సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టుల జోలికి రాకుండా కేసీఆర్ పదేళ్లు అడ్డుకున్నారని.. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని ప్రాజెక్టులను కృష్ణా బోర్డు (కేఆర్‌ఎంబీ)కు అప్పగించిందని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు మండిపడ్డారు. ఈ విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకు మితిమీరిన అహంకారంతో, సంస్కారం లేని భాషలో సీఎం రేవంత్‌రెడ్డి వితండవాదం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సోమవారం తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జనవరి 17న కృష్ణాబోర్డు సమావేశం జరిగింది. ఏడు రోజుల్లోగా రాష్ట్ర ప్రాజెక్టులను అప్పగించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నెలరోజుల్లోగా 15 ఔట్‌లెట్లను అప్పగిస్తామని చెప్పింది. ఇంత అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారని నేను ప్రెస్‌మీట్ పెట్టి నిలదీశాను. ఇప్పుడు తమ తప్పులేదంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు.
రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు
కృష్ణాబోర్డు రెండో మీటింగ్ ఫిబ్రవరి 1న హైదరాబాద్‌లో జరిగింది. ఇంజనీర్లు సీఆరీ్పఎఫ్ అనుమతితోనే ప్రాజెక్టుల వద్దకు వెళ్లాలని అందులో పేర్కొన్నారు. పవర్‌హౌజ్ ఔట్‌లెట్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కావాలన్నారు. మరి ప్రాజెక్టులను అప్పగించినది నిజం కాకుంటే రెండు రాష్ట్రాల ఉద్యోగుల నిష్పత్తి, వారి జీతాల చెల్లింపు దాకా చర్చ ఎందుకు జరిగింది? రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా నిర్ణయం తీసుకుని ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నారు. కేసీఆర్ పదేళ్లుగా ప్రాజెక్టులను అప్పగించకుండా ఉంటే.. కాంగ్రెస్ వాళ్లు రెండు నెలల్లో ఢిల్లీ చేతిలో పెట్టి అడుక్కుతినే పరిస్థితికి తెచ్చారు.
మేం కృష్ణాబోర్డు పరిధిని ఒప్పుకోలేదు
2022లో జరిగిన కృష్ణాబోర్డు 16వ సమావేశంలో గానీ, 2023లో జరిగిన 17వ సమావేశంలోగానీ ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించాలనే ప్రతిపాదనకు బీఆర్‌ఎస్ సర్కారు ఒప్పుకోలేదు. 16వ సమావేశంలో శ్రీశైలం ప్రాజెక్టులో రెండు, నాగార్జునసాగర్‌లో ఏడు కంపోనెంట్స్‌ను అప్పగించే ప్రతిపాదనకు ఒప్పుకోబోమని చెప్పాం. ఏపీ ఒప్పుకుందని, తెలంగాణ నిర్ణయం పెండింగ్‌లో ఉందని మినిట్స్‌లో స్పష్టంగా ఉంది. అలాగే ఈ అంశాన్ని అపెక్స్ కమిటీకి పంపాలని 17వ సమావేశంలో స్పష్టంగా చెప్పాం. కేసీఆర్ సంతకాలు చేశారని రేవంత్ అంటున్నారు. ఆ సమావేశానికే రాని కేసీఆర్ సంతకాలు చేశారనడం పచ్చి అబద్ధం. ఇంతకంటే జుటా సీఎం ఉంటారా?
అప్పుడు మేం సర్కారులోనే లేము
వైఎస్సార్ పోతిరెడ్డిపాడును వెడల్పు చేసే జీఓ తెచ్చినప్పుడు మేం కాంగ్రెస్ ప్రభుత్వంలో లేము. 610 జీవో అమలు, పులివెందుల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2005 జూలై 4న మంత్రి పదవులకు రాజీనామా చేశాం. తర్వాత సెపె్టంబర్ 13న పోతిరెడ్డిపాడు జీఓ వచ్చింది. అలాంటిది మేం పదవుల్లో ఉన్నపుడు పోతిరెడ్డిపాడు జీఓ వచ్చిందని రేవంత్ ఎలా మాట్లాడారు? నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ నేతలే పదవుల కోసం పెదవులు మూసుకున్నారు. మాతో గొంతు కలిపినది పీజేఆర్ ఒక్కరే. జీవోకు వ్యతిరేకంగా మేం పోరాటం చేశాం. 40రోజులు అసెంబ్లీని స్తంభింపజేశాం. పదవుల కోసం పార్టీలు మారిన చరిత్ర మీదైతే.. పేగులు తెగేదాక కొట్లాడిన చరిత్ర మాది.
మొదట వ్యతిరేకించింది మేమే..
రాయలసీమ లిఫ్ట్‌కు వ్యతిరేకంగా మొదట స్పందించినది బీఆర్‌ఎస్ పార్టీనే. రెండో అపెక్స్ కమిటీ మీటింగ్‌లో ఏపీ సీఎం జగన్ సమక్షంలోనే కేసీఆర్ వ్యతిరేకించారు. విభజన చట్టాన్ని రూపొందించినదే కాంగ్రెస్ పార్టీ. మీరు తెచ్చిన బిల్లులో కృష్ణాబోర్డు గురించి పెడితే ఆ బాధ్యత మీది కాదా? తెలంగాణ ఉద్యమానికి కారణమే నీటి సమస్య. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరగలేదని మంత్రి ఉత్తమ్ అనడం ఎంతవరకు సమంజసం? జయశంకర్ గారిని, అమరుల త్యాగాలను తప్పుపట్టేలా మీరు మాట్లాడుతున్నారు.
మేం పుట్టిందే తెలంగాణ కోసం..
మీరు తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు తరలించే ప్రయత్నం చేస్తే.. కేసీఆర్ పంట పొలాలకు తరలించారు. సీఎం రేవంత్ వద్ద సబ్జెక్ట్ లేక గాయిగత్తర చేస్తున్నారు. అసెంబ్లీలో సరైన సమాధానం చెప్తాం. బూతులతో బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తే ఊరుకోబోం. గతంలో ప్రిపేర్ కాక అడ్డంగా దొరికిపోయిన రేవంత్.. ఈసారి అసెంబ్లీకి ప్రిపేరై రావాలి. చర్చిద్దాం. మంచి చెడూ అన్ని తెలుస్తాయి. మేం పుట్టిందే తెలంగాణ కోసం. రేవంత్ నోరు జారినా, రెచ్చగొట్టినా.. మేం రెచ్చిపోం. తెలంగాణ హక్కుల కోసం పోరాడుతాం. దమ్ముంటే అఖిలపక్షం ఏర్పాటు చేయండి.. ఢిల్లీకి వెళ్దాం. రేవంత్ భేషజాలకు వెళ్లకుండా ప్రజలకు క్షమాపణలు చెప్పాలి..’’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
విషయం లేకనే వితండ వాదం
Published Tue, Feb 6 2024 4:53 AM | Last Updated on Tue, Feb 6 2024 4:53 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment