పని కోసం వెళ్తూ పరలోకానికి.. | Vehicle Fell Down From Bridge Causes Death In Adilabad | Sakshi
Sakshi News home page

పని కోసం వెళ్తూ పరలోకానికి..

Published Sun, Jun 3 2018 6:52 AM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM

Vehicle Fell Down From Bridge Causes Death In Adilabad - Sakshi

మృతదేహాలను బయటకు తీస్తున్న స్థానికులు 

రెబ్బెన(ఆసిఫాబాద్‌) : పని నిమిత్తం వెళ్తున్న నలుగురు వ్యక్తులను మృత్యువు కబలించింది. ఈ సంఘటన శనివారం రెబ్బెన మండలంలోని గోలేటి పంచాయతీ పరిధిలోని సోనాపూర్‌ సమీపంలో చోటుచేసుకుంది. అతివేగంతో దూసుకువచ్చిన బోలెరో క్యాంపర్‌ వాహనం సోనాపూర్‌ వాగు బ్రిడ్జిపై నుంచి వాగులో పడటంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. బెల్లంపల్లి ఏరియాలోని కైరిగూడ ఓసీపీలో ఓబీ కాంట్రాక్టు పనులు చేపడుతున్న డీబీఎల్‌ సంస్థ వద్ద మరో సంస్థ సబ్‌ కాంట్రాక్టు పనులు చేపడుతోంది. సంస్థకు చెందిన మిషనరీ మరమ్మతు పనుల కోసం రామగుండం పరిధిలోని ఎన్‌టీపీసీకి చెందిన మెకానిక్‌లు బల్ల కోటేశ్వర్‌రావు( 53), చిరకాల చరణ్‌కుమార్‌(35)తోపాటు మరో మెకానిక్‌ మంచిర్యాలకు చెందిన విశ్వనాథపల్లి దుర్గారావు(48)లను పిలిపించారు.

ఇందులో భాగంగా మెకానిక్‌లను తీసుకువచ్చే పనిని సంస్థలో డ్రైవర్‌గా పనిచేసే జార్ఖండ్‌ రాష్ట్రంలోని ధన్‌బాద్‌కు చెందిన మహ్మద్‌ ఇయాజ్‌ఖాన్‌(34)కు అప్పగించారు. శనివారం ఇయాజ్‌ఖాన్‌ ఎంహెచ్‌ 34 ఏవీ 1618 నంబర్‌ గల బోలెరో కాంపర్‌ వాహనంతో ఎన్‌టీపీసీకి చేరుకుని కోటేశ్వర్‌రావు, చరణ్‌కుమార్‌లతోపాటు దుర్గారావును ఎక్కించుకుని కైరిగూడకు బయలుదేరారు. అయితే మార్గమధ్యంలోని సోనాపూర్‌ సమీపంలో వాగు వద్ద ఒక్కసారి వాహనం దూసుకుపోయి బ్రిడ్జిని బలంగా ఢీకొట్టి వాగులో బోల్తాపడింది. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. 

లారీ డ్రైవర్ల ద్వారా ప్రమాద సమాచారం
సోనాపూర్‌ వాగులో బోలెరో వాహనం బోల్తాపడిన సమయంలో ప్రత్యక్షంగా ఎవరు చూడకపోయిన ప్రమాదం జరిగిన కాసేపటికి గోలేటి నుంచి కైరిగూడ వైపు వెళ్తున్న లారీ డ్రైవర్లు వాగులో బోల్తాపడిన వాహనాన్ని గమనించి  కైరిగూడ ఓసీపీ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన సింగరేణి అధికారులు పోలీస్‌శాఖకు, సింగరేణి ఎస్‌అండ్‌పీసీకి సమాచారం అందించారు. ఇరుశాఖలు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని వాహనాన్ని పరిశీలించగా అప్పటికే అందులోని వ్యక్తులు మృతి చెంది వాహనంలోనే ఇరుక్కుపోయారు. ఎస్సై శివకుమార్, కైరిగూడ ప్రాజెక్టు అధికారి మోహన్‌రెడ్డితోపాటు ఎస్‌అండ్‌పీసీ సిబ్బంది. స్థానికులు సుమారు అరగంట పాటు శ్రమించి మృతదేహాలను వాహనం నుంచి బయటకి తీయగలిగారు. గోలేటి సింగరేణి డిస్పెన్సరీ రవికుమార్‌ మృతదేహాలను వైద్యపరీక్షలు నిర్వహించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. వెంటనే మృతదేహాలను పోర్టుమార్టం నిమిత్తం బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదంపై ఆర్టీవో అధికారుల దర్యాప్తు
సోనాపూర్‌ వాగులో వాహనం బోల్తాపడి నలు గురు వ్యక్తులు మృతి చెందిన ఘటనపై జిల్లా రవా ణా శాఖాధికారి అజ్మీరశ్యాంనాయక్‌ దర్యాప్తు చేపట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఆయన రోడ్డు ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు. ముందుగా వాహనం రోడ్డు దిగిన ప్రదేశంతోపాటు బ్రిడ్డిని ఢీకొట్టిన ప్రదేశాన్ని పరిశీలించారు. డ్రైవర్‌ అతివేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. అతి వేగంతో వాహనాన్ని తొలుతున్న క్రమంలో బ్రిడ్జీ వద్దకు రాగానే ఎదురుగా మరో వాహనం వచ్చి ఉండవచ్చని దీంతో డ్రైవర్‌కి ఏమి తోచక వాహనాన్ని పక్కకు తిప్పటంతో అదుపు తప్పి వాగులో బోల్తాపడి ఉంటుందని అభిప్రాయపడ్డారు.

సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ..
సోనాపూర్‌ రోడ్డు ప్రమాద సంఘటన సమాచారం అందుకున్న ఎస్పీ కల్మేశ్వర్‌ సింగనేవార్, డీఎస్పీ సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను సీఐ పురుషోత్తంను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో మృతి చెందిన మృతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును ఎస్పీకి వివరించారు. విషయం తెలుసుకున్న బెల్లంపల్లి ఏరియా జనరల్‌ మేనేజర్‌ కె.రవిశంకర్‌ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. 


అందరూ నిరుపేదలే..
బెల్లంపల్లి : కుమురం భీం జిల్లా రెబ్బెన మండలం సోనాపూర్‌ వాగులో బోలెరో అదుపు తప్పి బోల్తాపడి మరణించిన నలుగురు మృతులది ఒక్కొక్కరిది ఒక్కో గాథ. అందరూ నిరుపేదలే. కుటుంబ పోషణ కోసం మెకానిక్, వెల్డింగ్, ఆటోమొబైల్, డ్రైవర్‌ పనులు నిర్వహిస్తూ పొట్టపోసుకునే రోజువారీ వర్కర్లు. వీరందరూ కైరిగూడ ఓసీపీలో పనులు నిర్వహిస్తున్న ‘ధన్‌ సర్‌ ఇంజినీరింగ్‌ వర్క్స్‌ కంపెనీ’ తరఫున ఓ వాహనానికి  మరమ్మతు పనులు నిర్వహించడం కోసం వెళ్లారు. మార్గమధ్యలో ప్రమాదం జరగడంతో ఈ నలుగురు మృత్యుఒడిలోకి చేరుకున్నారు. వీరి అకాల మరణంతో ఆ నలుగురి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రెక్కల కష్టం తప్పా పెద్దగా ఆస్తిపాస్తులు లేని ఆ వర్కర్ల భార్యాబిడ్డలు దిక్కు లేని అనాథలుగా మారారు. 

బతుకు దెరువు కోసం వలస వచ్చి..
విశ్వనాథంపల్లి దుర్గారావుది స్వగ్రామం విజయవాడ. బతుకు దెరువును వెతుక్కుంటూ ఆయన భార్యాపిల్లలతో మంచిర్యాల ప్రాంతానికి వలస వచ్చాడు. లారీ మెకానిక్‌గా పనులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అడపాదడపా ధన్‌సర్‌ ఇంజినీరింగ్‌ వరŠస్క్‌ కంపెనీకి చెందిన వాహనాలకు మరమ్మతులు చేస్తున్న దుర్గారావు అనూహ్యంగా రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడంతో ఆ ఇంట్లో పెద్ద దిక్కు లేకుండా పోయింది. దుర్గారావుకు భార్య పద్మ, కూతుళ్లు సుమతి, వినీత, మమత ఉన్నారు. ముగ్గురు కూతుళ్లు కూడా పెళ్లీడుకు వచ్చి ఉన్నారు. తండ్రి మరణంతో ఆ బిడ్డల భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారింది.

పాల్వంచ నుంచి వచ్చి.. 
బండ్ల కోటేశ్వర్‌రావుది స్వగ్రామం ఖమ్మం జిల్లా పాల్వంచ. సుమారు మూడు దశాబ్దాల క్రితం వలస వచ్చి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎన్టీపీసీ ప్రాంతంలోని సుభాష్‌నగర్‌ బస్తీలో నివాసం ఉంటున్నాడు. కోటేశ్వర్‌రావుకు భార్య నాగమణి, కొడుకులు మహేశ్, వినోద్, ఉమేశ్‌కాగా కూతురు స్వాతి. ఇందులో స్వాతికి వివాహం చేసి అత్తారింటికి పంపించాడు. ముగ్గురు కొడుకుల్లో ఎవరికి పెళ్లి కాలేదు. ఉద్యోగవేటలో ఉన్నారు. కోటేశ్వర్‌రావు లేత్‌ మిషన్‌ వెల్డింగ్‌ పనులు నిర్వహిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు.పెద్దగా ఆస్తి పాస్తులు లేని కోటేశ్వర్‌రావు ప్రమాదం బారిన పడి తనువు చాలించడంతో ఆ కుటుంబం కూడా కష్టాల్లో పడింది.

అనాథలైన భార్యాబిడ్డలు
ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన తిరకాల చరణ్‌కుమార్‌ కూడా ఎన్టీపీసీకి వలస వచ్చి ఆటోమొబైల్‌ వర్క్స్‌ నిర్వహిస్తున్నాడు. వలస వచ్చి ఇప్పటికీ రెండున్నర దశాబ్దాలు గడచింది. అతడికి రెక్కల కష్టం తప్పా ఆస్తిపాస్తులు లేవు. మృతుడికి భార్య స్వప్న, ఎనిమిదేళ్ల కూతురు భార్గవి, పదేళ్ల కొడుకు ప్రవీణ్‌ ఉన్నాడు. మరో మృతుడు బండ్ల కోటేశ్వర్‌రావుకు చరణ్‌కుమార్‌ సమీప బంధువు అవుతాడు. ఇద్దరిది ఒకే ప్రాంతం కావడం, బతుకు దెరువును వెతుక్కుంటూ ఇద్దరు కూడా ఎన్టీపీసీకి వచ్చారు. కొన్నేళ్ల నుంచి వాహనాల మెకానిక్‌ పనులు కలిసిమెలిసి నిర్వహిస్తున్న ఆ ఇద్దరిని మృత్యువు ఒకేసారి తీసుకెళ్లడం బాధిత కుటుంబాలకు తీరని సోకం మిగిలిచింది. చరణ్‌కుమార్‌ అకాల మరణంతో భార్య, చిన్నారులైన కూతురు, కొడుకు అనాథలయ్యారు.

నెల రోజుల క్రితం విధుల్లో చేరి
జార్ఘండ్‌ రాష్ట్రం ధన్‌బాద్‌కు చెందిన ఎయాజ్‌ఖాన్‌ నెల రోజుల క్రితం రెబ్బెనకు వచ్చాడు. ధన్‌సర్‌ ఇంజనీరింగ్‌ వరŠక్క్‌ కంపెనీలో వాహన డ్రైవర్‌గా విధుల్లో చేరాడు. అతడి కుటుంబీకులు ధన్‌బాద్‌లోనే ఉంటున్నారు. ఇదివరకు ఆయన మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో సదరు కంపెనీలో పనిచేశాడు. ప్రస్తుతం రెబ్బెనకు వచ్చి ధన్‌సర్‌ ఇంజనీరింగ్‌ వర్క్స్‌ కంపెనీ వాహన డ్రైవర్‌గా కుదిరాడు. ఓ వాహనం మరమ్మతుల కోసం చరణ్‌కుమార్, కోటేశ్వర్‌రావు, దుర్గారావును ఇళ్లకు వెళి బొలెరో వాహనంలో ఎక్కించుకుని కైరిగూడ ఓసీపీకి వెళ్తూ అకాల మృతి చెందాడు. మృతుడు స్థానికుడు కాకపోవడంతో కుటుంబ వివరాలు సమగ్రంగా తెలియరాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

ప్రమాదానికి కారణమైన బ్రిడ్జి , మృతదేహాలను బయటకు తీస్తున్న స్థానికులు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement