సాక్షి,ఆదిలాబాద్ : అబ్బురపరిచే అందాలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. ఎటు చూసిన పచ్చదనం, దట్టంగా ఉండి ఆహ్లాదాన్ని పంచే అడవులు, చెంగుచెంగున పరుగు తీసే వన్యప్రాణులు, పక్షుల కిలకిలరావాలు, గలగల పారే సెలయేర్లు..ఇలాంటి ఎన్నో అందాలకు నెలవు ఉమ్మడి ఆదిలాబాద్. ఈ ప్రాంతం మరో కశ్మీర్‌లా పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటోంది. బాసరలో నెలకొన్న జ్ఞానసరస్వతి, కుంటాల జలపాతం, కవ్వాల్‌లో వన్యప్రాణులు, జైపూర్‌లో మొసళ్లమడుగు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చూడతగిన ప్రదేశాలకు నిలయం మన జిల్లా. నేడు పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లాలోని టూరిజంపై కథనం.
కవ్వాల్‌లో చూడదగిన ప్రదేశాలు...
ఎటు చూసిన పచ్చదనం, దట్టంగా నిటారుగా ఉండి ఆహ్లాదాన్ని పంచే అడవులు, చెంగు చెంగున పరుగులు తీసే వన్యప్రాణులు, పక్షుల కిలకిల రావాలు, గలగల పారే సెలయేరులు ఇవన్నింటికి చిరునామ కవ్వాల్ అభయారణ్యం. నిత్యం తమ పనుల్లో బిజీబిజీగా గడిపే వారు తమ కుటుంబంతో కొంత రిలాక్స్ అయ్యేందుకు సూదూర ప్రాంతాల వారు వచ్చి బస చేసే సౌకర్యం ఏర్పాటు చేశారు. గిరిజనుల ఆటపాట, వారు తయారు చేసిన వెదురు వస్తువులు, ఇక్కడ చూడవచ్చు.
పచ్చదనంతో పర్యాటకులకు అహ్లాదాన్ని పంచుతూ అడవులను చూడటానికి సుదూర ప్రాంతాల నుంచి ప్రకృతి ప్రేమికులు నిత్యం వస్తుంటారు. వీరికి పర్యటకశాఖ ఆధ్వర్యంలో బస చేసేందుకు కార్టేజీలు, రెస్టారెంట్లతో పాటుగా సఫారీ సౌకర్యం కల్పించారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ నుంచి నుంచి జూన్ వరకు జంగల్ సఫారీ ద్వారా అడవుల్లో 15 నుంచి 20 కీమీ దూరం తిప్పుతారు.
ముఖ్యమైన ప్రదేశం టైగర్‌జోన్
కవ్వాల్ అభయారణ్యాన్ని 2012 ఎప్రిల్ 10 న కేంద్ర ప్రభుత్వం టైగర్‌జోన్‌గా ప్రకటించింది. ఈ టైగర్‌జోన్ లో అప్పుడప్పుడు వస్తు , పోయే పులితో పాటుగా చిరుత పులులు, ఎలుగుబంట్లు, లాంటి క్రూరమృగాలతో పాటు అడవి దున్నలు, నీలుగాయిలు, సాంబర్లు, చుక్కల దుప్పులు, కొండగొర్రెలు, మనుబోతులు, కుందేళ్లు, ముళ్లపంది, అడవి పందులు, తోడేళ్లు లాంటి వన్యప్రాణులు ఇక్కడ నివసిస్తుంటాయి.
చూడాల్సిన ప్రదేశాలు
కవ్వాల్ టైగర్‌జోన్‌లో అనేక చూడదగిన ప్రదేశాలున్నాయి. కొన్ని ప్రదేశాల వరకు మాత్రమే అటవిశాఖ అనుమతి ఇచ్చింది. వాటిలో మల్యాల, కల్పకుంట వాచ్‌టవర్లు, నీలుగాయి కుంట, గడ్డి క్షేత్రాలు, సొలార్‌కుంట, బేస్‌క్యాంపులున్నాయి.
ఎలా రావచ్చు..
