
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల ఆపరేషనల్ ప్రోటోకాల్ ప్రకటిస్తూ 1996లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 69 ఇకపై చెల్లుబాటు కాదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో మారిన తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టుల నీటి అవసరాలకు కొత్త ఆపరేషనల్ ప్రోటోకాల్స్‌ను ట్రిబ్యునల్ రూపొందించాల్సి ఉంటుందని పేర్కొంది.
రెండు రాష్ట్రాలకు జరిపే తుది నీటికేటాయింపుల ఆధారంగా వీటిని తయారు చేయాలని తెలిపింది. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట శుక్రవారం జరిగిన వాదనల్లో తెలంగాణ తరఫున సాక్షిగా ఉన్న కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చేతన్ పండిట్ ఏపీ తరఫు న్యాయవాది అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. కృష్ణాబోర్డు రూపొందించిన ముసాయిదా రూల్ కర్వ్ ఆధారంగా ఆపరేషనల్ ప్రొటోకాల్ తయారు చేయరాదని తెలంగాణ పేర్కొంది.