New reservoir
-
తుంగభద్రపై కర్ణాటక కొత్త ఎత్తులు!
సాక్షి, హైదరాబాద్: తుంగభద్రనదిపై మరో బ్యారేజీ నిర్మాణానికి కర్ణాటక ఎత్తులు వేస్తోంది. డ్యామ్‌లో పూడిక వల్ల జరుగుతున్న నష్టాన్ని పూడ్చేందుకుగాను కొత్త రిజర్వాయర్ నిర్మాణానికి సిద్ధమైంది. 31 టీఎంసీల సామర్థ్యంతో తుంగభద్రకు ఎగువన నవాలి ప్రాంతంలో నిర్మించే కొత్త రిజర్వాయర్‌పై కర్ణాటక తుంగభద్ర బోర్డు అనుమతి కోరింది. దీనిపై అభిప్రాయాలు చెప్పాలని తెలంగాణ, ఏపీలను బోర్డు కోరగా, ఆర్డీఎస్ ఎడమ కాల్వ కింద నీటి అవసరాలకు ఈ నిర్మాణం ఆటంకపరుస్తుందని తెలంగాణ స్పష్టం చేసింది. 52 టీఎంసీల కోసం కర్ణాటక ప్రతిపాదన తుంగభద్ర డ్యామ్‌లో గతంలో ఉన్న నీటినిల్వ సామర్థ్యంతో పోలిస్తే ప్రస్తుతం గణనీయంగా నిల్వ తగ్గింది. 1953లో డ్యామ్ ప్రారంభం సమయంలో 132 టీఎంసీల నీటి సామర్థ్యం ఉండగా ప్రస్తుతం 100 టీఎంసీలకు పడిపోయింది. ఈ నష్టాన్ని పూడ్చేలా దాదాపు 31 టీఎంసీల సామర్థ్యంలో నవాలి వద్ద రిజర్వాయర్ నిర్మించాలని కర్ణాటక నిర్ణయించింది. తుంగభద్ర కింద 212 టీఎంసీల నీటిని వినియోగించేకునేలా గత ట్రిబ్యునళ్లు అనుమతించినా, పూడికతో 172 టీఎంసీల నీటినే వినియోగిస్తున్నామని, కొత్త రిజర్వాయర్‌తో ఆ నష్టాన్ని పూడ్చుకునే అవకాశం ఉంటుందని గత డిసెంబర్లో హైదరాబాద్‌లో జరిగిన బోర్డు సమావేశంలో కర్ణాటక తెలిపింది. భారీవరద ఉన్నప్పుడు తుంగభద్ర నది నుంచి వరద కాల్వ తవ్వి, రోజుకు 17,900 క్యూసెక్కుల నీటిని కొత్త రిజర్వాయర్‌కు తరలిస్తామని, దీనికి అనుబంధంగానే శివపుర, విఠలపుర చెరువుల సామర్థ్యాన్ని పెంచుతామని, ఈ 3 రిజర్వాయర్ల కింద మొత్తంగా 52 టీఎంసీల నీటిని వినియోగిస్తామని ప్రతిపాదించింది. దిగువకు నష్టమే... నిర్మాణం చేపట్టబోయే రిజర్వాయర్ డీపీఆర్‌లు సమర్పిస్తే వాటిని పరిశీలించి అభిప్రాయాలు చెబుతామని తెలుగు రాష్ట్రాలు బోర్డుకు తెలిపాయి. అయినా ఇంతవరకు కర్ణాటక డీపీఆర్‌లు ఇవ్వలేదు. శనివారం బెంగళూరులో జరిగిన సమావేశంలో తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ సమర్థంగా రాష్ట్ర వాదనలను వినిపించినట్లు తెలిసింది. డీపీఆర్‌లతోపాటే ఎగువన తుంగ, భద్ర నదుల్లో కర్ణాటక చేస్తున్న నీటి వినియోగం, మరిన్ని ఎత్తిపోతల ద్వారా తీసుకుంటున్న నీటిలెక్కలను తమ ముం దుంచాలని స్పష్టం చేశారు. ఆర్డీఎస్ ఎడమ కాల్వ కింద తెలంగాణకు 15.9 టీఎంసీల మేర కేటాయింపులున్నా, 5 టీఎంసీలకు మించి నీరు రావట్లేదని బోర్డు దృష్టికి తెచ్చినట్లు సమాచారం. దీంతోపాటే ట్రిబ్యునల్ కేటాయింపులకు విఘా తం కలుగుతుందని బోర్డు దృష్టికి తెచ్చారు. తుంగభద్రసహా కొత్త బ్యారేజీ నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిర్ణీత వాటాలు వచ్చేలా చూస్తామని కచ్చితమైన హామీ ఇస్తేనే బ్యారేజీ నిర్మాణానికి సమ్మతి స్తామన్నారు. డీపీఆర్‌లు ఇచ్చాకే దీనిపై అభిప్రా యం చెబుతామని ఏపీ చెప్పినట్లుతెలిసింది. -
కుంటాల అందాలకు కుఫ్టి జలాలు
సాక్షి, హైదరాబాద్: గోదావరి ఉపనది అయిన కడెం నదీ జలాలను వినియోగంలోకి తీసుకొచ్చేలా మరో రిజర్వాయర్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ, ఇచ్చోడ మండలాల మధ్య కుఫ్టి గ్రామం వద్ద రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కడెం ప్రాజెక్టు కింది ఆయకట్టు స్థిరీకరణతో పాటు అవసరమైనపుడు కుంటాల జలపాతానికి నీరు విడుదల చేసేలా ప్రాజెక్టును రూపొందించారు. 5.32 టీఎంసీల సామర్థ్యంతో రూ.744 కోట్లతో రిజర్వాయర్ నిర్మించనున్నారు. ప్రాజెక్టు పనులు ముమ్మరం చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో కేబినెట్ నోట్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. బడ్జెట్ సమావేశాలకు ముందు జరిగే కేబినెట్ భేటీలో దీన్ని ఆమోదించే అవకాశం ఉంది. 7 టీఎంసీలే వినియోగం.. కడెం నదిపై ఆదిలాబాద్ జిల్లాలో కడెం ప్రాజెక్టు నిర్మించిన విషయం తెలిసిందే. దీనికి 13.42 టీఎంసీల నీటి కేటాయింపులుండగా 7.2 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో 4 టీఎంసీలే వాడుకుంటుండగా మిగతా 3 టీఎంసీలు డెడ్ స్టోరేజీగా ఉంది. ఆ 4 టీఎంసీలతో 68,150 ఎకరాలకు నీరివ్వాలనే లక్ష్యం ఉన్నా ఆశించిన మేర అందడం లేదు. అదీగాక వరద ఉన్న ఒక్క సీజన్లోనే పంటలకు నీరందుతోంది. నీటి నిల్వ పెంచేందుకు కడెం ప్రాజెక్టు ఎత్తు పెంచితే అటవీ భూములు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. దీనికి తోడు ఎత్తు పెంపు పనులు పూర్తయ్యే వరకు నాలుగైదేళ్లు పంటలు వేసుకునే అవకాశం ఉండదు. మరోవైపు మొత్తం కేటాయింపుల్లో 6.22 టీఎంసీల నీటి వినియోగమే లేదు. ఈ నేపథ్యంలోనే కుఫ్టి రిజర్వాయర్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బోథ్‌లో 30 వేల ఎకరాలకు నీరు.. ఆదిలాబాద్ జిల్లాలో నేరడిగొండ, ఇచ్చోడ మండలాల పరిధిలో సహజసిద్ధంగా ఉన్న 2 కొండల మధ్య నుంచి కడెం వాగు ప్రవహిస్తుంటుంది. ఈ కొండలను కలుపుతూ ఆనకట్ట నిర్మిస్తే 6.22 టీఎంసీల నీటిని వినియోగంలోకి తీసుకురావొచ్చని ప్రభుత్వం తొలుత అంచనా వేసింది. దీనిపై సర్వే నిర్వహించగా 5.32 టీఎంసీలతో ప్రాజెక్టు నిర్మించవచ్చని తేలింది. అలాగే కుఫ్టిని కడెం ప్రాజెక్టుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా వాడుకుంటూ బోథ్ నియోజకవర్గంలో 30 వేల ఎకరాలకూ నీరిచ్చే అవకాశం ఉంటుంది. అవసరమైనపుడు కుంటా లకు కూడా నీరు విడుదల చేయొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆదిలాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా ప్రాజెక్టు పనులను వీలైనంతర త్వరగా ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు. -
ఎట్టకేలకు ‘లింగంపల్లి’కి తుది రూపు
సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాలను వినియోగించుకునేందుకు చేపట్టిన దేవాదుల ప్రాజెక్టులో అదనపు నీటి నిల్వలు పెంచేందుకు కొత్త రిజర్వాయర్ నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. సీఎం కేసీఆర్ ఏడాదిన్నర కిందట చేసిన సూచనలకు అనుగుణంగా 10.78 టీఎంసీల సామర్థ్యంతో కొత్త రిజర్వాయర్‌ను నిర్మించే ప్రణాళికలు ఎట్టకేలకు కొలిక్కి వచ్చాయి. ప్రముఖ సర్వే సంస్థ వ్యాప్కోస్ సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను పునఃపరిశీలించిన నీటిపారుదలశాఖ... రూ. 3,672 కోట్లతో వరంగల్ జిల్లా ఘణపూర్ మండలం లింగంపల్లి వద్ద దీన్ని నిర్మించాలని నిర్ణయించింది. గోదావరికి వరద ఉండే మూడు నెలల కాలంలో ధర్మసాగర్ నుంచి నీటిని రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసేలా దీన్ని డిజైన్ చేసింది. ఈ రిజర్వాయర్‌తో 4,060 ఎకరాల మేర ముంపు ఉంటుందని తేల్చింది. నీటిని ఎత్తిపోసేందుకు 72 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని, ఏటా విద్యుత్ ఖర్చు రూ. 67.55 కోట్లు వరకు ఉంటుందని అంచనా వేసింది. రిజర్వాయర్‌ను రెండున్నరేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనిపై ప్రభుత్వం నుంచి పరిపాలనా అనుమతులు రాగానే టెండర్ల ప్రక్రియ మొదలు కానుంది. -
తిరువళ్లూరులో మరో జలాశయం
కొరుక్కుపేట: చెన్నై నగరంలో ఓ వైపు విద్యుత్ కష్టాలు విలయతాండం చేస్తుంటే మరో వైపు తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందుఆల ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో చెన్నై నగర వాసుల తాగునీటి కొరతను తీర్చే విధంగా ప్రభుత్వం మరో కొత్త రిజర్వాయర్‌ను నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా భూసేకరణను సైతం ప్రారంభించింది. చెన్నై నగరానికి సమీపంలోని తిరువళ్లూరు జిల్లాలో ఇప్పటికే పూండి రిజర్వాయర్ ఉండగా, దీని నుంచి నగరానికి తాగునీటిని సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. తిరువళ్లూరు జిల్లా రిజర్వాయర్ నిర్మాణానికి అనువైనదిగా గుర్తిం చగా, 90 శాతం భూసేకరణ పనులను సైతం అధికారులు సిద్ధం చేశారు. *330 కోట్లతో వాటర్ రిసోర్సెస్ విభా గం ఈ పనులను చేపట్టనుంది. తిరువళ్లూరు జిల్లాలోని కన్నన్‌కోటై గ్రామం, తెరవైకండిగై ప్రాంతాల మధ్య ఈ రిజ ర్వాయర్‌ను నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. 500 క్యూబిక్ ఫీట్ల నీటిని నిల్వ చేసి సామర్థ్యంతో ఈ రిజ ర్వాయర్‌ను నిర్మించనున్నారు. ఇందు లో భాగంగా రిజర్వాయర్ నిర్మాణానికి 1500 ఎకరాల భూమి అవసరం కాగా, 1350 ఎకరాల భూసేకరణ పనులను పూర్తి చేశారు. ఈ విషయంగా డబ్ల్యూఆర్చగ అధికారులు మాట్లాడుతూ చెన్నై మహానగర పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే పూండి జలాశయం సహా నాలుగు రిజర్వాయర్లు ఉన్నాయన్నారు. వీటితో పాటు అదనంగా ఐదో రిజర్వాయర్ అందుబాటులోకి వస్తే చెన్నై నగర ప్రజలు తాగునీటి కష్టాలు పూర్తిగా సమసిపోయే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ రిజర్వాయర్ 2015 ఏడాది మధ్య నాటికి అందుబాటులోకి రానుం దని వెల్లడించారు.