సాక్షి, కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తుపాలకుగూడెం ఆనకట్ట పనులను పరిశీలించారు. ఉదయం కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి కాళేశ్వరం ప్రాజెక్టు, అనుభంద రిజర్వాయర్లలను పరిశీలించారు. తుపాలకులగూడెంలో గోదావరిపై నిర్మించే బ్యారేజీ, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల పనులను పరిశీలించారు. కేసీఆర్‌తో పాటు మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, డీజీపీ మహేందర్‌రెడ్డి, నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి తదితర అధికారులు, ఇంజినీర్లు ఉన్నారు. కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది.
అనంతరం పెద్దపల్లి జిల్లా సుందిళ్ల, గోలివాడలో నిర్మించే బ్యారేజీలను, రివర్స్ పంపింగ్ పనులను కేసీఆర్ పరిశీలిస్తారు. తర్వాత రామగుండం ఎన్టీపీసీలో బస చేస్తారు. శుక్రవారం రామగుండం నుంచి బయల్దేరి పెద్దపల్లి జిల్లా మేడారం వద్ద నిర్మించే కాళేశ్వరం ప్రాజెక్టు ఆరో ప్యాకేజీ పంప్ హౌజ్ పనులను, కరీంనగర్ జిల్లా రామడుగులో 8 వ ప్యాకేజీ పంప్‌హౌజ్ పనులు పరిశీలన చేస్తారు. రామడుగులో అధికారులతో ప్రాజెక్టుల ప్రగతిపై సమీక్షిస్తారు. అనంతరం జగిత్యాల జిల్లా రాంపూర్ వద్ద నిర్మించే రివర్స్ పంపింగ్ బ్యారేజ్ పనులను, అక్కడ్నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు ప్రాజెక్టు పనులను ఏరియల్ సర్వే చేసి సాయంత్రం హైదరాబాద్ కు పయనమవుతారు.
పోలీసుల ఆంక్షలు
కరీంనగర్‌లో సీఎం కేసీఆర్ బస చేసిన ఉత్తర తెలంగాణ భవన్ వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. కేసీఆర్‌ను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన కార్యకర్తలు పోలీసులతో గొడవకు దిగారు. ఈ నేపథ్యంలో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో కరీంనగర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీంద్రరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి.
మొరాయించిన హెలికాఫ్టర్
ప్రాజెక్టుల పరిశీలన నిమిత్తం కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లి నుంచి బయల్దేరే సమయంలో హెలికాఫ్టర్ మొరాయించింది. దీంతో పర్యటనకు అంతరాయం ఏర్పడింది. తక్షణమే అధికారులు స్పందించి హెలికాఫ్టర్‌లో వచ్చిన సాంకేతిక సమస్యను పరిష్కరించడంతో సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల పరిశీలనకు బయలుదేరారు.
Comments
Please login to add a commentAdd a comment