాలని భావిస్తోంది.
 
 ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం, గోదావరిపై అత్యాధునిక పద్ధతిలో లైడార్ సర్వే చేస్తున్న వ్యాప్కోస్ సంస్థ ప్రతినిధులతో సుదీర్ఘంగా సమీక్ష జరిపారు. ప్రాణహిత రీ ఇంజనీరింగ్‌లో భాగంగా కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లి మార్గాల్లో చేసిన లైడార్ సర్వే వివరాలను తెలుసుకున్నారు. ప్రాణహిత నీటిని మేడిగడ్డ ప్రాంతం నుంచే తీసుకోవాలని ఈ సమీక్షలో ముఖ్యమంత్రి సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. దీంతోపాటే మొదటి డిజైన్ ప్రకారం తుమ్మిడిహెట్టి వద్ద ఏ ఎత్తులో బ్యారేజీ నిర్మించాలన్నదానిపై మహారాష్ట్రతో చర్చలు జరిపి త్వరగా తుదినిర్ణయానికి రావాలని సీఎం అధికారులను ఆదేశించినట్లు సమాచారం. అలాగే కొత్తగా తెరపైకి వచ్చిన ఇచ్చంపల్లి ప్రాంతంలో నీటి లభ్యత, ఇతర బ్యారేజీల నిర్మాణంైపై వ్యాప్కోస్ ప్రతినిధి శంభూ ఆజాద్, ఇతర అధికారులతో చర్చించారు. ఇదే సమయంలో ప్రాణహిత మొదలు దుమ్ముగూడెం వరకు నిర్మించదలచిన బ్యారేజీలపై మ్యాపులు, టోపొగ్రఫిక్ షీట్ల ఆధారంగా చర్చించినట్లు తెలుస్తోంది.
 
 ప్రాణహితలో భాగంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీకి 70 కిలోమీటర్ల దిగువన వేమునిపల్లి వద్ద బ్యారేజీ నిర్మాణంపై చర్చ జరిగినట్లుగా సమాచారం. కాగా, దుమ్ముగూడెంలో భాగంగా గొల్లపాడు, బయ్యారంల వద్ద బ్యారేజీలు నిర్మించి ఇందిరాసాగర్ ప్రాజెక్టుకు నీటిని మళ్లించే విషయమై సర్వే చేయాలని సీఎం వ్యాప్కోస్‌ను కోరారని తెలిసింది. దీంతో పాటే కాళేశ్వరం నుంచి నిజాంసాగర్‌కు నీటిని తెచ్చే మార్గాల్లో రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు, కొత్త రిజర్వాయర్ల నిర్మాణం, వాటి మార్గాల్లో ఉన్న పరిస్థితులపై కూలంకషంగా చర్చించినట్లు చెబుతున్నారు.
 
 టెక్రా వద్ద నీటి లభ్యతపై ఆరా..
 ఈ సమీక్షలో ప్రాణహిత, ఇంద్రావతిల్లో నీటి లభ్యత, వీటి పరీవాహకంలో ఈ ఏడాది కురిసిన వర్షపాతాలపై క్షుణ్ణంగా చర్చించినట్లుగా తెలిసింది. ఈ ఏడాది గోదావరి బేసిన్‌లో సమృద్ధిగా వర్షాలు లేనందున నీటి లభ్యత తగ్గిన అంశంపైనా చర్చ జరిగినట్లు చెబుతున్నారు. ఇదే సందర్భంలో మహారాష్ట్రలోని టెక్రా ప్రాంతం వద్ద ప్రాణహిత నీటి లభ్యతపై ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. టెక్రా వద్ద వాటర్ లెవెల్ ఎలా ఉంటుంది, డిశ్చార్జి ఎంత, దిగువకు ప్రవాహాలు ఏ స్థాయిలో ఉంటాయనే అంశాలపై కూడా ఆరా తీసినట్లు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement