సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాలను వినియోగించుకునేందుకు చేపట్టిన దేవాదుల ప్రాజెక్టులో అదనపు నీటి నిల్వలు పెంచేందుకు కొత్త రిజర్వాయర్ నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. సీఎం కేసీఆర్ ఏడాదిన్నర కిందట చేసిన సూచనలకు అనుగుణంగా 10.78 టీఎంసీల సామర్థ్యంతో కొత్త రిజర్వాయర్‌ను నిర్మించే ప్రణాళికలు ఎట్టకేలకు కొలిక్కి వచ్చాయి. ప్రముఖ సర్వే సంస్థ వ్యాప్కోస్ సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను పునఃపరిశీలించిన నీటిపారుదలశాఖ... రూ. 3,672 కోట్లతో వరంగల్ జిల్లా ఘణపూర్ మండలం లింగంపల్లి వద్ద దీన్ని నిర్మించాలని నిర్ణయించింది.
గోదావరికి వరద ఉండే మూడు నెలల కాలంలో ధర్మసాగర్ నుంచి నీటిని రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసేలా దీన్ని డిజైన్ చేసింది. ఈ రిజర్వాయర్‌తో 4,060 ఎకరాల మేర ముంపు ఉంటుందని తేల్చింది. నీటిని ఎత్తిపోసేందుకు 72 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని, ఏటా విద్యుత్ ఖర్చు రూ. 67.55 కోట్లు వరకు ఉంటుందని అంచనా వేసింది. రిజర్వాయర్‌ను రెండున్నరేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనిపై ప్రభుత్వం నుంచి పరిపాలనా అనుమతులు రాగానే టెండర్ల ప్రక్రియ మొదలు కానుంది.
Comments
Please login to add a commentAdd a comment