కుంటాల జలపాతం
సాక్షి, హైదరాబాద్: అంతెత్తు నుంచి జాలువారే జలపాతంలో చేతులుంచి నీటి సోయగాన్ని ఆస్వాదిస్తే? ఆ అనుభూతే వేరు. తెలంగాణలో ప్రధాన జలపాతమైన కుంటాల వద్ద ఈ ఆకర్షణ త్వరలోనే అందుబాటులోకి రానుంది. కుంటాల, బొగత జలపాతాల వద్ద వేలాడే వంతెనలు నిర్మించాలని పర్యాటక శాఖ నిర్ణయించింది. ప్రమాదాలకు తావు లేకుండా పర్యాటకులు సరక్షితంగా పద్ధతిలో నీటికి చేరువగా వెళ్లి ఆస్వాదించేలా వీటికి రూపకల్పన చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా లక్నవరంలో గతంలో వేలాడే వంతెన నిర్మించిన బెంగళూరు సంస్థే వీటినీ ఏర్పాటు చేయనుంది.
గతేడాది భారీ వర్షాలు పడటంతోడీ జలపాతాలకు పర్యాటకులు పోటెత్తడం తెలిసిందే. కొందరు అత్యుత్సాహంతో నీళ్లు పడే చోటకు వెళ్లి జారి పడిపోవటం, దిగువన మడుగులో ఈతకు వెళ్లి చిక్కుకుని చనిపోవడం వంటి దుర్ఘటనలు జరిగాయి. సరైన రక్షణ చర్యలు లేకపోవడమే ఇందుకు కారణమన్న విమర్శలు విన్పించాయి. దాంతో వచ్చే వానాకాలంలో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలని పర్యాటక శాఖ నిర్ణయించింది. శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం మంగళవారం అటవీ శాఖ ముఖ్య సంరక్షణ అధికారి ఝా, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో కలిసి కుంతాలను పరిశీలించారు.
జలపాతానికి చేరువగా...
ప్రస్తుతం పర్యాటకులు కుంతాల జలపాతాన్ని దూరం నుంచే చూసి ఆనందిస్తున్నారు. కుంటాల వద్ద ఉన్న రెండు జలపాతాలకు రెండు వంతెనలు పరస్పర అనుసంధానంతో ఏర్పాటవుతాయి. వాటిపైకి ఎక్కి జలపాతానికి అతి చేరువగా వెళ్లి అక్కడి ప్లాట్‌ఫామ్‌పై నిలబడి నీటి పరవళ్లను దగ్గరి నుంచి చూసేందుకు వీలవుతుంది. రెండో జలపాతాన్ని చూశాక మరోవైపు నుంచి దిగువకు వచ్చేలా ఏర్పాటు చేస్తారు. జలపాతం నీళ్లు నిలిచే చోట అడుగుభాగంలో ఉన్న మడుగులు సుడిగుండాల తరహాలో ప్రాణాలను హరిస్తున్నాయి. తొలుత వాటిని మూసేయాలని భావించారు.
కానీ ఎండా కాలంలో నీటి ప్రవాహం లేని సమయంలో వాటి వద్ద పూజాదికాలు చేసే పద్ధతి అనాదిగా ఉన్నందున పూడ్చడం సరికాదని స్థానిక గిరిజన పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో వంతెనల ఆలోచన తెరపైకి వచ్చింది. మంగళవారం బెంగళూరు సంస్థ ప్రతినిధులు కూడా అధికారుల వెంట వచ్చి కొలతలు తీసుకున్నారు. వంతెనల నమూనాను వారంలో సిద్ధం చేసి డీపీఆర్ సమర్పిస్తారు. దానికి ఆమోదం లభించగానే పనులు ప్రారంభిస్తామని, వానాకాలం నాటికి వంతెన సిద్ధమవుతుందని అధికారులు చెబుతున్నారు. తొలుత కుంటాల వద్ద, ఆ తర్వాత బొగత వద్ద వంతెన ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment