సాక్షి, హైదరాబాద్: ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలు, పరీవాహకంలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగుతున్నాయి. ఎగువ నుంచి వరదలై పారుతున్నాయి. ఈ నీరంతా ఆయా పరీవాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టుల్లోకి చేరుతుండటంతో జలాశయాలన్నీ జలకళతో ఉట్టిపడుతున్నాయి. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ల నుంచి సుమారు 2 లక్షల క్యూసెక్కుల మేర వరదను దిగువకు వదలడంతో మన రాష్ట్రంలోని జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి గణనీయంగా పెరిగింది. ఈ ప్రాజెక్టు ఇప్పటికే పూర్తిగా నిండడంతో విద్యుదుత్పత్తి ద్వారా, 17 గేట్లు ఎత్తి 1.65 లక్షల క్యూసెక్కుల (15 టీఎంసీలు) నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నీరంతా గురువారం శ్రీశైలం జలాశయానికి చేరనుంది.
కృష్ణాలో తగ్గని వరద ఉధృతి
మహాబలేశ్వర్, పశ్చిమకనుమల్లో విపరీతంగా కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఏకంగా 2లక్షల17 వేల క్యూసెక్కుల(19.72 టీఎంసీలు) మేర వరద ఆల్మట్టిలోకి పోటెత్తుతోంది. ప్రాజెక్టు ఇప్పటికే నిండడంతో 2లక్షల క్యూసెక్కుల (18.18 టీఎంసీలు)) మేర నీటిని దిగువన ఉన్న నారాయణపూర్‌కు వదులుతున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు సైతం నిండుకుండలా మారడంతో మరో 2 లక్షల క్యూసెక్కుల (18.18 టీఎంసీలు) నీటిని అక్కడి నుంచి కృష్ణానదిలోకి పంపుతున్నారు. ఈ నీరంతా జూరాలకు చేరుతోంది. దీంతో బుధవారం సాయం త్రానికి జూరాలకు 1.70 లక్షల క్యూసెక్కుల (15.45 టీఎంసీలు) మేర నీటిప్రవాహం నమోదైంది.
ప్రాజెక్టు గరిష్ట సామర్థ్యం 9.65 టీఎంసీ లు కాగా, 5.8 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి మిగిలిన నీటిని దిగువకు వదిలేస్తున్నారు. జూరాలపై ఆధారపడ్డ నెట్టెంపాడు ద్వారా 1,500 క్యూసెక్కులు, భీమా 1,300, కోయిల్‌సాగర్ 325, జూరాల కుడి, ఎడమకాల్వలకు 1,800 క్యూసెక్కుల నీటిని పంపించేస్తున్నారు. మరో 20 వేల క్యూసెక్కుల (1.8 టీఎంసీలు)ను విద్యుదుత్పత్తి ద్వారా 1.40 లక్షల క్యూసెక్కుల (12.72 టీఎంసీలు)ను గేట్ల ద్వారా శ్రీశైలానికి వదులుతున్నారు. ఈ నీరంతా గురువారం ఉదయానికల్లా శ్రీశైలం చేరే అవకాశం ఉంది. శ్రీశైలంలో 215 టీఎంసీలకుగాను ప్రస్తుతం 32 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది.
గోదా‘వరదే’
గోదావరి నదిలోనూ వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఎగువ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో ప్రాణహిత నది ఉగ్రరూపం దాలుస్తోంది. మేడిగడ్డ వద్ద బుధవారం 2 లక్షల క్యూసెక్కుల మేర వరద ప్రవాహం నమోదు కాగా, బ్యారేజీలోని 30గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నా రు. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీలో 6.15టీఎంసీలు, అన్నారంలో 5.13టీఎంసీలు, సుందిళ్లలో 6టీఎంసీల నీటి నిల్వలున్నాయి. మేడిగడ్డ, అన్నారం పంప్‌హౌస్‌లను పూర్తిగా నిలిపివేయగా, సుందిళ్లలో ఒక మోటారుకు బుధవారం వెట్‌రన్ నిర్వహించారు. ఇక, ఎల్లంపల్లిలోకి సైతం నీటి ప్రవాహాలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
ఎగువ కడెం, స్థానిక పరివాహకం నుం చి బుధవారం ఉదయం 20వేల క్యూసెక్కుల (1.8 టీఎంసీలు) నీరు రాగా, మధ్యాహ్నం 13వేల క్యూసెక్కులు (1.18 టీఎంసీలు), సాయంత్రం 8 వేల క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతోంది. మొత్తం 20 టీఎంసీలకు గాను ప్రస్తుతం ప్రాజెక్టులో 8.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇక, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులోకి కూడా 5 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 7.6 టీఎంసీలకుగాను ప్రస్తుతం 4.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment