
మల్లన్నసాగర్‌ను ఎందుకు అడ్డుకుంటున్నారు?
మెదక్ ప్రజలకు ఉత్తమ్ సమాధానం చెప్పాలి: హరీశ్‌రావు
సాక్షి, సంగారెడ్డి: కరువు కాటకాలతో అల్లాడుతున్న మెదక్ జిల్లాకు సాగునీటిని అందించే మల్లన్న సాగర్ ప్రాజెక్టును ఎందుకు అడ్డుకుంటున్నారో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం సంగారెడ్డిలో ఆయన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడుతూ.. మల్లన్నసాగర్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులు కోర్టులో కేసు వేశారని తెలిపారు.
తెలంగాణలోని ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వని పులించింతల ప్రాజెక్టులో 14 గ్రామాలను ముంచిన ఘనత ఉత్తమ్‌కుమారెడ్డిదని హరీశ్ విమర్శించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టుతో నాలుగు జిల్లాలకు మేలు జరుగుతుందన్నారు. కానీ, కాంగ్రెస్ నాయకులు మాత్రం కుట్ర పూరితంగా ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మల్లన్నసాగర్ పూర్తయితే మెదక్ జిల్లాలో 7.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందటంతోపాటు.. సింగూరు ప్రాజెక్టుకు గోదావరి జలాలు తరలించే అవకాశం ఉంటుందన్నారు.
సింగూరుకు గోదావరి జలాలను తరలించ వద్దా? అని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహను మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. 2013 భూ సేకరణ చట్టం రుద్దు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తే.. టీడీపీ సంతకం చేసిన విషయం వాస్తవం కాదా? అని అన్నారు. 2013 చట్టం రద్దు చేయాలని కోరుతున్న బీజేపీ మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో మాత్రం అదే చట్టం అమలు చేయాలని కోరటం ఆ పార్టీ రెండు నాల్కల ధోరణికి నిదర్శమన్నారు.
పోలవరం కోసం చంద్రబాబు ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ముంచితే.. ఏ ఒక్క టీడీపీ నాయకుడూ మాట్లాడలేదన్నారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలతో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డితో కలిసి తాను అనేకసార్లు మాట్లాడానని తెలిపారు. కరువుతో అల్లాడుతున్న మెదక్ జిల్లాలో 7.5 లక్షల ఎకరాలకు సాగునీరందించే మల్లన్నసాగర్ ప్రాజెక్టు సామర్థ్యం తగ్గించే ప్రసక్తే లేదని మంత్రి హరీశ్ స్పష్టం చేశారు.