జన్నారంలోని కవ్వాల్ అభయారణ్యం చూడటానికి హైదరాబాద్ నుంచే కాకుండా తెలంగాణలోని పలు జిల్లాల నుంచి వచ్చేందుకు రైలు, రోడ్డు మార్గాలున్నాయి. హైదరాబాద్ నుంచి 250కి.మీ దూరం ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఆదిలా బాద్ జిల్లాకు చెందిన బస్సులు ప్రతిరోజు రాకపోకలు కొనసాగిస్తాయి. ఆదిలాబాద్ నుంచి మంచిర్యాలకు వెళ్లే బస్సుల ద్వారా జన్నారంకు చేరుకోవచ్చు. నిర్మల్, కొమురంభీం జిల్లా ల నుంచి బస్సు సౌకర్యాలు ఉన్నాయి. ఆదిలాబాద్ నుంచి 100కి.మీ, నిర్మల్ నుంచి 80, కుమురంభీం జిల్లా నుంచి 120కి.మీ దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
చూడదగిన ప్రదేశం జోడేఘాట్
జల్.. జంగల్.. జమీన్ కోసంబ అసువులు బాసి అమరవీరుడైన ఆదివాసీ ముద్దుబిడ్డ కుముర భీం పోరుగడ్డలోని భీం మ్యూజియం పర్యాటకులను ఆకట్టుకుటుంది. ప్రతి రోజు అనేక మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చి మ్యూజియంలోని పరికరాలను తిలకిస్తారు. నాటి ప్రభుత్వం జోడేఘాట్‌ను గుర్తించక పోగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు విడుదల చేసి దీనికి ప్రత్యేక ఖ్యాతిని తెచ్చిపెట్టింది.
ఇలా వెళ్లాలి...
కెరమెరి మండలంలోని హట్టి గ్రామం నుంచి జోడేఘాట్‌కు 22కిలో మీటర్ల దూరం ఉంది. ఆసిపాబాద్ నుంచి 52, ఆదిలాబాద్ నుంచి 123 కిటో మీటర్ల దూరం, ఆసిపాబాద్ నుంచి ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ఆర్‌టీసీ బస్సు సౌకర్యం ఉంది. ఆసిఫాబాద్ నుంచి రూ.35, కెరమెరి నుంచి రూ.19బస్సు టిక్కట్టు ఉంది. కెరమెరి నుంచి ఆటోలు ప్రతి రోజు నడుస్తాయి. హట్టి నుంచి జోడేఘాట్ వరకు బీటీరోడ్డు సౌకర్యం ఉంది.
చారిత్రక ప్రదేశం పార్‌పల్లి
పర్యాటకులు కోటపల్లి మండలం పార్‌పల్లి గ్రామంలోని కొండపై కొలువున్న భైరవస్వామి ఆలయం చూడదగిన ప్రదేశం. దీనిని అభివృద్ధి చేస్తే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ గ్రామంలోని ప్రజలు శుభకార్యాలు ప్రారంభించే ముందు భైరవస్వామిన దర్శించుకుంటారు. గోదావరి నది పరివాహక ప్రాంతంలో పూర్వకాలంలో మునులు, రుషులు తపస్సు చేసేవారని తెలుస్తోంది. మండలంలోని పార్‌పల్లి సమీపంలోని గుట్టపై స్వయంభుగా వెలసిన భైరవుడి జయంతిని శనివారం ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది.
కనువిందు చేస్తున్న కుంటాల
ప్రకృతి సహజ సిద్ధమైన కుంటాల జలపాతం పచ్చని అడవితల్లి ఒడిలో సెలయేళ్ల పరవళ్లు తొక్కుతున్న జలధారాలతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. కొండ కోనలు.. పచ్చని పందిరి లాంటి చెట్ల నడుమ జాలువారే జలధారలు.. ఇది జిల్లాలో ప్రకృతి వరప్రసాదమైన కుంటాల జలపాతం ప్రత్యేకత. ఇక్కడ ఆహ్లాదాన్ని ఆస్వాదించడానికి ఇతర రాష్ట్రాల నుంచి ప్రకృతి ప్రేమికులు నిత్యం వస్తుంటారు. పరిశ్రమలు, కార్యాలయాల్లో పనిచేసే కార్మికులు, అధికారులు, ఉద్యోగులు, యువత మానసిక ఉల్లాసానికి వారంతపు సెలువుల్లో వేల సంఖ్యల్లో వస్తారు.
రాష్ట్రంలోనే ప్రసిద్ధి...
రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రాల్లో కుంటాల జలపాతం ఒకటి. ఇది ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రం నుంచి 12కిలో మీటర్ల దూరం వెళ్లితే దట్టమైన అటవీ ప్రాంతంలో పాలనురుగుల పరవళ్లతో కనిపిస్తోం ది. శని,ఆదివారాల్లో హైదరాబాద్, కరీం నగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలతో పాటు మహరాష్ట్ర, ఆంధ్ర, ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల నుంచి విద్యార్థులు, యువత, వివిధ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు ఆ జలధారలు, చుట్టూర అటవీ ప్రాంతం మధ్యలో నుంచి జాలువారే జలధారాలను చూస్తూ మంత్రముగ్ధులవుతారు.
పాపికొండలను తలపించే అందాలు
చెన్నూర్ మండలంలోని సోమన్‌పల్లి ప్రాంతంలోని గోదావరి నది తీరంలో సుమారు రెండు వందల ఏళ్ల క్రితం పాండవులు సంచరించారనే ప్రాచీన చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. మండలంలోని సోమన్‌పల్లి నది తీరంలో శివాలయం, భీముని లొద్ది, బుగ్గమలన్న ఆలయాలు ఉన్నాయి. గతంలో ఈ ప్రాంత వాసులు ఈ ఆలయాల్లో పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకునే వారు. గ్రామానికి దూరంగా ఉండడంతో పాటు రోడ్డు సౌకర్యం లేక అటవీ ప్రాంతం కావడంతో భక్తుల రాక రోజు రోజుకు తగ్గుముఖం పట్టింది. భీముడు సోమన్‌పల్లి గుట్ట మీద ఒక్క అడుగు భీమినిలో మరో అడుగు వేసి వెళ్లాడని ఇక్కడ ఉన్న భీముని అడుగే ఇందుకు నిదర్శనమని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకాభివృద్ధి చేస్తే మరో పాపికొండలను తలపిస్తుందని స్థానికులంటున్నారు.
తెలంగాణ అన్నవరంగా.. గూడెం
ఉమ్మడి రాష్ట్రంలో రెండో అన్నవరంగా, ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ అన్నవరంగా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయం ప్రసిద్ధికెక్కింది. 1964లో గూడెం గ్రామ వాస్తవ్యుడు శ్రీ గోవర్ధన పెరుమాండ్ల స్వామి అనే చాదాత్త వైష్ణవుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. అప్పటినుంచి ఈ ఆలయం దినదినాభిభివృద్ధి చెందుతోంది. ఈ ఆలయం 63వ జాతీయ రహదారికి పక్కనే ఉండటంతో నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. ఆలయ సమీపాన్నే పవిత్ర గోదావరి నది ప్రవహించడంతో ఆలయానికి వచ్చిన భక్తులు గోదావరినదిలో పుణ్యస్నానాలు ఆచరించి సత్యదేవున్ని దర్శించుకుంటారు.
వెళ్లడం ఇలా...
గూడెం సత్యనారాయణస్వామి ఆలయం జిల్లా కేంద్రం మంచిర్యాలకు 30కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. ఆలయానికి కరీంనగర్ నుంచి వచ్చే వారు లక్సెట్టిపేట, లేదా, వయా లక్సెట్టిపేట మీదుగా ఆదిలాబాద్, మంచిర్యాల వెళ్లే బస్సుల్లో రావచ్చు. ఈ బస్సులు ఆలయం ముందునుంచే వెళ్తాయి కాబట్టి ఆలయం వద్దనే దిగొచ్చు. నిజామాబాద్, జగిత్యాల వైపు నుంచి వచ్చే వాళ్లు లక్సెట్టిపేట, మంచిర్యాల వెళ్లేవారు బస్సుల్లో రావచ్చు. ఆదిలాబాద్ నుంచి వచ్చే వాళ్లు మంచిర్యాల, లేదా వయా లక్సెట్టిపేట మీదుగా కరీంనగర్, హైదరాబాద్, వరంగల్, గుంటూరు, ఖమ్మం వెళ్లే బస్సుల్లో రావచ్చు.
నిర్మల్ జిల్లా.. పర్యాటక ఖిల్లా
పచ్చని చెట్లు, గలగల పారే గోదారి అలలు, ఎగిసి పడే జలపాతాలు, చెంగున ఎగిరే వన్యప్రాణులున్న అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్‌లోకి స్వాగత తోరణంలా ఉంటుంది నిర్మల్ ఖిల్లా. హైదరాబాద్ నుంచి వచ్చే పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది. నూతనంగా ఏర్పడిన నిర్మల్ జిల్లాలో ప్రధాన పర్యాటక పుణ్యక్షేత్రం బాసర. జిల్లాకు పడమరన ఉన్న ఈ ఆలయం దక్షిణ భారతాన గల ఏకైక సరస్వతీ క్షేత్రం. నాలుగు వందల ఏళ్ల కిందట నిర్మించిన నగరం నిమ్మల. అదే కాలక్రమంలో నిర్మల్‌గా మారింది. ఇక్కడి నకాశీ కళకు అంతే చరిత్ర ఉంది.
ఏకైక క్షేత్రం..బాసర
వేదాలు, ఉపనిషత్తులు, మహాభారతాన్ని రాసిన వేదవ్యాసుడి చేతుల మీదుగా సరస్వతమ్మ ఇక్కడ ప్రాణం పోసుకుంది. తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్న గోదావరి నది నిర్మల్ జిల్లా బాసర వద్దే రాష్ట్రంలోకి అడుగు పెడుతోంది. గోదారి ఒడ్డున పచ్చని చెట్లు, ప్రశాంత వాతావరణంలో గల కోవెలలో చదువుల తల్లి కొలువై ఉంది. ఈ అమ్మ ఒడిలోనే తమ పిల్లలకు అక్షర శ్రీకారాలు చేయిస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment