సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు, వాటిపై ఆధారపడ్డ ఎత్తిపోతల పథకాల కింద వానాకాలంలో ఇప్పటికిప్పుడు పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరివ్వడం సాధ్యం కాదని రాష్ట్ర సాగునీటి సమీకృత, నీటి నిర్వహణ, ప్రణాళిక స్టాండింగ్ కమిటీ (శివమ్) తేల్చింది. ఒక్క శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోనే చెప్పుకోదగ్గ స్థాయిలో నీటి లభ్యత ఉన్నందున ఇక్కడ తాగునీటి అవసరాలకు పక్కనపెట్టి మిగిలిన 20 టీఎంసీలను వానాకాలం పంటల అవసరాలకు ఇవ్వాలని నిర్ణయించింది. ఇది మినహా మరెక్కడా తగినంత నీటి లభ్యత లేనందున నీటి విడుదల సాధ్యం కాదని, ప్రవాహాలు వచ్చాకే ఆయకట్టుకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని నిశ్చయానికి వచ్చింది.
9 టీఎంసీలు తాగునీటికి పక్కనపెట్టి...
రాష్ట్రంలో భారీ, మధ్యతరహా, చిన్నతరహా ప్రాజె క్టుల పరిధిలో నీటి లభ్యత, వినియోగం, తాగు, సాగునీటి అవసరాలపై చర్చించేందుకు బుధవారం నీటిపారుదలశాఖ శివమ్ కమిటీ హైదరాబాద్‌లోని జలసౌధలో సమావేశమైంది. ఈ భేటీలో ఈఎన్‌సీలు మురళీధర్, నాగేంద్రరావు, అనిల్‌కుమార్, వెంకటేశ్వర్లు, అన్ని ప్రాజెక్టులు, జిల్లాల చీఫ్ ఇంజ నీర్లు పాల్గొన్నారు. ప్రభుత్వం మిషన్ భగీరథ కింద తాగునీటికి ప్రాధాన్యత ఇస్తున్న దృష్ట్యా ఆ అవసరాల మేరకు ప్రాజెక్టుల పరిధిలో కనీస నీటిమట్టాలను నిర్వహిస్తూనే సాగుకు నీటి విడుదల అంశంపై చర్చించారు.
ఎస్సారెస్పీలో ప్రస్తుతం 90 టీఎంసీలకుగాను 29 టీఎంసీల నీటి లభ్యత ఉందని, తాగునీటికి 9 టీఎంసీలను పక్కనపెట్టి 20 టీఎంసీలను సాగునీటికి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ 20 టీఎంసీలను స్థానిక అవసరాల మేరకు వచ్చే 2 నెలలపాటు ఎల్‌ఎండీ ఎగువన ఉన్న 4.60 లక్షల ఎకరాలకు విడుదల చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత ప్రాజెక్టుల్లోకి వచ్చే ప్రవాహాల ద్వారా, లేనిపక్షంలో కాళేశ్వరం ద్వారా పునరుజ్జీవన పథకాన్ని వాడుకొని నీటిని ఇవ్వాలని నిర్ణయించారు. ఎస్సారెస్పీకి పూర్తిస్థాయిలో నీరొస్తే ఎల్‌ఎండీ ఎగువ, దిగువన ఉన్న 9.60 లక్షల ఎకరాలతోపాటు స్టేజ్–2 కింద 3.50 లక్షల ఎకరాలకు నీరివ్వనున్నారు.
100 టీఎంసీలు వస్తేనే సాగర్ కింద..
సాగర్ ఎడమ కాల్వ కింద ఈ ఏడాది 6.30 లక్షల ఎకరాలకు, ఏఎంఆర్‌పీ కింద 2.63 లక్షలు, మూసీ, డిండి, ఆసిఫ్‌నహర్‌ల కింద 57 వేల ఎకరాల మేర ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించారు. 9.50 లక్ష ల ఎకరాలకు నీరివ్వాలంటే కనీసం 105 టీఎంసీలు అవసరం అవుతాయని శివం కమిటీ లెక్కగట్టింది. ఇందులో సాగర్ కింద వానాకాలం అవసరాలు 60 టీఎంసీలు ఉంటాయని తేల్చింది. ప్రస్తుతం సాగర్‌లో నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకుగాను 169. 10 టీఎంసీల నీరు ఉంది. ఇందులో కనీస నీటిమట్టాలకు ఎగువన ఉన్నది 40 టీఎంసీలే. ఈ నీటితో నల్లగొండ, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు పక్కన పెట్టాలని కమిటీ నిర్ణయించింది.
ఎగువ ఆల్మట్టి, నారాయణపూర్‌లు నిండాలంటే మరో 75 టీఎంసీల మేర నీరు కావాల్సి ఉందని, మంచి వర్షాలు కురిసి ప్రవాహాలు పెరిగితే 15 రోజుల్లో ఇవి నిండుతాయని అంచనా వేసింది. ఇక శ్రీశైలం లో 215 టీఎంసీలకుగాను కేవలం 35 టీఎంసీల లభ్యత ఉన్నందున కల్వకుర్తి కింద 4.50 లక్షల ఎకరాలకు నీటి విడుదల సాధ్యం కాదని కమిటీ అభిప్రాయపడింది.
జూరాలపై ఉన్న కోయిల్‌సాగర్, భీమా, నెట్టెంపాడు కింద సైతం వరదొస్తే 5 లక్షల ఎకరాలకు నీరివ్వొచ్చని తేల్చింది. సింగూరులో నీటి లభ్యత లేని దృష్ట్యా 40 వేల ఎకరాలకు నీరిచ్చే పరిస్థితి లేదని, నిజాంసాగర్ కింద సైతం నీరివ్వలేమంది. మధ్యతరహా ప్రాజెక్టులైన కడెం, కొమురం భీం, తదితర ప్రాజెక్టుల్లోకి నీరొస్తే 2 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment